Bollywood Actress | సౌత్‌ మెగా బడ్జెట్‌ సినిమాల్లో మెరవనున్న బాలీవుడ్‌ హీరోయిన్స్‌..! ఈ లిస్ట్‌లో దీపికా, జాన్వీ సహా ఎవరున్నారంటే..?

Bollywood Actress | సౌత్‌ మెగా బడ్జెట్‌ సినిమాల్లో మెరవనున్న బాలీవుడ్‌ హీరోయిన్స్‌..! ఈ లిస్ట్‌లో దీపికా, జాన్వీ సహా ఎవరున్నారంటే..?

Bollywood Actress | గతంలో బాలీవుడ్‌ సినిమాల హవా కొనసాగింది. దాంతో మిగతా చిత్రపరిశ్రమలంటే ఎక్కువగా చిన్నచూపు ఉండేది. ప్రస్తుతం పరిస్థితి మారింది. బాహుబలి, కేజీఎఫ్‌, పుష్ప, ఆర్‌ఆర్‌ఆర్‌, కాంతారా సినిమాలు పాన్‌ ఇండియా స్థాయిలో సత్తాచాటాయి. విమర్శకుల ప్రశంసలు అందుకున్నాయి. అంతకు ముందు దక్షిణాది చిత్రాల్లో నటించేందుకు ఇష్టపడి హీరోయిన్లు ప్రస్తుతం దక్షిణాది చిత్రాల్లో నటించేందుకు సై అంటున్నారు. ఈ క్రమంలో సౌత్‌లోని మెగా బడ్జెట్ చిత్రాల్లో చాలా మంది టాప్ బాలీవుడ్ హీరోయిన్లు కనిపించబోతున్నారు. ఆ జాబితాలో ఎవరెవరు ఉన్నారో చూసేద్దాం రండి..!

దేవరలో జాన్వీ కపూర్‌


అలనాటి అందాల తార శ్రీదేవి తనయ జాన్వీ కపూర్‌ తెలుగులో తొలిసారిగా సినిమాలో నటించనున్నది. ఎన్టీఆర్‌ హీరోగా తెరకెక్కుతున్న ‘దేవర’ చిత్రంలో జాన్వీ కపూర్‌ కనిపించనున్నది. తెలుగుతో పాటు దక్షిణాది సినిమాలో నటిస్తుండడం ఇదే మొదటిచిత్రం. ఈ చిత్రం అక్టోబర్‌ 10న విడుదల కానున్నది. ఈ చిత్రంలో సైఫ్‌ అలీఖాన్‌ ప్రతినాయకుడి పాత్ర పోషించనున్నారు. మరో వైపు జాన్వీ కపూర్‌ రాం చరణ్‌ నటించనున్న చిత్రంలోనూ హీరోయిన్‌గా ఎంపికైంది. ఈ విషయాన్ని జాన్వీ తండ్రి బోని కపూర్‌ వెల్లడించారు. దాంతో పాటు సూర్యతోనూ జాన్వీ కపూర్‌ జోడీ కట్టబోతున్నట్లు తెలుస్తున్నది.

ప్రభాస్‌తో దీపికా పదుకొనే..


సలార్‌దో బాక్సాఫీస్‌ వద్ద దుమ్మురేపిన ప్రభాస్‌తో బాలీవుడ్‌ అగ్ర హీరోయిన్‌ దీపికా పదుకుణే స్క్రీన్‌ను పంచుకోబోతున్నది. కల్కి 2892 ఏడీ చిత్రంలో ప్రభాస్‌తో కలిసి బిగ్‌ స్క్రీన్‌పై రోమాన్స్‌ చేయబోతున్నది. ఈ చిత్రం ‘మహానటి’ ఫేమ్‌ నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రంలో దీపికాతో పాటు బిగ్‌బీ అమితాబ్‌ బచ్చన్‌, విశ్వ నటుడు కమల్‌ హాసన్‌ కీలక పాత్రలు పోషించనున్నారు.

కంగువతో తమిళంలోకి దిశా పటానీ..


దిశా పటాని తొలిసారిగా తెలుగు సినిమాతో సినీరంగ ప్రవేశం చేసింది. 2015లో వచ్చిన లోఫర్‌ సినిమాలో హీరోయిన్‌గా నటించింది. వరుణ్‌ తేజ్‌కు జోడీగా నటించింది. ఆ తర్వాత ఎంఎస్‌ ధోనీ చిత్రంలో నటించింది. ఆ తర్వాత బాలీవుడ్‌ సినిమాలకే పరిమితమైంది. ప్రస్తుతం ఈ బ్యూటీ తమిళంలోకి అరంగ్రేటం చేయబోతున్నది. సూపర్‌ స్టార్‌ సూర్యా సరసన ‘కంగువ : ఎ మైటీ వాలియంట్ సాగా’లో ప్రధాన పాత్ర పోషిస్తున్నది. ఇక సినిమాలో బాబీ డియోల్‌ సైతం కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఈ చిత్రంలో జగపతి బాబుతో పాటు మరికొందరు ప్రముఖ నటులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. దిశా పటానీ గేమ్‌ ఛేంజర్‌ సినిమాలోనూ నటించనున్నది.

గేమ్‌ ఛేంజర్‌లో కియారా అద్వానీ

 

కియారా అద్వాన్వీ సైతం తెలుగులో రామ్‌ చరణ హీరోగా తెరక్కెతున్న ‘గేమ్‌ ఛేంజర్‌’లో హీరోయిన్‌గా నటిస్తున్నది. ఈ పాన్‌ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి శంకర్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో దిశా పటానీ, ఎస్‌జే సూర్యా, సునీల్‌, నవీన్‌ చంద్ర, మేకా శ్రీకాంత్‌ నటించనున్నారు. కియారా అద్వానీ ఇప్పటికే తెలుగులో పలు చిత్రాల్లో నటించింది. 2018లో మహేశ్‌ బాబు హీరోగా తెరకెక్కిన ‘భరత్‌ అనే నేను’ చిత్రంలో వసుమతి పాత్రలో మెరిసింది. ఆ తర్వాత రామ్‌ చరణ్‌ హీరోగా నటించిన ‘వినయ విధేయ రామ’ చిత్రంలోనూ హీరోయిన్‌గా నటించింది.

కాంతారా ప్రీక్వెల్‌లో ఊర్వశి రౌటెలా..

బాలీవుడ్‌ ఐటమ్‌ బాంబుగా నిలిచిన ఊర్వశి రౌతేలా దక్షిణాదిన సత్తాచాటుతున్నది. రిషబ్‌ శెట్టి హీరోగా, స్వీయ దర్శకత్వంలో కాంతారా చిత్రానికి ప్రీక్వెల్‌గా వస్తున్న కాంతారా-2లో ఊర్వశి ప్రధాన పాత్రలో కనిపించనున్నది. ఊర్వశి 2022లో తమిళ చిత్రం ది లెజెండ్‌ చిత్రంలో నటించింది. ఆ తర్వాత మెగాస్టార్‌ చిరంజీవి వాల్తేరు వీరయ్య ‘బాస్‌ పార్టీ’.. అక్కినేని అఖిల్‌ ‘ఏజెంట్‌’ వైల్డ్ సాలా.. బ్రో సినిమాలో మైడిర్‌ మార్కండేయ, స్కంద ‘కల్ట్‌ మామా’ పాటల్లో మెరిసింది. బ్లాక్‌ రోజ్‌ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తున్నది. అయితే, ఈ చిత్రం ఇంకా విడుదల కావాల్సి ఉంది.