విధాత: భీమాకోరేగాం కేసుగా ప్రసిద్ధికెక్కిన కేసులో మరో సంచలన నిజం వెలుగు చూసింది. 2018 జనవరి 1 నాటి హింసా కాండలో ఎల్గార్ పరిషత్ పాత్రేమీ లేదని ఆ ఘటన జరిగినపుడు ఆ ప్రాంతంలో పోలీస్ అధికారిగా పనిచేసి అనేక కేసుల్లో విచారణ అధికారిగా ఉన్న విశ్రాంత సబ్‌డివిజనల్ పోలీస్ అధికారి గణేశ్ మోరే తెలిపారు. ఈ కేసులో ఓ పోలీస్ అధికారే నాటి హింసాకాండలో ఎల్గార్‌పరిషత్ పాత్ర లేదని చెప్పటం విశేషం.
ఇంతకుముందే.. హక్కుల కార్యకర్తల వ్యక్తిగత కంప్యూటర్లలో దొరికినవని ఎన్‌ఐఏ అధికారులు చెప్తున్న వన్నీ అక్రమంగా దొంగచాటుగా ఆ కంప్యూటర్లను హ్యాక్ చేసి చొప్పించినవేనని అమెరికాకు చెందిన ప్రఖ్యాత ఐటీ డిజిటల్ ఫోరెన్సిక్ సంస్థ అర్సెనెల్ కన్సల్టెన్సీ ప్రకటించటం గమనార్హం. తాజాగా ఓ పోలీస్ అధికారి కూడా ప్రభుత్వ ఆరోపణకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పటం గమనించదగినది.
ఇన్నాళ్లూ భీమాకొరేగాం కేసులో పోలీసులు, కేంద్రప్రభుత్వం చెప్తున్నవన్నీ అబద్ధాలనీ, ఆ కేసే ఓ కుట్రపూరితమైనదని హక్కుల సంఘాలు అంటున్నాయి. కానీ కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థ ఎన్‌ఐఏ మాత్రం ఎల్గార్ పరిషత్ సంస్థ కుట్రపన్ని ప్రధాని మోదీని హత్యచేయటానికి కుట్రపన్నారని ఆరోపిస్తూ 16మంది హక్కుల కార్యకర్తలను ముద్దాయిలుగా ప్రకటించి అరెస్టు చేసింది.
దానికి సాక్ష్యంగా వారి కంప్యూటర్లలో దొరికిన ఫైళ్లను చూపింది. నిజానికి అవన్నీ హ్యాక్ చేసి చొప్పించినవేనని వేరే చెప్పక్కరలేదు. ఈ కేసు కారణంగా స్టాన్ స్వామి అనే హక్కుల నేత జైలులోనే చనిపోగా ముగ్గురు బెయిల్‌పై విడుదలయ్యారు. ఇంకా 12మంది జైలులోనే ఉన్నారు.
ఈ కేసుకు సంబంధించి మొదటి నుంచీ కేంద్ర ప్రభుత్వం చెప్తున్నవన్నీ అబద్ధాలనీ, కట్టుకథలని హక్కుల సంఘాలు ఆరోపిస్తు న్నాయి. దేశంలో ప్రభుత్వ వ్యతిరేక నోళ్లను మూయించే ప్రయత్నంలో భాగమే భీమాకోరేగాం కేసు అని విమర్శిస్తున్నాయి.
తాజా పోలీస్ అధికారి సాక్ష్యం హక్కుల సంఘాల నేతల నిర్దోషిత్వాన్ని తేటతెల్లం చేసింది. ఈ నేపథ్యంలో ఇన్నాళ్లుగా హక్కుల నేతలను నిర్బంధించి వేధింపులకు పాల్పడినందుకు కేంద్రప్రభుత్వం సమాధానం చెప్పాలని హక్కుల సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
దేశంలోని హక్కుల సంఘాలు, మేధావులంతా భీమాకోరేగాం కేసు కుట్రపూరితమైనదని ఆరోపిస్తున్నారు. 31డిసెంబర్ 2017న భీమాకోరేగాంలో నిర్వహించిన సభ సందర్భంగా హిందుత్వ సంఘనేతలే దళితులపై దాడులు చేసి అనేక మందిని గాయ పర్చారనీ, ఆ దాడిలో ముగ్గురు దళితులు ప్రాణాలు కోల్పోయారని అంటున్నారు. పీశ్వా పాలనకు వ్యతిరేకంగా దళితులు పోరాటం చేసి విజయం సాధించిన రోజుగా ఆ రోజు సభ జరుపుకొంటుంటే హిందుత్వ సంస్థలే దాడులు చేశాయని ఆరోపిస్తున్నారు.