Bollywood | బీజేపీ ట్రాప్‌లో బాలీవుడ్! దేశంపై ‘ప్రచార సినిమాల’ రద్దుడు

Bollywood | దేశంపై ‘ప్రచార సినిమాల’ రద్దుడు అధికార బెదిరింపులకు తలొగ్గి కొందరు.. ఇబ్బంది త‌ప్పించుకునేందుకు ఇంకొంద‌రు అవార్డులు, రివార్డుల ఆశతో మరికొందరు ఇప్పటికే 20కి పైగా సినిమాలు జనంలోకి విడుదలకు మరికొన్ని సిద్ధంగా చిత్రాలు పార్లమెంటు ఎన్నికల్లో లబ్ధిపొందేందుకే! ప్రజలలోకి ఎజెండా చొప్పించే యత్నం దేశభక్తి ముసుగు కప్పి భావజాల దాడి భావోద్వేగాలను రెచ్చగొట్టే ప్రయత్నం నిజాలు చాటిచెప్పే సినిమాలకు శిక్షలు 2023 మార్చి 10న భీడ్ ట్రైలర్ విడుదలైంది. 2020 లాక్‌డౌన్ స‌మ‌యంలో లక్షల […]

  • By: krs    latest    Jun 08, 2023 3:30 AM IST
Bollywood | బీజేపీ ట్రాప్‌లో బాలీవుడ్! దేశంపై ‘ప్రచార సినిమాల’ రద్దుడు

Bollywood |

  • దేశంపై ‘ప్రచార సినిమాల’ రద్దుడు
  • అధికార బెదిరింపులకు తలొగ్గి కొందరు..
  • ఇబ్బంది త‌ప్పించుకునేందుకు ఇంకొంద‌రు
  • అవార్డులు, రివార్డుల ఆశతో మరికొందరు
  • ఇప్పటికే 20కి పైగా సినిమాలు జనంలోకి
  • విడుదలకు మరికొన్ని సిద్ధంగా చిత్రాలు
  • పార్లమెంటు ఎన్నికల్లో లబ్ధిపొందేందుకే!
  • ప్రజలలోకి ఎజెండా చొప్పించే యత్నం
  • దేశభక్తి ముసుగు కప్పి భావజాల దాడి
  • భావోద్వేగాలను రెచ్చగొట్టే ప్రయత్నం
  • నిజాలు చాటిచెప్పే సినిమాలకు శిక్షలు

2023 మార్చి 10న భీడ్ ట్రైలర్ విడుదలైంది. 2020 లాక్‌డౌన్ స‌మ‌యంలో లక్షల మంది వలస కార్మికులు ఎదుర్కొన్న దారుణ‌ స్థితిగ‌తుల‌ను ఇది చాటి చెప్పింది. ప్రధాని నరేంద్ర మోదీ లాక్‌డౌన్‌ను ప్రకటించడం, ఆ తర్వాత వలస కార్మికులపై పోలీసులు లాఠీలు ఝళిపిస్తున్న దృశ్యాలు! ట్రైల‌ర్‌లో ఇవి చూడ‌గానే ప్ర‌భుత్వ పెద్ద‌ల‌కు కోపం వ‌చ్చింది. మూడు రోజుల్లోనే ట్రైలర్‌ తీసేయాల్సి వచ్చింది. చిత్రం విడుదలయ్యే సమయానికి, 13 సార్లు మార్పులు, కోతలు చేరాయి. ప్రభుత్వానికి సంబంధించిన అన్ని విమ‌ర్శ‌లు క‌త్తిరించేశారు. దీంతో సినిమా త‌న సారాన్ని కోల్పోయింది.

ది కేరళ స్టోరీ! అభూత కల్పనలన్నీ కలిపి.. అడ్డదిడ్డంగా వండివార్చిన సినిమా! ఓ మహిళ ఇంత కష్టపడిందా? అనే జాలి పుట్టించడం ద్వారా.. సమాజంలో రెండు వర్గాలను విడదీసే భావజాలాన్ని బలంగా ప్రజలపై రుద్దిన ఈ సినిమాకు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో పన్ను మినహాయింపులు కూడా ఇచ్చారు. అంతకు ముందు ఇదే పద్ధతిలో తీసిన సినిమా ది కశ్మర్‌ ఫైల్స్‌! కశ్మీరీ పండిట్ల ఈతిబాధలు పట్టించుకోని బీజేపీ ప్రభుత్వం.. వారి కష్టాలపై తీసిన సినిమాను మాత్రం విశేషంగా ప్రచారం చేసింది. ఈ రెండు సినిమాలనూ ప్రధాని మోదీ ప్రత్యేకంగా ప్రస్తావించారు కూడా!

విధాత: అత్యంత శక్తిమంతమైన ప్రచార సాధనాల్లో సినిమా ఒకటి. సినిమాలో చూపించే అంశాలు, వాటిని నాటకీయంగా నడిపించే తీరు.. జనాల్లోకి బలంగా వెళుతుంది. ఇదే పాయింట్‌ తీసుకుని.. ఇప్పుడు బాలీవుడ్‌ను బీజేపీ గుప్పిట పట్టింది. తన భావజాలాన్ని ప్రజల్లోకి గట్టిగా తీసుకుపోయేందుకు సినిమాలను సాధనంగా ఎంచుకున్నది. తనకు నచ్చే అంశాలపై సినిమాలు తీసేవారికి ప్రభుత్వంలో ‘కొలువులు’ కల్పిస్తున్నది. కశ్మీర్‌ ఫైళ్ల నుంచి.. కేరళ స్టోరీ దాకా.. తెరపై నటుల గుండెలు పిండే పాత్ర పోషణల వెనుక.. ప్రమాదకర ఎజెండా అంతర్లీనంగా కనిపిస్తుంది. అది ప్రజల మధ్య చిచ్చు పెడుతుంది! బహుపరాక్‌!

(విధాత ప్రత్యేకం)

రాజకీయాలతో సినిమాల అనుబంధం కొత్తది కాదు. సినిమాల్లో ఉండి రాజకీయాలు చేసినవారిని చూశాం.. చూస్తున్నాం. కానీ.. ఇప్పుడు ఒక కొత్త పరిస్థితి బాలీవుడ్‌.. ఆ మాటకొస్తే యావత్‌ సినిమా పరిశ్రమలో కనిపిస్తున్నది. శక్తిమంతమైన ప్రచార సాధనాన్ని.. తన ‘రాజకీయ ప్రచారానికి’, తన ఎజెండాను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు బీజేపీ వినియోగించుకుంటున్నది. ఒక విధంగా చూస్తే.. బాలీవుడ్‌ ఇప్పుడు బీజేపీ ట్రాప్‌లో ఉన్నది. దేశ‌భ‌క్తి ముసుగులో, మ‌త ఏకీక‌ర‌ణ పేరిట.. సంఘ పరివార్‌ సాంస్కృతిక మానిఫెస్టో ప్ర‌చార వార‌ధిగా సినిమాలు తయారవుతున్నాయి. వాటిని దేశ ప్రజలపై బలవంతంగా రుద్దుతున్నారు. దేశ‌భ‌క్తి పేరుతో మతపరమైన ఉద్వేగాన్ని ప్రేరేపించి, రాజ‌కీయ ల‌బ్ధి పొందే దుస్సాహ‌సం దూసుకొస్తోంది.

తెలుగు పరిశ్రమ సైతం..

మ‌తాల మ‌ధ్య‌, ప్రాంతాల మ‌ధ్య వైష‌మ్యాలు పెంచే త‌ర‌హా స్టోరీల‌తో, మత విద్వేష భావ‌జాలంతో సినిమాలు తెర‌కెక్కుతున్నాయి. ఇందులో మ‌న తెలుగు సినిమా ప‌రిశ్ర‌మ కూడా త‌ల‌ దూర్చడం ఆందోళ‌న క‌లిగిస్తోంది. ఈ మధ్య కాలంలో చూస్తే.. ‘ది కశ్మీర్‌ ఫైల్స్‌’.. ఇటీవల వచ్చిన ‘కార్తికేయ 2’, ‘ది కేరళ స్టోరీ’ కూడా బీజేపీ భావజాలానికి చాలా దగ్గరగా ఉండే సినిమాలు.

ఇవే కాదు.. పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ రాముడి పాత్ర పోషించిన ‘ఆదిపురుష్’, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన స్నేహితుడు యూవీ క్రియేషన్స్ నిర్మాత విక్రమ్ రెడ్డితో కలిసి కొత్తగా స్థాపించిన ‘వి మెగా పిక్చర్స్‌’లో నిఖిల్ హీరోగా చేస్తున్న ‘ది ఇండియా హౌజ్’ సంచలన రచయిత, కాపీ ద‌ర్శ‌కుడిగా ముద్ర పడిన ఎస్ఎస్ రాజమౌళి తండ్రి.. విజయేంద్ర ప్రసాద్ రెడీ చేస్తున్న రెండు కథలు..

ఇంకా చెప్పుకొంటూ పోతే చాలా సినిమాలు బీజేపీ భావజాలానికి దగ్గరగా రూపుదిద్దుకుంటున్నాయి. ఇండస్ట్రీ ఒక్కసారిగా ఇలా టర్న్ అవడానికి చాలా కారణాలే ఉన్నాయని, ముఖ్యంగా కొందరు కాషాయ నాయకులు వెనకుండి మరీ దీనిని ప్రోత్సహిస్తున్నారనేలా కొన్ని వార్తలు ఈ మధ్య ఇండస్ట్రీలో వినిపిస్తున్నాయి.

భీడ్‌కు అలా..

అనుభవ్ సిన్హా రూపొందించిన‌ భీడ్ సినిమా ట్రైలర్ మార్చి 10న విడుదలైంది. 2020 లాక్‌డౌన్ స‌మ‌యంలో లక్షల మంది వలస కార్మికులు ఎదుర్కొన్న దారుణ‌ స్థితిగ‌తుల‌ను ఇది చాటి చెప్పింది. ప్రధాని నరేంద్ర మోదీ లాక్‌డౌన్‌ను ప్రకటించడం, ఆ తర్వాత వలస కార్మికులపై పోలీసులు లాఠీలు ఝళిపిస్తున్నదృశ్యాలు! ట్రైల‌ర్‌లో ఇవి చూడ‌గానే ప్ర‌భుత్వ పెద్ద‌ల‌కు కోపం వ‌చ్చింది. పాల‌కుల ఉదాసీన‌త‌ను ఇందులో హైలైట్ చేసినందుకు మూడు రోజుల్లోనే ట్రైలర్‌ను తీసేశారు.

చిత్రం విడుదలయ్యే సమయానికి, 13 సార్లు మార్పులు, కోతలు చేరాయి.. ప్రభుత్వానికి సంబంధించిన అన్ని విమ‌ర్శ‌లు క‌త్తిరించేశారు. దీంతో సినిమా త‌న సారాన్ని కోల్పోయింది. ముల్క్, ఆర్టికల్- 15 వంటి సినిమాలు తీసి ఫేమ‌స్ అయిన ద‌ర్శ‌కుడు సిన్హాకు భార‌త దేశంలో సినిమాపై క‌నిపించ‌ని శ‌క్తుల ప్ర‌భావం చూసి గుండె బ‌రువెక్కింది. పాలకవర్గ భావజాలంతో సరితూగే చలనచిత్రాలను రూపొందించడానికి చెప్ప‌లేనంత ఒత్తిడి పెరిగింద‌ని ఆయ‌న కుండ‌బ‌ద్ద‌లు కొట్టిన‌ట్లు చెప్పారు.

రెండేళ్లలో 20కి పైగా ప్రచార చిత్రాలు

గత రెండేళ్ళలో, ఒక్క హిందీ చలనచిత్ర పరిశ్రమ నుంచే 20కి పైగా చిత్రాలు విడుదలయ్యాయి. వీటిలో మెజారిటీ సినిమాలు జాతీయవాదం, హిందూత్వ అంశాలను ప్ర‌ధానంగా తీసుకున్నవే కావ‌డం గుర్తించాలి. ‘ది కశ్మీర్ ఫైల్స్’, ‘సమ్రాట్ పృథ్వీరాజ్’, ‘రామ్ సేతు’, ‘కోడ్ నేమ్‌: తిరంగా’, ‘బ్రహ్మాస్త్ర పార్ట్ వన్: శివ’ వంటి చిత్రాల‌న్నీ మతపరమైన అజెండాను ప్ర‌జ‌ల్లోకి తీసుకెళ్లే చిత్రాలే.

రైట్ వింగ్ ఎజెండాకు అనుగుణంగా బాలీవుడ్ కొన్ని చిత్రాలను తెర‌కెక్కించింది. బీజేపీ భావజాలం ప్ర‌ముఖ సినిమా ద‌ర్శ‌కులు, నిర్మాత‌ల ద్వారా సినిమా రూపంలో ప్ర‌జ‌ల్లోకి వ‌స్తున్న‌ మాట వాస్తవమే.. అక్షయ్ కుమార్ నటించిన రామ్ సేతు ఇందుకు పెద్ద ఉదాహరణ అంటారు జేఎన్‌టియూలో స్కూల్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ ఈస్తటిక్స్‌లో సినిమా స్టడీస్ ప్రొఫెసర్ రంజినీ మజుందార్ .

గాడ్సేనూ కీర్తించే సినిమాలు!

ఈ సంవత్సరం, జనవరి 30న – 1948లో మహాత్మా గాంధీ హత్యకు గురైన రోజు – దర్శకుడు రాజ్‌కుమార్ సంతోషి ‘గాంధీ గాడ్సే, ఏక్ యుధ్’ అనే చిత్రాన్ని విడుదల చేశారు, ఇది నాథూరామ్ గాడ్సే తన భావ జాలాన్ని వివరించడానికి, అతని చర్యలను సమర్థించుకోవడానికి గాంధీని దూషించడానికి చిత్రీక‌రించిన సినిమా. గాంధీ నకిలీ ఉపవాసాలు చేసేవార‌ని, ఆయ‌న‌కు దేశం ప‌ట్ల సానుభూతి లేద‌న్న‌ట్లు స‌న్నివేశాలు ఉన్నాయి. ఈ చిత్రం ద్వారా వారు చెప్ప‌ద‌ల‌చింది ఏంటంటే, గాంధీ, గాడ్సే ఇద్దరూ ఒకే భావ‌జాలంతో స‌హ‌జీవ‌నం చేశార‌న్న‌ది.

భారీ బడ్జెట్‌తో సినిమాలు

ఇక సామ్రాట్-పృథ్వీరాజ్-2023లో కేవలం నాలుగు నెలల్లోనే, హిందీ చిత్ర పరిశ్రమలో పదికి పైగా భారీ బడ్జెట్, పెద్ద బ్యానర్ చిత్రాలు ప‌ట్టాలెక్కాయి. వీటిలో రణ్‌దీప్ హుడా నేతృత్వంలోని స్వతంత్ర వీర్ సావర్కర్, కరణ్ జోహార్ నిర్మించిన ఏ వతన్ మేరే వతన్, సిద్ధార్థ్ మల్హోత్రా నటించిన యోధా, ప్ర‌భాస్ హీరోగా న‌టిస్తున్న ఆదిపురుష్, సామ్ మానేక్షాగా విక్కీ కౌశల్‌తో మేఘనా గుల్జార్ సామ్ బహదూర్ చిత్రాలు ప్ర‌ముఖంగా చెప్పుకోవాల్సి ఉంది.

హెడ్గేవార్‌పైనా బయోపిక్‌

సినీ పరిశ్రమ హిందూత్వ భావజాలాన్నిప్ర‌జ‌ల్లోకి మ‌రింత బ‌లంగా తీసుకెళ్లే కఠోరమైన ప్రాజెక్ట్‌లు కూడా సిద్ధ‌మైపోయియి. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ వ్యవస్థాపకుడు హెడ్గేవార్ బయోపిక్ తెర‌కెక్క‌బోతునది. ఇది వ‌చ్చే దసరాకు విడుదల కానుంది. 2024లో ప్రారంభమయ్యే ఆర్‌ఎస్‌ఎస్ శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా భారతదేశంలోని గ్రామాలలో ప్రదర్శించబడే ఈ చిత్రానికి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ క్లాప్ కొట్టారు.

భారతదేశపు ప్రాచీన సంస్కృతి, సంప్రదాయాల్ని నిలబెట్టడమే అన్నిటి కంటే విలువైనదని చాటడం సంఘ్‌పరివార్‌ ఆశయం. అది ముందుకు వెళ్లాలంటే హిందువులందరినీ ఏక తాటి పైకి తీసుకు రావాలి. అది జరగాలంటే కేవలం సినిమా వల్లే సాధ్యమవుతుందని నాయకులు కొందరు ప్రగాఢంగా నమ్ముతున్నారు. అందుకే సినిమా ఇండస్ట్రీపై కన్నేసి.. వారు అనుకున్నది సాధించడం కోసం విశ్వప్రయత్నాలు చేస్తున్నారనేది తాజాగా సినిమా ఇండస్ట్రీలో వినిపిస్తోన్న వాదన.

కేంద్ర పెద్దలు కొందరు.. ఇటీవల సినిమా ఇండస్ట్రీలకు చెందిన ప్రముఖులను ప్రత్యేకంగా కలిసిన విషయం తెలిసిందే. ‘ఆస్కార్’ సంబరాలను ముగించుకుని వచ్చిన రామ్ చరణ్.. దేశంలో అడుగుపెట్టగానే ఎవరిని కలిశారో తెలియని విషయం కాదు. ఆయనని కలిసి వచ్చిన కొన్ని రోజులకే.. కొణిదెల ప్రొడక్షన్‌ కంపెనీ అనే బ్యానర్ ఉన్నా కూడా.. తన ఫ్రెండ్‌తో కలిసి ‘వి మెగా పిక్చర్స్’ అనే బ్యానర్ స్థాపించడంతో పాటు.. అందులో మొదటి సినిమాను వీర్ సావర్కర్ 140వ జయంతి సందర్భంగా ‘ది ఇండియా హౌజ్’ అని ప్రకటించి, మోషన్ పోస్టర్‌ని కూడా విడుదల చేశారు.

ఆ మోషన్ పోస్టర్ చూస్తుంటే.. సావర్కర్‌‌ జీవితంలోని ఓ భాగాన్ని ఇందులో చూపించబోతున్నారని.. స్వాతంత్ర‌ ఉద్యమానికి ముందు 1905లో లండన్‌లో జరిగిన సంఘటనలు, విప్లవానికి ఆజ్యం పోసిన ఘటనలను ఇందులో ఉంటాయనేది స్పష్టమైంది. దీంతో ఇది సంఘ్‌పరివార్‌ ప్రచార చిత్రం అనేలా విమర్శలు మొదలయ్యాయి. ‘ది కశ్మీర్ ఫైల్స్’ నిర్మించిన సంస్థ అభిషేక్ అగర్వాల్‌ ఆర్ట్స్ కూడా ఈ సినిమా నిర్మాణంలో భాగం కావడంతో.. అనుమానాలకు మరింత బలం చేకూరింది.

పన్ను మినహాయించిన బీజేపీ రాష్ట్రాలు

‘ది కశ్మీర్ ఫైల్స్’, ‘ది కేరళ స్టోరీ’ సినిమాల విషయంలో ఆగ్రహ జ్వాలలు వ్యక్తమైనా.. సంఘ్‌పరివార్‌ మాత్రం ఆ సినిమాలను ఎంతగానో ప్రోత్సహించింది. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో టాక్స్ రద్దు చేశారు. ప్రభుత్వం తరపున ప్రత్యేక షోలు వేయించారు. ఇదే క్రమంలో రాబోతున్న ప్రభాస్ ‘ఆదిపురుష్’ వెనుక కూడా వారే ఉన్నారనేలా ఇప్పటికే వార్తలు బయటికి వచ్చాయి. ఈ సినిమా జూన్ 16న థియేటర్లలో విడుదల కాబోతున్నది.

అయోధ్యలో రామమందిరం ఒకవైపు, శ్రీరాముడి ఘనతను చాటేలా ‘ఆదిపురుష్’ సినిమా మరోవైపు.. వెరసీ కొన్ని రోజుల పాటు జైశ్రీరామ్ శబ్ధం ప్రపంచాన్ని కమ్మేయనుంది. అదే కదా.. ఆర్ఎస్ఎస్ కోరుకునేది. ఇక రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్ కలం నుంచి రజాకార్లపై స్టోరీ, అలాగే ఆర్ఎస్ఎస్ ఫౌండర్ డా.కేశవ్ బలీరాం హెడ్గేవార్ జీవిత కథ ఆధారంగా సినిమాలు రానున్నాయనే వార్తలు వినిపిస్తున్నాయి. అదే నిజమైతే విజేంద్రప్రసాద్‌కు రాజ్యసభ సీటు ఎందుకొచ్చిందనే దానిపై ఓ స్పష్టత వచ్చేసినట్లే.

కథలిక దర్శకులవికావు..!

పద్మావత్, ది అన్‌సంగ్ వారియర్ వంటి మునుపటి సినిమాలు మతాన్ని జాతీయవాదంతో సమానం చేయడానికి ప్రయత్నించాయి.కాశ్మీరీ పండిట్ వలసల గురించి మాట్లాడిన ది కాశ్మీర్ ఫైల్స్‌తో ఇది గరిష్ట స్థాయికి చేరుకుంది. బ్లాక్ బస్టర్ పఠాన్ కూడా — షారుఖ్ ఖాన్ కు ఆరెస్సెస్ వాదం చుక్క‌లు చూపించింది.

భారతదేశాన్ని ఎలా ప్రొజెక్ట్ చేయాలో, హిందూ జీవన విధానాన్ని ఎలా హైలైట్ చేయాలో, ఎలాంటి ప్రేమ క‌థ‌లు చూపించాలో ఇప్పుడు ర‌చ‌యిత‌లు, ద‌ర్శ‌కులు, ప్రేక్ష‌కుల చేతిలో లేదు. అది అనుకోకుండానే సంఘ్‌పరివార్‌ చేతిలోకి వెళ్లిపోయింది. ఒక హిందూ-ముస్లిం మ‌ధ్య ప్రేమ క‌థ పెట్టి సినిమా తీసే ధైర్యం దేశంలో ఏ ఒక్క‌రికీ లేకుండాపోయిన నిర్బంధ ప‌రిస్థితులు ఇప్పుడు ఉన్నాయి.

ఐక్యత బోధించిన నాటి సినిమాలు నేడెక్కడ?

2014 వరకు, భారతదేశంలో ప్రధానంగా లౌకికవాదం, భిన్నత్వంలో ఏకత్వం అనే చర్చ జరిగింది, ఆ స్ఫూర్తిని ప్రతిబింబించే సినిమాలు వ‌చ్చాయి. “అమర్ అక్బర్ ఆంథోనీ, మణిరత్నం సూప‌ర్ హిట్ మూవీ బొంబాయి, రెఫ్యూజీ, వీర్-జారా, జోధా అక్బర్ వంటి సినిమాలు భార‌త‌దేశ థియేట‌ర్ల‌ను కిక్కిరిసేలా చేశాయి. ‘హిందూ-ముస్లిం ఐక్యత’తో మాస్ ఎంటర్‌టైనర్‌లుగా రికార్డులు సృష్టించాయి.

2014 తర్వాత, అకస్మాత్తుగా బాలీవుడ్‌లో సంఘ్ ఎజెండా అమ‌లు అవుతోంది. అందుకే మోడీ బయోపిక్ సినిమా తయారైంది. మన్మోహన్ సింగ్ పాత్రను హత్య చేసేలా ‘ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్’ వంటి సినిమాలు పుట్టుకొచ్చాయి. ఆ తర్వాత కాశ్మీర్ ఫైల్స్, తాన్హాజీ వంటి కాషాయ అజెండా సినిమాలు దేశ‌వ్యాప్తంగా విడుదలయ్యాయి.

హిందీ పరిశ్రమపై ఒత్తిడికి సంబంధించిన మొదటి ప్ర‌మాదం 2016లో వెలుగుచూసింది. రొమాంటిక్ డ్రామా ‘ఏ దిల్ హై ముష్కిల్‌’లో పాకిస్థానీ నటుడు ఫవాద్ ఖాన్‌కు అవ‌కాశం ఇవ్వ‌డంతో నిర్బంధం మొద‌లైంది. ఆ భయంతోనే దర్శకుడు కరణ్ జొహార్ భవిష్యత్తులో పాకిస్థానీ న‌టుల‌తో ప‌నిచేయ‌న‌ని చెప్పాల్సి వ‌చ్చింది.

ఒక్కొక్కరిది ఒక్కో ఆశ

అధికార బెదిరింపులకి తలొగ్గి కొందరు.. భారీ బ‌డ్జెట్‌తో తీసే సినిమాల‌కు ప్ర‌భుత్వం త‌రఫున వ‌చ్చే ఇబ్బందుల నుంచి త‌ప్పించుకోవ‌డానికి ఇంకొంద‌రు, అవార్డులు, రివార్డుల ఆశతో మరికొందరు.. పరివార్‌ మార్గంలో సినిమా ఇండస్ట్రీని తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారనేది కాదనలేని నిజం. ఆ బెదిరించే నాయకులు, బహుమతులతో పడేసే నాయకులు ఎవరనేది పక్కన పెడితే.. సినిమా ఇండస్ట్రీ అలాంటి వారి కనుసన్నలలో నడుస్తున్న‌ద‌ని చెప్పడానికి చాలా ఉదాహరణలే ఉన్నాయి. ఇది ఎటు దారితీస్తుందో.. ముందు ముందు ఎలాంటి యుద్ధాలకు ప్రేరేపిస్తుందనేదనేది భయాందోళనలకు గురిచేస్తోంది.