Basara | భక్తులతో కిక్కిరిసిన బాసర సరస్వతీదేవి ఆలయం.. దర్శించుకున్న మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ

Basara విధాత, ప్రతినిధి ఉమ్మడి ఆదిలాబాద్: దక్షిణ భారత దేశంలోనే సుప్రసిద్ద సరస్వతి క్షేత్రమైన నిర్మల్ జిల్లా బాసరలోని శ్రీ జ్ఞాన సరస్వతి దేవి ఆలయం భక్తులతో కిక్కిరిసిపోయింది. సోమవారం అమ్మవారి సన్నిధిలో మాజీ మంత్రి కన్నా లక్ష్మీ నారాయణ కుటుంబ సమేతంగా ఆలయానికి విచ్చేసి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వారి మనుమడు జయదేవ్ కి అమ్మవారి సన్నిధి లో అక్షరాభ్యాసం నిర్వహించారు. కన్నా లక్ష్మీనారాయణకు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి అర్చకులు అమ్మవారి ఆశీస్సులు […]

Basara | భక్తులతో కిక్కిరిసిన బాసర సరస్వతీదేవి ఆలయం.. దర్శించుకున్న మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ

Basara

విధాత, ప్రతినిధి ఉమ్మడి ఆదిలాబాద్: దక్షిణ భారత దేశంలోనే సుప్రసిద్ద సరస్వతి క్షేత్రమైన నిర్మల్ జిల్లా బాసరలోని శ్రీ జ్ఞాన సరస్వతి దేవి ఆలయం భక్తులతో కిక్కిరిసిపోయింది. సోమవారం అమ్మవారి సన్నిధిలో మాజీ మంత్రి కన్నా లక్ష్మీ నారాయణ కుటుంబ సమేతంగా ఆలయానికి విచ్చేసి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వారి మనుమడు జయదేవ్ కి అమ్మవారి సన్నిధి లో అక్షరాభ్యాసం నిర్వహించారు.

కన్నా లక్ష్మీనారాయణకు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి అర్చకులు అమ్మవారి ఆశీస్సులు తీర్థప్రసాదాలు అందజేసి, శాలువాతో సత్కరించారు. పాఠశాలలకు సెలవులు ఉండడంతో రాష్ట్రంలోని నలుదిశల నుండి భక్తులు పిల్లాపాపలతో కలిసి భారీ సంఖ్యలో ఆలయానికి తరలివచ్చి అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ సమీపంలోని పవిత్ర గోదావరి నదిలో భక్తులు పుణ్య స్నానాలు ఆచరించి, అమ్మవారి దర్శనం కోసం ఆలయానికి తరలి వచ్చారు.

వేద పండితుల సమక్షంలో శాస్త్రోక్తంగా తమ పిల్లల చేత అక్షర శ్రీకార పూజలు చేయించారు. దీంతో ఆలయంలోని అక్షర శ్రీకార మండపాలు భక్తులతో కిక్కిరిసిపోయాయి. ఎండల దృష్ట్యా ఆలయానికి తరలివచ్చిన భక్తులకు అసౌకర్యం కలుగకుండా ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. తాగు నీటి వసతితోపాటు భక్తులకు నీడను ఏర్పాటు చేశారు. ఇదిలా ఉంటే మరికొన్ని రోజుల్లో వేసవి సెలవులు కూడా ముగియనుండటంతో బాసరకు భక్తుల తాకిడి పెరుగుతోంది. భక్తులు భారీ సంఖ్యంలో వచ్చి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి వెళుతున్నారు.

మంచి ముహూర్తాలు ఉండడంతో పెద్ద సంఖ్యలో తల్లిదండ్రులు తమ పిల్లలచే అక్షర శ్రీకార పూజలు చేయించారు. మరికొన్ని రోజుల్లో మరో విద్యా సంవత్సరం ప్రారంభం కానుండటం, కొత్తగా తమ పిల్లలను ఈ యేడు నుండి బడులకు పంపించాలనుకున్న తల్లిదండ్రులు, ఇతర కుటుంబ సభ్యులతో కలిసి వచ్చి పిల్లలకు అమ్మవారి సమక్షంలో వేద పండితులతో శాస్త్రోక్తంగా అక్షర శ్రీకారం చేయిస్తున్నారు . దీంతో బాసర ఆల‌య ప‌రిస‌రాలు భక్తులతో నిండిపోయాయి. రానున్న రోజుల్లో భక్తుల తాకిడి మరింత పెరగనుంది.