ప్రాణప్రతిష్ఠ రోజునే పెద్ద సంఖ్యలో కాన్పులు.. ఎక్కడంటే?
అయోధ్యలోని రామమందిరంలో బాలరాముడు అభిజిత్ లగ్నంలో కొలువుదీరిన సంగతి తెలిసిందే

న్యూఢిల్లీ : అయోధ్యలోని రామమందిరంలో బాలరాముడు అభిజిత్ లగ్నంలో కొలువుదీరిన సంగతి తెలిసిందే. ఈ దివ్యముహుర్తంలోనే తమ బిడ్డలకు జన్మనివ్వాలని కలలు కన్న దంపతులు వివిధ ఆస్పత్రులను సంప్రదించి నిన్నే కాన్పు జరిగేలా ఏర్పాట్లు చేసుకున్నారు. సాధారణ కాన్పులు కాని పక్షంలో సిజేరియన్లకూ ప్లాన్ చేసుకుని మరీ పిల్లలను కన్నారు. ఇక పుట్టిన పిల్లలను చూసి ఆ శ్రీరాముడే తమ ఇంట పుట్టాడని మురిసిపోయారు. చాలా మంది మగబిడ్డలకు రామ్ అని, ఆడపిల్లలకు సీత అని నామకరణం చేసుకున్నారు.
ఇక బీహార్‌లో అత్యధికంగా సోమవారం 500 మంది శిశువు జన్మించినట్లు అధికారులు వెల్లడించారు. మధ్యప్రదేశ్‌లోని మూడు జిల్లాలో వివిధ ఆస్పత్రుల్లో కనీసం 47 మంది శిశువులు జన్మించారు. యూపీలోని కాన్పూర్ గణేశ్ శంకర్ ఆస్పత్రిలో 25 మందికి కాన్పులు జరిగాయి. కర్ణాటకలోని విజయపురలో జేఎస్ఎస్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో 20 మందికి పైగా ప్రసవించారు. ఉత్తరప్రదేశ్‌లోని ఫిరోజాబాద్ జిల్లా ఆస్పత్రిలో మగబిడ్డకు జన్మనిచ్చిన ఫర్జానా అనే ముస్లిం మహిళ తన బిడ్డకు రామ్ రహీం అని నామకరణం చేశారు. చాలా మంది తమ బిడ్డలకు రామ్ అని లేదా ఆ పేరును సూచించే రాఘవ్, రాఘవేంద్ర, రఘు అని పేర్లు పెట్టుకున్నారు.