భూమి-తెలంగాణ.. మ్యానిఫెస్టోల విడుదల: భూమి సునీల్‌

భూమి-తెలంగాణ.. మ్యానిఫెస్టోల విడుదల: భూమి సునీల్‌

విధాత : తెలంగాణ ప్రజల భూ సమస్యలను పరిష్కరించేందుకు తెలంగాణ రాజకీయ పార్టీలు చొరవ తీసుకోవాలని కోరుతూ లీఫ్స్‌ సంస్థ అధ్యక్షులు, భూ చట్టాల న్యాయనిపుణులు, న్యాయవాది, నల్సార్‌ అనుబంధ ప్రొఫెసర్‌, గ్రామీణ న్యాయ పీఠం సహా వ్యవస్థాపకులు భూమి సునీల్‌ శనివారం తెలంగాణ ప్రజల భూమి మ్యానిఫెస్టో విడుదల చేశారు. మ్యానిఫెస్టోతో పాటు భూమి ఎజెండా-తెలంగాణ ఎన్నికలు-ప్రజల ఆకాంక్షల పేరుతో భూమి తెలంగాణ నివేదికను కూడా విడుదల చేశారు. ఈ సందర్భంగా సునీల్‌ మాట్లాడుతూ భూ హక్కుల చిక్కులు లేని తెలంగాణ సాకారం అయితేనే అభివృద్ధి చెందిన తెలంగాణ సాధ్యమై రైతు జీవితం మెరుగుపడుతుందన్నారు.


మెరుగైన భూపరిపాలన, భూరికార్డుల నిర్వాహణ ఏ ప్రభుత్వానికైనా ప్రాథాన్యతాంశం కావాలన్నారు. భూమి హక్కు రాజ్యంగ హక్కు, ఐక్య రాజ్యసమితి గుర్తించిన మానవ హక్కు అన్నారు. తెలంగాణలో ప్రతి పల్లెలో వందల భూ సమస్యలున్నాయని, భూమి హక్కులకు భద్రత, స్పష్టత లేదన్నారు. 9లక్షల సాదా బైనామా దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయని, లక్షల ఎకరాల పట్టా భూమి నిషేధిత జాబితాలో తప్పుగా చేరిందన్నారు. 25లక్షల ఎకరాల అసైన్డ్‌ భూములు సమస్యల్లో ఉన్నాయన్నారు. భూసర్వే జరిగి 80ఏళ్లయినా రీ సర్వే జరుగలేదని, పట్టాదారు పాసుపుస్తకానికి ప్రభుత్వ హామీ లేదన్నారు. 10లక్షలకుపైగా ఉన్న కౌలుదారులకు గుర్తింపు లేక రైతులు సాయం పొందలేక పోతున్నారన్నారు.


పొడు భూములకు పట్టాలు రాని గిరిజనుల వేల సంఖ్యలో ఉన్నారన్నారు. తెలంగాణలో భూ సమస్యల పరిష్కారం దిశగా లీఫ్స్‌, గ్రామీణ న్యాయపీఠం సంస్థలు నిర్వహించిన తెలంగాణ భూమి కారవాన్‌, భూ న్యాయ శిబిరాలు, న్యాయగంట ఇతర కార్యక్రమాలో వేలమంది ప్రజలు తెలిపిన ఆధారంగా ఈ భూమి మ్యానిఫెస్టోను 15అంశాలతో రూపొందించామన్నారు. అలాగే భూమి-తెలంగాణ నివేదికను రూపొందించామన్నారు.

భూమి మ్యానిఫెస్టో వివరాలు

1) భూధార్‌ – భూముల రీ సర్వే చేసి ప్రతి కమతానికి భూదార్‌ కార్డు ఇవ్వాలి. ఆ భూ కమతానికి సంబంధించిన సమగ్ర సమాచారం ఆ కార్డులో ఉండాలి.

2) ఒకే భూమి చట్టం – ఇప్పుడు అమలులో ఉన్న అన్ని భూమి చట్టాలను కలిపి ఒకే చట్టంగా చేయాలి.

3) టైటిల్‌ గ్యారంటీ- భూమి హక్కులకు ప్రభుత్వమే పూర్తి భరోసానిచ్చే టైటిల్‌ గ్యారంటీ వ్యవస్థ తేవాలి.

4) సాదా బైనామా- ఆర్‌వోఆర్‌ చట్ట్టాన్ని సవరించి పెండింగ్‌లో ఉన్న సాదా బైనా దరఖాస్తులను పరిష్కరించి పట్టాలు ఇవ్వాలి.

5) అసైన్డ్‌ భూములు- పీవోటీ చట్టాన్ని సవరించి అసైన్డ్‌ భూములపై పేదలకు పూర్తి హక్కులు కల్పించాలి.

6) పోడు భూములు – పోడు సాగు చేస్తున్న అర్హులైన గిరిజనులందరికి ఆటవీ హక్కుల చట్టాన్ని అమలు చేసి హక్కు పత్రాలు అందించాలి.

7) పేదలకు భూమి- భూమిలేని వ్యవసాయ ఆధారిత పేద కుటుంబాలకు భూమిని పంచడానికి పథకాన్ని రూపొందించాలి. ఇంటి స్థలం లేని గ్రామీణ పేద కుటుంబాలకు నాలుగు గుంటల హోంస్టెడ్‌ను ఇచ్చే పథకాన్ని అమలు చేయాలి. సీలింగ్‌ చట్టాన్ని అమలు చేసి మిగులు భూమిని భూమిలేని వ్యవసాయ పేద కుటుంబాలకు పునఃపంపిణీ చేయాలి.

8) రెవెన్యూ ట్రిబ్యూనల్‌- భూ వివాదాల పరిష్కరానికి జిల్లాకు ఒక భూమి ట్రిబ్యూనల్‌, రాష్ట్ర స్థాయిలో అప్పిలేట్‌ ట్రిబ్యూనల్‌ ఏర్పాటు చేయాలి. భూమి సమస్యలు ఉన్న పేద కుటుంబాలకు ఉచిత న్యాయ సహాయం అందించాలి. అందుకోసం పారాలీగల్‌ పథకాన్ని అమలు చేయాలి.

9) ధరణి- ధరణిలో ఉన్న తప్పులను గ్రామస్థాయిలో రెవెన్యూ కోర్టులు నిర్వహించిన సత్వరం పరిష్కరించాలి. కంప్యూటర్లు ఉన్న భూమి రికార్డుల వాస్తవ పరిస్థితులకు అద్దం పట్టేలా ఉండాలి. రికార్డులలో తప్పులుంటే సత్వరమే సవరించే మార్గం ఉండాలి. కంప్యూటర్‌లో ఉన్న రికార్డుకు భద్రత ఉండాలి.

10) 22ఏ జాబితా- నిషేధిత ఆస్తుల జాబితాలో తప్పుగా నమోదైన పట్టా భూములను గ్రామ రెవెన్యూ సదస్సులు నిర్వహించి వెంటనే ఆ జాబితా నుంచి తొలగించాలి

11) భూ పరిపాలన- గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు భూపరిపాలన యంత్రాంగాన్ని పటిష్టపరుచాలి. మారుతున్న అవసరాలకు తగ్గట్లుగా వారికి తగిన శిక్షణ ఇవ్వాలి. అందుకోసం భూమి అకాడమీని ఏర్పాటు చేయాలి.

12) భూమి కమిషన్‌ – భూ పరిపాలన, భూమి చట్టాలు, విధానాల అధ్యాయనం, మారుతున్న కాలమాన పరిస్థితులలో చేయాల్సిన మార్పు, చేర్పులను సూచించడానికి నిపుణులు, అధికారులు, ప్రజాప్రతినిధులతో కూడిన భూమి కమిషన్‌ ఏర్పాటు చేయాలి.

13) భూ విధానాలు- భూమి విధానం, భూమి వినియోగ విధానాన్ని రూపొందించాలి.

14) భూసేకరణ- 2014లో చేసిన భూసేకరణ చట్టాన్ని యథాతధంగా అమలు చేయాలి.

15) కౌలు రైతులు – కౌలుదార్లను సాగుదార్లుగా గుర్తింపు ఇచ్చి వారికి రైతులుగా అందాల్సిన అన్ని మేళ్లు అందించాలి. అందుకోసం కొత్త కౌలు చట్టం రూపొందించాలి.