Bhatti Vikramarka | కాళేశ్వరం గుదిబండ.. భవిష్యత్ తరాలు అప్పుల ఊబిలో: భట్టి
Bhatti Vikramarka | ఎన్ని లక్షల ఎకరాలకు నీళ్లిచ్చారు సీఎం రేసులో ఎక్కువమంది ఉండటం.. మంచిదే అధికారంలోకి రాగానే ధరణి లోపాల సవరణ ధరణి సేవలకు యూజర్ ఛార్జీలు రద్దు పొంగులేటి, జూపల్లిల చేరికతో బలం కేటీఆర్ దిగజారుడు మాటలు తగ్గించుకో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క వ్యాఖ్యలు ‘విధాత’ ప్రతినిధి ప్రత్యేక ఇంటర్వ్యూ (టీ కోటిరెడ్డి, విధాత బ్యూరో చీఫ్) కాంగ్రెస్ పార్టీలో అనేక మంది ముఖ్యమంత్రి పదవి రేసులో ఉండటం మంచిదేనని సీఎల్పీ నేత మల్లు […]

Bhatti Vikramarka |
- ఎన్ని లక్షల ఎకరాలకు నీళ్లిచ్చారు
- సీఎం రేసులో ఎక్కువమంది ఉండటం.. మంచిదే
- అధికారంలోకి రాగానే ధరణి లోపాల సవరణ
- ధరణి సేవలకు యూజర్ ఛార్జీలు రద్దు
- పొంగులేటి, జూపల్లిల చేరికతో బలం
- కేటీఆర్ దిగజారుడు మాటలు తగ్గించుకో
- సీఎల్పీ నేత భట్టి విక్రమార్క వ్యాఖ్యలు
- ‘విధాత’ ప్రతినిధి ప్రత్యేక ఇంటర్వ్యూ
(టీ కోటిరెడ్డి, విధాత బ్యూరో చీఫ్)
కాంగ్రెస్ పార్టీలో అనేక మంది ముఖ్యమంత్రి పదవి రేసులో ఉండటం మంచిదేనని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి స్థాయి నాయకత్వం గల వాళ్లు కాంగ్రెస్‌లో అనేకమంది ఉండటం పార్టీ అదృష్టమన్న భట్టి.. కాళేశ్వరం ఎక్కడుందో, పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతలు ఎక్కడున్నాయో తెలియని వారు ప్రస్తుతం ఈ రాష్ట్రానికి మంత్రులవడం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు.
లక్ష కోట్ల రూపాయలతో కేసీఆర్ ప్రభుత్వం నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు.. తెలంగాణను తీవ్ర అప్పుల్లోకి నెట్టేసిందని, ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీ కట్టిన ప్రాజెక్టులతోనే తెలంగాణలో సాగునీరు అందుతున్నదని కాంగ్రెస్ శాసనసభాపక్ష నేత మల్లు భట్టివిక్రమార్క అన్నారు. పీపుల్స్ మార్చ్‌లో భాగంగా ఆయన ఖమ్మం జిల్లాలో పాదయాత్ర చేస్తున్నారు. ఈ సందర్భంగా తనను కలిసిన విధాత ప్రతినిధికి ఆయన ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే..
ప్రజల ఆత్మగౌరవాన్ని లాగేశారు
తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని కేసీఆర్ కుటుంబం, ప్రభుత్వం లాక్కున్నది. పీపుల్స్ మార్చ్ యాత్రలో ప్రజల గోస అర్థమైంది. మొత్తం యాత్రలో ప్రజలు సాగునీటి సమస్యలతోపాటు, ప్రజల ఆత్మగౌరవానికి ప్రభుత్వం ఏ విధంగా భంగం కలగజేస్తోందనే విషయాన్ని ప్రధానంగా నా దృష్టికి తెచ్చారు. నీళ్లు, నిధులు, నియామకాలను కేసీఆర్ ప్రభుత్వం ప్రజలకు కాకుండా, తన కుటుంబానికి వర్తింపజేసుకుంది.
కాళేశ్వరం వల్ల ఒరిగింది శూన్యం
తెలంగాణ భూములకు నేటికీ కాంగ్రెస్ పార్టీ హయాంలో కట్టిన ప్రాజెక్టుల నీరే చేరుతున్నది. రైతులు కాంగ్రెస్ ప్రాజెక్టుల నీటితోనే పంటలు వేసుకుంటున్నారు. లక్షకోట్లు ఖర్చు పెట్టి, మూడు పెద్ద బరాజ్‌లు కట్టిన కేసీఆర్, ఎన్ని లక్షల ఎకరాలకు సాగునీరు అందించారో దమ్ముంటే చెప్పాలి. కాళేశ్వరం వల్ల చుక్క నీరు కూడా వ్యవసాయానికి అందడం లేదు. ప్రజా ధనాన్ని లూటీచేసి కాళేశ్వరం కట్టారు. దీనివల్ల తెలంగాణలో భవిష్యత్ తరాలు సైతం అప్పుల్లో పడ్డాయి. ఈ ప్రాజెక్టు వల్ల మంచి జరగకపోగా, తరాలకు తరాలు అప్పులు తీర్చే పరిస్థితి నెలకొన్నది.
ధరణిలో లోపాలు సవరిస్తాం
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ధరణి పోర్టల్‌లో లోపాలను సవరిస్తాం. ధరణి లోపాలను ఆసరాగా చేసుకుని హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో లక్షల కోట్ల రూపాయల చేతులు మారుతున్నాయి. అధికారంలోకి వస్తే ధరణిలో మార్పులు చేసి, ప్రజలకు వివిధ పోరాటాల ద్వారా సంక్రమించిన భూమి హక్కులను కల్పిస్తాం. ధరణిలో ప్రధాన లోపంగా ఉన్న అనుభవదారు కాలాన్ని జతచేస్తాం. అంతేకాదు భూ యజమానులకు భూమి గ్యారంటీ హక్కును కల్పిస్తూ, టైటిల్ గ్యారెంటీ చట్టాన్ని అమలు చేస్తాం.
ధరణి పోర్టల్‌ను ప్రభుత్వమే నిర్వహిస్తుంది
ప్రస్తుతం ప్రైవేటు సంస్థ చేతిలో ఉన్న ధరణి పోర్టల్ నిర్వహణను కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టగానే ప్రభుత్వమే నిర్వహిస్తుంది. ధరణి సేవలకు చెల్లించాల్సిన యూజర్ చార్జీలను సైతం రద్దు చేస్తాం.
చేరికలతో మరింత బలం
రాజకీయాల్లో చేరికలు సహజం. కాంగ్రెస్ బలోపేతంలో భాగంగానే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి కృష్ణారావుల చేరిక. వీరందరినీ సాదరంగా కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానిస్తున్నాం.
కాంగ్రెస్‌లో విభేదాలు లేవు
మా పార్టీలో ఒక సమస్యపై భిన్నాభిప్రాయాలు ఉంటాయి. దాన్ని చర్చల ద్వారా పరిష్కరించుకొని ఏకాభిప్రాయంతో విధివిధానాలను రూపొందిస్తాం. కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతంతో పనిచేస్తుంది. ఆ సిద్ధాంతం వెలుగులో ఎవరు మా పార్టీలోకి వచ్చినా ఆహ్వానిస్తాం. బీజేపీకి ఒక ఆచరణాత్మక విధానం లేదు కాబట్టే రాష్ట్రంలో ఈ దుస్థితిలో ఉన్నది.
దిగజారుడు మాటలు వద్దు కేటీఆర్
దేశభక్తులను బీఆరెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గౌరవించాలి. దిగజారుడు మాటలతో స్థాయిని దిగజార్చుకోవద్దు. పొత్తులు- ఎత్తుల విషయంలో పార్టీ అధిష్ఠానం నిర్ణయం తీసుకుంటుంది.