బొగ్గుట్ట.. కనుమరుగుకాక తప్పదా?
పురిటి గడ్డ కథ రానున్న రోజుల్లో పరిసమాప్తం! బొగ్గు సరఫరాకు కేవలం కేఓసీయే ఆధారం జేకే ఓసీలో అంతంత మాత్రమే బొగ్గు ఉత్పత్తి అదనపు ఓసీ పనులు ఇప్పట్లో లేనట్టే నానాటికీ తగ్గిపోతున్న కార్మికుల సంఖ్య పట్టని యాజమాన్యం, ప్రజా ప్రతినిధులు అండర్ గ్రౌండ్ మైన్స్, ఓసీలతో ఒకప్పడు కళకళలాడిన ఇల్లెందు ప్రాంతం తన ప్రాభవం కోల్పోనున్నదా? 8వేలకు పైగా కార్మికులతో నిత్యం కోలాహలంగా కనిపించిన సింగరేణికి పురిటిగడ్డ.. క్రమంగా కనుమరుగు కానున్నదా? తగ్గిపోతున్న బొగ్గు ఉత్పత్తి, […]

- పురిటి గడ్డ కథ రానున్న రోజుల్లో పరిసమాప్తం!
- బొగ్గు సరఫరాకు కేవలం కేఓసీయే ఆధారం
- జేకే ఓసీలో అంతంత మాత్రమే బొగ్గు ఉత్పత్తి
- అదనపు ఓసీ పనులు ఇప్పట్లో లేనట్టే
- నానాటికీ తగ్గిపోతున్న కార్మికుల సంఖ్య
- పట్టని యాజమాన్యం, ప్రజా ప్రతినిధులు
అండర్ గ్రౌండ్ మైన్స్, ఓసీలతో ఒకప్పడు కళకళలాడిన ఇల్లెందు ప్రాంతం తన ప్రాభవం కోల్పోనున్నదా? 8వేలకు పైగా కార్మికులతో నిత్యం కోలాహలంగా కనిపించిన సింగరేణికి పురిటిగడ్డ.. క్రమంగా కనుమరుగు కానున్నదా? తగ్గిపోతున్న బొగ్గు ఉత్పత్తి, అదే సమయంలో పలచబడుతున్న కార్మికుల సంఖ్యను గమనిస్తే.. ఇవే అనుమానాలు కలుగుతున్నాయి. అవును.. సింగరేణి యాజమాన్యం, ప్రజాప్రతినిధులు పట్టించుకోక పోతే.. బొగ్గుట్ట చరిత్రగా మిగిలిపోనున్నది.
విధాత ఖమ్మం బ్యూరో: సింగరేణికి పుట్టినిల్లు అయిన ఇల్లెందులో కార్మికుల సంఖ్య రోజు రోజుకూ తగ్గిపోతున్నది. ఒకప్పుడు 8వేల మందికిపైగా కార్మికులు పని చేసిన చోట.. నేడు ఆ సంఖ్య 600కు పరిమితమైందంటేనే ఇక్కడి దుస్థితిని అర్థం చేసుకోవచ్చు.
మొన్నటి వరకు జేకే ఓసీలో బొగ్గు ఉత్పత్తి జరిగేది. ప్రస్తుతం అక్కడ బొగ్గు ఉత్పత్తి అంతంత మాత్రంగానే ఉన్నది. కొత్త ఓసీ తీస్తున్నప్పటికీ.. ఇంకా బొగ్గు ఉత్పత్తి కావడం లేదు. ఇది ప్రారంభం కాకుంటే రిటైర్మెంట్‌కు దగ్గరగా ఉన్న కార్మికులు ఇతర ఏరియాలకు బదిలీ కావాల్సి వస్తుంది. దాంతో.. ఈ వయసులో బదిలీపై వెళ్లటం ఎందుకున్న భావనలో కార్మికులు ఉన్నారు.
తగ్గుతున్న కార్మికుల సంఖ్య
ఇల్లెందు ఏరియాలో బొగ్గు గని కార్మికుల సంఖ్య రోజు రోజుకూ తగ్గుతున్నది. గత సింగరేణి ఎన్నికలలో కార్మికుల సంఖ్య సుమారు 1200గా ఉన్నది. నాలుగేళ్ల తర్వాత.. ఇప్పడు 600 మంది మిగిలారు. అదనపు ఓసీ ప్రారంభం కాకపోతే ఉన్న కార్మికులను వేరే చోటుకు బదిలీ చేయాల్సి ఉంటుంది.
అయినప్పటికీ నూతన మైన్స్ కోసం కార్మిక సంఘాలు ఆందోళన చేయడం లేదు.. యాజమాన్యం, ప్రజా ప్రతినిధులు కూడా పట్టించుకోవడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. గత ఏడాదితో పోలిస్తే పూర్తిగా బొగ్గు ఉత్పత్తి కేఓసీ, జేకే ఓసీ.. ఈ రెండిట్లో 20 నుండి 25వేల టన్నుల వరకు జరిగేది. ఇప్పుడు 15 వేల టన్నులకు పడిపోయింది. తద్వారా సింగరేణికి ఆదాయం తగ్గిపోతున్నది. ఫలితంగా కార్మికులు ఇబ్బంది పడాల్సిన దుస్థితి నెలకొన్నది.
నాడు మైన్ రీఓపెనింగ్
ఇల్లెందు ఏరియాలో 2016 వరకు ఒక అండర్ గ్రౌండ్ మైన్‌తో పాటు రెండు ఓసీల ద్వారా బొగ్గు ఉత్పత్తి అయ్యేది. మైన్ భారమవుతుందని భావించిన యాజమాన్యం దానిని మూసివేసింది. దీనిపై కార్మికులు ఆందోళనకు దిగడంతో స్థానిక ప్రజా ప్రతినిధులైన మాజీ ఎమ్మెల్యే కోరం కనకయ్య.. మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు దృష్టికి తీసుకువెళ్లారు.
వీరిద్దరూ సింగరేణి సీఎండీని కలిసి.. మైన్‌ను తిరిగి తెరిపించారు. ఆ తర్వాత దీనిని మూడేళ్ల పాటు కొనసాగించారు. ఏటా 30 కోట్లు నష్టం వాటిల్లుతున్నా యాజమాన్యం భరించింది. అయినప్పటికీ కార్మికులను ఇతర ప్రాంతాలకు వెళ్లకుండా కాపాడుకున్నారు. ప్రస్తుతం కార్మికుల సంఖ్య తగ్గుతున్నా, ఓసీలో బొగ్గు లేదని తెలిసినా పట్టించుకునే వారు లేరని పలువురు కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అదనపు ఓసీ పైనే ఆధారం
ఇల్లెందు ఏరియా మనుగడకు అదనపు ఓసీ సరైంది. దానిని ప్రారంభిస్తేనే కార్మికులు స్థానికంగా ఉండగలుగుతారు. వయసు మీద పడిన వారంతా రిటైర్మెంట్‌కు దగ్గరగా ఉన్నారు. ఇప్పుడు ఇతర ప్రాంతాలకు తరలిపోవడమంటే కుటుంబం మొత్తం ఇబ్బంది పడటమే. ఈ విషయాన్ని పలు కార్మిక సంఘాలు ప్రజా ప్రతినిధుల దృష్టికి తీసుకుపోయినా ఫలితం లేదు.
ఇప్పటికైనా అదనపు ఓసీ కోసం సింగరేణి యాజమాన్యంతో గట్టిగా చర్చించాల్సిన అవసరం ఉందని సీనియర్ కార్మికులు అంటున్నారు. అనుమతులు లేకనే అదనపు ఓసీ విషయంలో జాప్యం జరుగుతున్నదని, దీనిపై ప్రజా ప్రతినిధులు దృష్టి సారిస్తే బొగ్గుట్ట మనుగడ సాగిస్తుందని చెప్తున్నారు. లేదంటే ప్రజల ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరిస్తున్నారు.