ఆరు ట్రంకు పెట్టెలు తెచ్చుకోండి.. జ‌య‌ల‌లిత వ‌జ్రాభ‌ర‌ణాల‌ను తీసుకెళ్లండి..!

తమిళనాడు దివంగత మాజీ ముఖ్యమంత్రి, ప్రముఖ నటి జయలలితకు సంబంధించిన బంగారు ఆభరణాలను.. ఆ రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించేందుకు.. బెంగళూరు కోర్టు తేదీని ఖరారు చేసింది

  • Publish Date - February 20, 2024 / 11:30 AM IST

చెన్నై : తమిళనాడు దివంగత మాజీ ముఖ్యమంత్రి, ప్రముఖ నటి జయలలితకు సంబంధించిన బంగారు ఆభరణాలను.. ఆ రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించేందుకు.. బెంగళూరు కోర్టు తేదీని ఖరారు చేసింది. వాటికి తీసుకువెళ్లడానికి ఆరు ట్రంకు పెట్టెలను తెచ్చుకోవాలని స్పష్టం చేసింది.


జ‌య‌ల‌లిత అక్ర‌మంగా సంపాదించిన బంగారు, వ‌జ్రాభ‌ర‌ణాలను ఈ ఏడాది మార్చి 6, 7 తేదీల్లో తీసుకోవ‌డానికి ఆరు ట్రంకు పెట్టెల‌తో రావాల‌ని బెంగ‌ళూరు కోర్టు త‌మిళ‌నాడు ప్ర‌భుత్వాన్ని ఆదేశించింది. ఈ కేసును విచారించిన సివిల్ అండ్ సెష‌న్స్ కోర్టు న్యాయ‌మూర్తి.. మార్చి 6, 7 తేదీల్లో ఇత‌ర కేసుల విచార‌ణ‌ను చేప‌ట్ట‌కూడద‌ని నిర్ణ‌యించారు. జ‌య‌ల‌లిత బంగారు ఆభ‌ర‌ణాలు తీసుకోవ‌డానికి ఒక అధికారిని నియ‌మించామ‌ని, త‌మిళ‌నాడు హోంశాఖ ప్రిన్సిప‌ల్ సెక్ర‌ట‌రీ, ఐజీపీ ఆ అధికారితో స‌మ‌న్వ‌యం చేసుకోవాల‌ని బెంగ‌ళూరు కోర్టు ఆదేశించింది. ఫోటో గ్రాఫర్స్, వీడియో గ్రాఫ‌ర్స్‌, ఆరు ట్రంకు పెట్టెల‌తో పాటు అవ‌స‌ర‌మైన భ‌ద్రతా సిబ్బందితో రావాల‌ని కోర్టు సూచించింది. త‌మిళ‌నాడు డిప్యూటీ ఎస్పీ ఈ విష‌యాన్ని హోం శాఖ ప్రిన్సిప‌ల్ సెక్ర‌ట‌రీ దృష్టికి తీసుకెళ్లాల‌ని ఆదేశించింది. మార్చి 6, 7 తేదీల్లో భ‌ద్ర‌త కోసం స్థానిక పోలీసుల‌తో బందోబ‌స్తు ఏర్పాటు చేసుకోవాల‌ని కోర్టు సూచించింది.


జ‌య‌ల‌లిత ఆస్తుల సంబంధించిన కేసు విచార‌ణ కోసం క‌ర్ణాట‌క ప్ర‌భుత్వం రూ. 5 కోట్లు ఖ‌ర్చు చేసింద‌ని ప్ర‌భుత్వ త‌ర‌పు న్యాయ‌వాది తెలిపారు. ఇందుకు త‌మిళ‌నాడు ప్ర‌భుత్వం రూ. 5 కోట్ల డీడీని క‌ర్ణాట‌కకు అప్ప‌గించింద‌ని పేర్కొన్నారు. అయితే ఆ మొత్తం క‌ర్ణాట‌క ప్ర‌భుత్వ ఖాతాలో జ‌మ కాలేద‌ని న్యాయ‌వాది చెప్పారు. అక్ర‌మార్జ‌న కేసులో 1996లో చెన్నైలోని జ‌య‌ల‌లిత నివాసం నుంచి స్వాధీనం చేసుకున్న వ‌స్తువుల‌న్నీ ప్ర‌స్తుతం క‌ర్ణాట‌క ప్ర‌భుత్వం ఆధీనంలో ఉన్నాయి. అందులో 7,040 గ్రాముల 468 ర‌కాల బంగారు, వ‌జ్రాభ‌ర‌ణాలు, 700 కిలోల వెండి వ‌స్తువులు, 740 జ‌త‌ల ఖ‌రీదైన చెప్పులు ఉన్నాయి.


వాటితో పాటు 11,344 ప‌ట్టు చీర‌లు, 250 శాలువాలు, 12 రిఫ్రిజిరేట‌ర్లు, 10 టీవీ సెట్లు, 8 వీసీఆర్‌లు, 1 వీడియో కెమెరా, 4 సీడీ ప్లేయ‌ర్లు, 2 ఆడియో డెక్, 24 టూ ఇన్ వ‌న్ టేప్ రికార్డ‌ర్లు, 1040 వీడియో క్యాసెట్లు, 3 ఐర‌న్ లాక‌ర్లు, రూ. 1,93,202 న‌గ‌ద‌ను స్వాధీనం చేసుకున్నారు. అక్ర‌మాస్తుల కేసులో జ‌య‌ల‌లిత‌కు 2014లో నాలుగేండ్ల జైలు శిక్ష, రూ. 100 కోట్ల జ‌రిమానా విధించింది బెంగ‌ళూరు కోర్టు. అలాగే స్వాధీనం చేసుకున్న వ‌స్తువుల‌ను ఆర్బీఐ, ఎస్‌బీఐ లేదా బహిరంగ వేలం ద్వారా విక్ర‌యించాల‌ని స్ప‌ష్టం చేసింది. అంత‌లోనే జ‌య‌ల‌లిత మ‌ర‌ణించారు. ఈ క్ర‌మంలోనే దీనిపై మ‌రోసారి విచార‌ణ జ‌రిపిన ప్ర‌త్యేక కోర్టు ఆ బంగారు, వ‌జ్రాభ‌ర‌ణాల‌ను త‌మిళ‌నాడు ప్ర‌భుత్వానికి బ‌దిలీ చేయాల‌ని ఆదేశించింది.