Infant | ఓ గర్భిణి వింత శిశువుకు జన్మనిచ్చింది. ఆ శిశువు నాలుగు కాళ్లతో జన్మించింది. రెండు కాళ్లు బాగానే ఉన్నప్పటికీ, మరో రెండు కాళ్లు మాత్రం అసాధారణంగా ఉన్నాయి. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్ జిల్లాలోని కామ్లా రాజా హాస్పిటల్‌లో బుధవారం వెలుగు చూసింది.
వివరాల్లోకి వెళ్తే.. సికిందర్ కంపూ ఏరియాకు చెందిన ఆర్తి కుష్వాహాకు నెలలు నిండాయి. దీంతో పురిటి నొప్పులు రావడంతో ఆమె కామ్లా రాజా హాస్పిటల్‌లో చేరారు. బుధవారం రోజు ఆడ శిశువుకు జన్మనిచ్చింది. కానీ ఆ పాప నాలుగు కాళ్లతో పుట్టింది.
ఈ సందర్భంగా జయారోగ్య హాస్పిటల్ గ్రూప్ సూపరింటెండంట్ డాక్టర్ ఆర్కేఎస్ ధకడ్ మాట్లాడుతూ.. ప్రస్తుతం పాప ఆరోగ్యంగా ఉందని తెలిపారు. శిశువు బరువు 2.3 కేజీలుగా ఉందన్నారు. పసిబిడ్డ ఇతర అవయవాలను అన్నింటిని పరీక్షించిన తర్వాత.. అసాధారణంగా ఉన్న రెండు కాళ్లను తొలగించేందుకు ప్రయత్నిస్తామన్నారు. పిండం రెండుగా విడిపోయినప్పుడు ఇలాంటి ఘటనలు జరుగుతాయన్నారు. దీన్ని వైద్య భాషలో ఇషియోపాగస్ అని పిలుస్తారని ధకడ్ పేర్కొన్నారు. అసాధారణంగా ఉన్న రెండు కాళ్లను తొలగిస్తే పాపా సాధారణ జీవితాన్ని గడిపేందుకు ఎలాంటి ఆటంకం కలగదని స్పష్టం చేశారు.
ప్రస్తుతం పాప స్పెషల్ న్యూబార్న్ కేర్ యూనిట్‌లో ఉన్నట్లు తెలిపారు. శిశువు ఆరోగ్య పరిస్థితిని వైద్యులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తారని పేర్కొన్నారు. సర్జరీ చేసి కాళ్లను తొలగించే ప్రక్రియపై వైద్యులు సమీక్షిస్తున్నారని, పాప ఆరోగ్యంగా ఉందన్నారు.