బ్యాంకు లాకర్లలో సొత్తుకు నష్టం జరిగితే బాధ్యత ఎవరిది..? ఆర్‌బీఐ రూల్స్‌ ఏం చెబుతున్నాయంటే..?

  • Publish Date - October 2, 2023 / 02:36 PM IST

విధాత‌: ప్రస్తుత కాలంలో బ్యాంకు లాకర్ల వినియోగం భారీగా పెరిగింది. జీవితాంతం కష్టపడి సంపాదించిన సొత్తు, బంగారు ఆభరణాలు, విలువైన వస్తువులు, ఆస్తి పేపర్లను బ్యాంకు లాకర్లలో దాస్తున్నారు. ఇంట్లో ఉంటే దొంగల భయం తదితర కారణాలతో చాలా మంది బ్యాంకు లాకర్లే మేలని భావిస్తున్నారు.


అయితే, ఇటీవల ఉత్తరప్రదేశ్‌లో జరిగిన ఘటన అందరినీ షాక్‌కు గురి చేసింది. మొరాదాబాద్‌లోని బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా బ్రాంచ్‌లో ఓ అల్కా పాఠక్‌ మహిళ కష్టపడిన సొత్తునంతా బ్యాంకు లాకర్లో దాచుకున్నది. పిల్లలకు ట్యూషన్లు పెంచుకుంటూ జీవిస్తూ కూతురు పెళ్లి కోసం డబ్బునంతా సంపాదించింది.


ఇటీవల ఆర్‌బీఐ కొత్త రూల్స్‌ను తీసుకువచ్చిన నేపథ్యంలో కేవీసీ వివరాలను అప్‌డేట్‌ చేసేందుకు, కొత్త అగ్రిమెంట్‌ కోసం బ్యాంకుకు రావాలని సదరు మహిళను అధికారులు పిలిచారు. దీంతో బ్యాంకుకు వెళ్లి లాకర్‌ తెరిచిన మహిళ ఒక్కసారిగా నిర్ఘాంత పోయింది. ఎంతో కష్టపడి పోగు చేసుకున్న డబ్బంతా లాకర్‌లో దాస్తే చెదపరుగులు తీనేశాయి.


అయితే, రూ.18లక్షల వరకు అందులో దాచుకున్నట్లు ఆ మహిళ పేర్కొంది. ప్రస్తుతం లాకర్‌లో డబ్బులు చెదలు తినడంతో మహిళకు జరిగిన నష్టానికి బాధ్యత ఎవరు వహిస్తారు ? సదరు మహిళకు పరిహారం అందుతుందా ? ఇస్తే ఇంత పరిహారం చేతికందుతుంది ? అనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.


నిబంధనలు ఏం చెబుతున్నాయ్‌..?


ప్రతి ఒక్కరూ బ్యాంకుల్లో ఏవైనా నగదు, విలువైన వస్తువులు, పత్రాలు దాచే ముందు తొలుత నిబంధనలు తీసుకోవడం ముఖ్యం. ప్రస్తుత పరిస్థితుల్లో విలువైన వస్తువులను దాచుకునేందుకు అందరూ బ్యాంకు లాకర్లనే వినియోగిస్తున్నారు. దొంగతనాలు, ప్రమాదాలు తదితర కారణాలతో బ్యాంకు లాకర్‌ అయితే రక్షణగా ఉంటుంది భావిస్తుంటారు.


అయితే, వరదలు, భూకంపం, అల్లర్లు, తీవ్రవాదుల దాడికి సంబంధించిన ఘటనల్లో వినియోగదారుల వస్తువులు దోపిడీకి గురైనా, దెబ్బతిన విలువైన వస్తువులకు గతంలో ఉన్న నిబంధనల ప్రకారం బ్యాంకులే నష్టాన్ని భర్తీ చేసేవి. అయితే, ప్రస్తుతం నిబంధనలు మారిపోయాయి. ఆర్‌బీఐ నిబంధనల్లో మార్పు చేసింది.


కొత్త నిబంధనల ప్రకారం లాకర్‌లో ఉంచిన విలువైన వస్తువులకు బ్యాంకు ఎలాంటి బాధ్యత వహించదు. అయితే, ఇందులోనూ పలు షరతులు ఉన్నాయి. అగ్నిప్రమాదం, దొంగతనం, దోపిడీ, బ్యాంక్‌ భవనం కూలిపోవడం, బ్యాంక్‌ ఉద్యోగుల మోసం తదితన ఘటనల్లో బ్యాంకు భద్రత ఉంటుంది. అయితే, బ్యాంక్ బాధ్యత ఆ లాకర్‌ వార్షిక అద్దెకు వంద రెట్లు మాత్రమే ఉంటుంది.


లాకర్ ఏడాది అద్దె రూ.1000 అనుకుంటే.. లాకర్‌లో ఎంత విలువైన ఆస్తి ఉన్నా బ్యాంకు కేవలం రూ.లక్ష మాత్రమే ఇస్తుంది. అలాగే పలు సందర్భాల్లో జరిగే నష్టానికి మాత్రం బ్యాంకులు బాధ్యత వహించవు. భూకంపాలు, వరదలు, ఇతర ప్రకృతి వైపరీత్యాల కారణంగా బ్యాంకులోని విలువైన వస్తువులు దెబ్బతిన్నా, నష్టపోయినా బ్యాంకులు బాధ్యత వహించబోవు.


నష్టాన్ని ఎందుకు భరించవు..?


లాకర్లలో విలువైన వస్తువులు దాచిన సందర్భంలో ఏదైనా నష్టం జరిగితే బ్యాంకులు బాధ్యత వహించకపోవడానికి పలు కారణాలున్నాయి. బ్యాంకులో తీసుకున్న లాకర్లలో వినియోగదారులు ఏం దాచుతున్నారో స్పష్టంగా తెలియకపోవడం. అందులో దాచిన విలువైన వస్తువుల విలువ తెలియకపోవడమే.


వాస్తవానికి లాకర్‌ అనేది వ్యక్తిగత విషయం కాగా.. అందులో ఏం దాస్తున్నారో ఆ బ్యాంక్‌కు కస్టమర్‌ చెప్పాల్సిన అవసరం ఏమాత్రం లేదు. అయితే, లాకర్‌లో ఏం దాస్తున్నారో బ్యాంకులు పట్టించుకునే పరిస్థితి లేదు. ఈ క్రమంలో బ్యాంకులు లాకర్లలో కస్టమర్లు దాచిన సొత్తుకు పరిహారం నిర్ణయించడం ఏమాత్రం సాధ్యమయ్యే పనికాదు.


సాధారణంగా బ్యాంకుల లాకర్ల రూల్స్ ఒకే తరహాలో ఉటాయి. కొన్ని విషయాల్లో మాత్రం మారుతుంటాయి. ఏవరైనా బ్యాంకు లాకర్‌లను తీసుకునే ముందు అక్కడున్న వాతావరణంతో పాటు నిబంధనలు గురించి మొదట తీసుకోవాలని.. ఆ తర్వాత మాత్రమే లాకర్లను తీసుకోవాలని బ్యాకింగ్‌ రంగ నిపుణులు సూచిస్తున్నారు.