BRS | విధాత: రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే బీఆరెస్ పార్టీ అభ్యర్థుల తొలి జాబితా ఖరారైనట్లుగా గులాబీ వర్గాలలో ప్రచారం ఊపందుకుంది. బీఆరెస్ అధినేత, సీఎం కేసీఆర్ ఇప్పటికే నిర్ణయించిన పలు సర్వేలలో సీటింగ్ ఎమ్మెల్యేల పై ప్రజాభ్రిప్రాయం, ఆశావహుల బలం, ప్రత్యర్థి పార్టీల బలాబలాల విశ్లేషణ పిదప తొలి జాబితాలో 60మందికి పైగా అభ్యర్థులను ఖరారు చేసినట్లుగా తెలుస్తుంది. ఇందులో మంత్రులు, సీటింగ్ ఎమ్మెల్యేల పేర్లు ఉన్నాయని, తొలి జాబితాను ఈ నెల 20వ సీఎం కేసీఆర్ ప్రకటించనున్నారన్న ప్రచారం బలంగా వినిపిస్తోంది.
తొలి జాబితాలో ఖచ్చితంగా గెలుస్తారన్న నమ్మకమున్న అభ్యర్థుల పేర్లు ఉంటాయని తెలుస్తుంది. తొలి జాబితాకు సంబంధించి ఇప్పటికే ఫాంహౌజ్, ప్రగతి భవన్ కేంద్రంగా కొన్ని రోజుల నుంచి సీఎం కేసీఆర్ కసరత్తు పూర్తి చేశారని, లాంఛన ప్రకటనే తరువాయని గులాబీ వర్గాల్లో చర్చలు సాగుతున్నాయి. అయితే తొలి జాబితాలో ఉన్న అభ్యర్థుల పేర్ల విడుదల నేపధ్యంలో వారి స్థానాల్లో అసమ్మతి తలెత్తకుండా ఆ నియోజకవర్గాల్లోని అసంతృప్తి, అసమ్మతి నేతలను బుజ్జగించే పనులను బీఆరెస్ అధిష్టానం ముమ్మరం చేసింది.
మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావుతో పాటు కవితలు, కేసీఆర్‌కు సన్నిహితంగా ఉండే మంత్రులు, నేతలను రంగంలోకి దించి తొలి జాబితా నియోజకవర్గాల్గోలని అసంతృప్తులతో వరుస భేటీలు నిర్వహిస్తు బుజ్జగింపు మంతనాలు ముమ్మరం చేశారు. తొలి జాబితాలో పెద్దగా సంచనాలతో కూడిన మార్పులు, చేర్పులు ఉండకపోవచ్చని, కొంత మంది సీటింగ్ ఎమ్మెల్యేల సీట్లు గల్లంతయ్యే అవకాశముందని, ఖమ్మం వలస నేతలకు చాన్స్ ఉంటుందన్న చర్చలు వినిపిస్తున్నాయి. తదుపరి జాబితాలో మాత్రం పెద్ద ఎత్తున సీటింగ్‌ల మార్పు, కొత్త ముఖాలకు, వలస నేతలకు టికెట్ల ఖరారుకు అవకాశముందని తెలుస్తుంది.
కామ్రేడ్ల స్థానాలపై తెగని ఉత్కంఠ
బీఆరెస్‌తో నామమాత్ర మిత్రపక్షాలుగా ఉన్న సీపీఎం, సీపీఐలతో ఎన్నికల పొత్తు, సీట్ల సర్ధుబాటు విషయంలో ఒకవైపు సందిగ్ధత కొనసాగుతున్న నేపధ్యంలోనే ఈ నెల 20న సీఎం కేసీఆర్ బీఆరెస్ తొలి జాబితా ప్రకటిస్తారన్న ప్రచారం కామ్రేడ్లను కలవర పెడుతుంది. పొత్తులు, సీట్ల పంపకాలపై ఇప్పటిదాకా తమకు సీఎం కేసీఆర్ నుంచి ఆహ్వానం రాకపోవడం కమ్యూనిస్టులను అసహనానికి గురి చేస్తుంది.
బీఆరెస్ తొలి జాబితాలో తాము కోరుతున్న స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేస్తే ఇక పొత్తుల అంశం అటకెక్కినట్లేనని సీపీఎం, సీపీఐ నేతలు భావిస్తున్నారు. ఇప్పటికే గురువారం సీపీఐ రాష్ట్ర కమిటీ సమావేశంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు మాట్లాడుతు బీఆరెస్‌తో పొత్తు ఉన్నా లేకున్నా సీపీఐ కొత్తగూడెంలో పోటీ చేయడం ఖాయమంటు ప్రకటించడంతో పొత్తుల అంశం సస్పెన్స్ థ్రిల్లర్స్ ఎపిసోడ్ లాగా కొనసాగుతుంది.