BJP Karnataka | నటులను నమ్ముకున్న.. కర్ణాటక BJP! త్వరలో పవన్‌ కల్యాణ్‌ ప్రచారం

నేతలతో కానిది నటులతో అయితదా? కష్టకాలంలో బయటపడేస్తారని ఆశలు మద్దతు ప్రకటించిన సుదీప్‌ కిచ్చా పవన్‌ కల్యాణ్‌తో ప్రచారం చేయించే ప్లాన్‌ నేతలతో కానిది నటులతో అయితదా? విధాత: మే 10వ తేదీన జరగనున్న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు సమయం సమీపిస్తున్న కొద్దీ ప్రధాన పార్టీలైన కాంగ్రెస్‌, బీజేపీ వ్యూహప్రతివ్యూహాలకు పదునుపెట్టాయి. ముఖ్యంగా కాంగ్రెస్‌ పార్టీ దూకుడుగా ముందుకు వెళ్తున్నది. ఎన్నికల నోటిఫికేషన్‌కు ముందే 124మంది తొలి జాబితాను ప్రకటించిన ఆ పార్టీ 42 మందితో రెండో […]

  • Publish Date - April 7, 2023 / 01:46 PM IST
  • నేతలతో కానిది నటులతో అయితదా?
  • కష్టకాలంలో బయటపడేస్తారని ఆశలు
  • మద్దతు ప్రకటించిన సుదీప్‌ కిచ్చా
  • పవన్‌ కల్యాణ్‌తో ప్రచారం చేయించే ప్లాన్‌
  • నేతలతో కానిది నటులతో అయితదా?

విధాత: మే 10వ తేదీన జరగనున్న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు సమయం సమీపిస్తున్న కొద్దీ ప్రధాన పార్టీలైన కాంగ్రెస్‌, బీజేపీ వ్యూహప్రతివ్యూహాలకు పదునుపెట్టాయి. ముఖ్యంగా కాంగ్రెస్‌ పార్టీ దూకుడుగా ముందుకు వెళ్తున్నది. ఎన్నికల నోటిఫికేషన్‌కు ముందే 124మంది తొలి జాబితాను ప్రకటించిన ఆ పార్టీ 42 మందితో రెండో జాబితాను కూడా గురువారం ప్రకటించింది.

మొత్తం 224 స్థానాల్లో ఇంకా 58 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉన్నది. దీనిపై ఆ పార్టీ పెద్దలు మల్లిఖార్జున ఖర్గే, రాహుల్‌గాంధీలు సిద్ధరామయ్య, డీకే శివకుమార్‌తో రెండురోజుల పాటు సుదీర్ఘంగా చర్చించిన అనంతరం అభ్యర్థుల రెండో జాబితాను ప్రకటించారు. గెలుపు గుర్రాలకే ప్రాధాన్యం ఇస్తామని చెప్పినట్టుగానే.. 50 మంది కొత్తవారికి అవకాశం కల్పించారు.

రాజకీయంగా కీలకపాత్ర ఆ రెండు సామాజిక వర్గాలదే

224 స్థానాలు ఉన్న కర్ణాటక రాజకీయాలలో లింగాయత్‌, వక్కలిగ సామాజికవర్గాలదే కీలకపాత్ర. దాదాపు 100 స్థానాల్లో లింగాయత్‌ల ప్రభావం ఉంటుందని అంచనా. రాష్ట్ర జనాభాలో లింగాయత్‌లు 17 శాతం, వక్కలిగలు 15 శాతం, ఓబీసీలు 35 శాతం, ఎస్సీ, ఎస్టీలు 18 శాతం, బ్రాహ్మణులు 3 శాతం ఉన్నారు.

అయితే 2013 నుంచి 2018 వరకు ఆ రాష్ట్రంలో కులాల వారీగా చేపట్టిన జనాభా లెక్కల ప్రకారం లింగాయత్‌ 9 శాతం, వక్కలిగలు 8 శాతానికే పరిమితమైనట్లు తెలుస్తోంది. అందుకే ఇంతకాలం ఈ రెండు సామాజికవర్గ నేతలు, ఓట్లకు ప్రధాన పార్టీలు అధిక ప్రాధాన్యం ఇచ్చాయి.

నేతల కంటే నటులను నమ్ముకున్న బీజేపీ

ప్రస్తుతం మారిన పరిస్థితుల నేపథ్యంలో బీజేపీ రూట్‌ మార్చి నాయకుల కంటే నటులపై ఫోకస్‌ పెట్టింది. మొన్నటికి మొన్న 4 శాతం ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేసి లింగాయత్‌, వక్కలిగ వర్గాలకు సర్దుబాటు చేసింది. దీనిపై ఎస్సీ, ఎస్టీలు రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంపై భగ్గుమన్నాయి. యడ్యూరప్ప ఇంటిపై దాడికి పాల్పడ్డాయి.

ఆ రాష్ట్రంలో 4 శాతం ఓట్లు ఉన్న వాల్మీకి నాయక ఓట్లపై దృష్టి సారించింది. దీనికోసం కన్నడనాట ప్రముఖ నటుడు సుదీప్‌ను తనవైపు తిప్పుకున్నది. ఆయన కోసం కాంగ్రెస్‌ ప్రయత్నం చేసినా.. బీజేపీ ఈ విషయంలో సక్సెస్‌ అయ్యింది. ఆయన గతంలో బీజేపీ నిర్ణయాలకు వ్యతిరేకంగా గళం విప్పిన సంగతి తెలిసిందే.

అయితే ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి బస్వరాజు బొమ్మైతో తనకు ఉన్న సాన్నిహిత్యం కారణంగానే ఆయన బీజేపీకి మద్దతు ఇస్తున్నట్టు ప్రకటించారు. బొమ్మై ఎక్కడ ప్రచారం చేయమంటే అక్కడ చేస్తానన్నారు. అయితే సుదీప్‌ నిర్ణయంపై ప్రకాశ్‌ రాజ్‌ ఆశ్చర్యం వ్యక్తం చేయడమే కాకుండా విమర్శించారు.

ప్రకాశ్‌రాజే కాదు సుదీప్‌ అభిమానుల నుంచి ప్రతికూల స్పందనలు రావడం విశేషం. కాంగ్రెస్‌ పార్టీ కూడా దీనిపై స్పందిస్తూ.. ఐటీ. ఈడీ దాడులు చేయిస్తామని బెదిరించి సుదీప్‌ను బలవంతంగా బీజేపీకి మద్దతుగా నిలిచేలా ఒప్పించిందని ఆరోపించింది. సుదీప్‌ తో పాటు కన్నడ హీరో దర్శన్‌, అంబరీశ్‌ సుమలత, ఆమె కుమారుడు అభిషేక్‌ కూడా బీజేపీకి మద్దతు ప్రకటించారు.

అక్కడ పవన్‌ కల్యాణ్‌తో ప్రచారం

సంఖ్యాపరంగా 12 జిల్లాల్లో తెలుగు మాట్లాడే జనాభా ఎక్కువగా ఉంటుంది. ఉమ్మడి బళ్లారి, కోలారు, బెంగళూరు, గ్రామీణం, బెంగళూరు నగరం, రాయచూరు, కొప్పళ, తుమకూరు, చిత్రదుర్గ, చిక్కబళ్లాపుర, యాద్గీర్‌, బీదర్‌, కలబురగి జిల్లాల్లోని నియోజకవర్గాల్లో స్థానికుల కంటే తెలుగువారి సంఖ్య ఎక్కువ. అంతేకాదు కర్ణాటకలోని బళ్లారి ప్రాంతంలో ప్రభావం చూపెట్టగలిగే గాలి జనార్దన్‌రెడ్డి తన పార్టీ కల్యాణ రాజ్య ప్రగతి పక్ష తరఫున కల్యాణ (ఉత్తర) కర్ణాటక ప్రాంతంలోని 50 నియోజకవర్గాల్లో తన అభ్యర్థులను బరిలోకి దించుతున్నారు.

అందుకే తెలుగువారు ఎక్కువగా ఉండే నియోజకవర్గాల్లో జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌తో ప్రచారం చేయించాలనే ఆలోచనలో బీజేపీ ఉన్నది. ఉమ్మడి రాష్ట్ర ఆఖరి ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి తాజాగా బీజేపీలో చేరారు. రాయలసీమ నేతలకు బెంగళూరు, బళ్లారి ప్రాంతాల ప్రజలతో అనుబంధం ఉన్నది. ఆయనకు కూడా అక్కడ ప్రచారానికి ఉపయోగించుకోవచ్చు.

మొదటి నుంచి ఆపరేషన్‌ ఆకర్షే

కర్ణాటక అసెంబ్లీ 1983 నుంచి బరిలోకి బీజేపీ ఎన్నడూ సొంతంగా పూర్తి మెజారిటీ సాధించలేదు. 2006లో అప్పటి డిప్యూటీ సీఎం సిద్ధరామయ్య తన పదవికి రాజీనామా చేసి జనతాదళ్‌ను వీడి కొంతమంది ఎమ్మెల్యేలతో కాంగ్రెస్‌లో చేరడం కమలం పార్టీకి కలిసి వచ్చింది. దీంతో విపక్ష బీజేపీతో కలిసి మిగిలిన జనతాదళ్‌ (ఎస్‌) ఎమ్మెల్యేలతో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడింది.

సీఎం పదవిని ఒకరి తర్వాత ఒకరు పంచుకోవాలని రెండు పార్టీలు అంగీకారానికి వచ్చాయి. ఈ ఒప్పందంలో భాగంగా జేడీఎస్‌ నేత కుమారస్వామి మొదట సీఎం అయ్యారు. 2007లో యడ్యూరప్పకు సీఎంగా అవకాశం ఇవ్వాల్సి ఉన్నా.. కుమారస్వామి అందుకు నిరాకరించారు.

దీంతో బీజేపీ తన మద్దతు ఉపసంహరించుకోవడంతో ప్రభుత్వం కూలిపోయి రాష్ట్రపతి పాలన వచ్చింది. అనంతరం మళ్లీ సయోధ్య కుదరడంతో యడ్యూరప్ప సీఎం అయ్యారు. కానీ జేడీఎస్‌ మళ్లీ హ్యాండ్‌ ఇవ్వడంతో తొలిసారి అధికారం కొన్నిరోజుల్లోనే అర్ధాంతరంగా ముగిసింది. 2008లో జరిగిన ఎన్నికల్లో బీజేపీ పట్ల సానుభూతి వ్యక్తమైంది. ఆ పార్టీ 110 సీట్లతో ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన సాధారణ మెజారిటీకి దగ్గర వచ్చింది.

ఆరుగురు ఇండిపెండెంట్ల మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అలా ప్రభుత్వాన్ని సుస్థిరం చేసుకోవడానికి బీజేపీ మొదటిసారి ఆపరేషన్‌ ఆకర్ష్‌ మొదలుపెట్టింది. జేడీఎస్‌ కు చెందిన 14 మంది ఎమ్మెల్యే ఆ పార్టీకి గుడ్‌ బై చెప్పి కమలం గూటికి చేరారు. ప్రభుత్వం స్థిరపడింది. కానీ అవినీతి ఆరోపణలతో యడ్యూరప్ప సీఎం పదవికి రాజీనామా చేశారు.

అనంతరం యెడ్డీ పార్టీకి దూరమై సొంత పార్టీ పెట్టారు. 2013 లో ఎన్నికల్లో ఆ ప్రభావంతో బీజేపీ 40 సీట్లకే పరిమితం కాగా, జేడీఎస్‌కు కూడా కోలుకోని దెబ్బపడింది. ప్రధాన ప్రతిపక్ష హోదా కోల్పోయింది. యడ్యూ రప్ప మళ్లీ సొంత గూటికి చేరారు. 2018 ఎన్నికల్లో 104 స్థానాలతో అతి పెద్ద పార్టీగా ఆవిర్భవించింది. సీఎం మరోసారిగా ప్రమాణ స్వీకారం చేసిన యడ్యూరప్ప మెజారిటీ నిరూపించు కోలేకపోవడంతో బీజేపీ ప్రభుత్వం కూలిపోయింది.

జేడీఎస్‌, కాంగ్రెస్‌లు సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. 2019లో యడ్యూరప్ప ఆపరేషన్‌ కమల్‌కు తెరలేపి కాంగ్రెస్‌, జేడీఎస్‌కు చెందిన 17 మంది ఎమ్మెల్యేల చేత రాజీనామా చేయించారు. వారిలోంచి 13మంది బీజేపీ తరఫున గెలిచారు. వారి మద్దతు తో యడ్యూరప్ప మళ్లీ సీఎం అయ్యారు. నాలుగుసార్లు సీఎంగా ప్రమాణం చేసినా ఆయన ఎన్నడూ పూర్తిస్థాయిలో పదవీకాలాన్ని పూర్తిచేసుకోలేదు.

ఇప్పుడు కూడా ఆయన పార్టీలో కొనసాగుతున్నప్పటికీ ప్రచారానికే పరిమితమయ్యారు. అవినీతి ఆరోపణలు కమలనాథులను కలవరపరుస్తుండటం, లింగాయత్‌, వక్కలిగ సామాజికవర్గాల ప్రభావం తగ్గిపోవడం, గాలి జనార్దన్‌రెడ్డి లాంటి వాళ్లు కొత్త పార్టీ పెట్టడం ఇలా అనేక పరిణామాలు తమ పుట్టి ముంచుతాయని బీజేపీ అగ్రనాయకత్వం ఆందోళనలో ఉన్నది.

అందుకే నాయకుల కంటే నటులను నమ్ముకుంటే నాలుగు సీట్లు ఎక్కువగా వస్తాయనే ఆశతో ఉన్నది. అయితే ప్రభుత్వ, ఎమ్మెల్యేల పనితీరు కంటే నటుల ఛరిష్మానే నమ్ముకున్న బీజేపీకి ఈసారి ఎలాంటి ఫలితాలు వస్తాయో చూడాలి