విధాత BRS అధిష్టానం తమ పార్టీకి అనుబంధంగా కొత్త ఉపాధ్యాయ సంఘాన్ని ప్రారంభించే యోచన చేస్తున్నట్లుగా మొదలైన ప్రచారం ఉపాధ్యాయ వర్గాల్లో ఆసక్తి రేపుతుంది. రంగారెడ్డి- -హైదరాబాద్-మహబూబ్ నగర్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రస్తుతం తమకు అనుబంధంగా వ్యవహరిస్తున్న PRTU అభ్యర్థి ఓటమి చెందడం, BJP అనుబంధం ఉపాధ్యాయ సంఘం తపస్ అభ్యర్థి ఏవిఎన్ రెడ్డి గెలుపొందిన నేపథ్యంలో PRTUలో తలెత్తిన లుకలుకలు BRS అధిష్టానాన్ని అంతర్మథనానికి గురి చేస్తున్నాయి.
రాజకీయ పార్టీలకు ఎన్నికలవేళ ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు కీలకంగా మారుతుండడం కాదనలేని వాస్తవం. అసలే రాష్ట్ర రాజకీయాలు BRS వర్సెస్ BJP అన్నట్లుగా సాగుతున్న క్రమంలో BJP అనుబంధ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థి గెలవడం.. ఇదే సమయంలో తనకు అనుబంధంగా ఉన్న PRTU సంఘంలో లుకలుకలు బయటపడటం BRS అధిష్టానాన్ని ఆలోచనలో పడేశాయి.
సిపిఎం పార్టీకి అనుబంధంగా UTF, BJPకి అనుబంధంగా TPUS సంఘాలు ఉన్నట్లుగా TRS ఏర్పడిన నాటి నుండి స్వసిద్దమైన ఉపాధ్యాయ సంఘం లేక తెలంగాణ వచ్చినంక PRTU పై ఆధారపడుతూ వచ్చింది.
అందులో లుకలుకలు మొదలు కావడంతో బిఆర్ఎస్ కు అనుబంధంగా నూతన ఉపాధ్యాయ సంఘాన్ని ఏర్పాటు చేసుకోవాలనే ఆలోచనకు అధిష్టానానికి వచ్చిందని తెలుస్తోంది.
ప్రస్తుత PRTU సంఘంపై ఎక్కువ కాలం ఆధారపడడం కంటే BRSకు అనుబంధంగా కొత్త సంఘాన్ని ఏర్పాటు చేస్తే ఎలా ఉంటుందన్న దానిపై కసరత్తు చేసేందుకు ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డిని పురమాయించినట్లుగా ప్రచారం సాగుతుంది.
కొత్త సంఘానికే మొగ్గు ..!
ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ కు అనుబంధంగా వ్యవహరించిన PRTU ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు పిదప అధికార BRSకు అనుబంధంగా మారిపోయింది. స్వరాష్ట్రంలో నల్గొండ- -ఖమ్మం-వరంగల్ ఎమ్మెల్సీ స్థానానికి జరిగిన తొలి ఎన్నికల్లో పూల రవీందర్ ఎమ్మెల్సిగా గెలవగా, తదుపరి ఎన్నికల్లో ఆయన ఓటమి, UTF గెలుపుతో వెనుకబడింది.
తాజాగా రంగారెడ్డి- హైదరాబాద్- మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లోను PRTU ఓటమి పాలైంది. ఈ ఎన్నికల్లో పార్టీ నుండి జనార్దన్ రెడ్డి, చెన్నకేశవరెడ్డిలు పోటీ పడడంతో ఓట్లు చీలి ఏవిఎన్ రెడ్డి గెలుపుకు దోహద పడింది. అసలు ఈ ఎన్నికల్లో అభ్యర్థిగా BRS అధిష్టానం జనార్దన్ రెడ్డి వైపు మొగ్గు చూపిందని, అప్పటికే PRTU నాయకత్వం చెన్నకేశవరెడ్డిని అభ్యర్థిగా ప్రకటించడంతో చేసేది లేక చివరకు చెన్నకేశవరెడ్డి గెలుపు పార్టీకి రాజకీయంగా ప్రతిష్టాత్మకం కావడంతో BRS తప్పనిసరి తోడ్పాటునిచ్చిందన్న వాదన వినిపించింది.
ఎన్నికల ఫలితాల విశ్లేషణ సందర్భంగా చెన్నకేశవరెడ్డి గెలుపు కోసం పార్టీ పరంగా అందించిన ఆర్థిక సహకారాన్ని కూడా సంఘ నాయకత్వం సద్వినియోగం చేయలేదన్న సమాచారం BRS అధిష్టానాన్ని మరింత అసహనానికి గురి చేసింది.
అంతేగాక రంగారెడ్డి-హైదరాబాద్- మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో PRTUలోని ఓవర్గం ప్రత్యర్ధి గెలుపుకు సహకరించిందన్న ఆరోపణల రచ్చ PRTU సంఘాన్ని కుదిపేసింది. ఫైమెన్ కమిటీ వేసి విచారించిన రాష్ట్ర కమిటీ నల్గొండ జిల్లా సంఘం అధ్యక్షుడు భిక్షంగౌడ్ ను, రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు నల్లమేకల వెంకయ్యతో పాటు ఆరుగురుని సంఘము నుండి సస్పెండ్ చేసింది.
ఈ పరిణామాల్లో రాజకీయంగా పార్టీకి సంఘం మనుగడ ముఖ్యమైనందునా తొలుత BRS అధిష్టానం PRTU రాష్ట్ర కమిటీకి బాసట నిచ్చింది. భిక్షం గౌడ్ కు మద్దతునిచ్చిన ఎమ్మెల్యేలను సైతం కట్టడి చేసింది. PRTU సంఘంలో అంతర్గత లుకలుకలు తీవ్రంగా ఉన్నాయని భావిస్తున్న BRS అధిష్టానం సంఘ భవిష్యత్తుపై తాజాగా పోస్టుమార్టం సాగించినట్లు తెలుస్తుంది.
సంఘంలోని అసంతృప్తి వాదులపై, బహిష్కృత వర్గంపై బీజేపీ అనుబంధ తపస్ వల వేయడం కూడా BRS అధిష్టానాన్ని మరింత ఆలోచనకు గురి చేసింది. రంగారెడ్డి-హైదరాబాద్- మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ ఎన్నికల మాదిరిగా భవిష్యత్తులో రానున్న నల్గొండ-ఖమ్మం-వరంగల్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో BJP తన ప్రణాళికలకు పదును పెడితే పరిస్థితి ఏమిటన్న దానిపై BRS దృష్టి సారించింది.
ఈ నేపథ్యంలో PRTU స్థానంలో పార్టీకి అనుబంధంగా కొత్త ఉపాధ్యాయ సంఘం ఏర్పాటు సాధ్యాసాధ్యాలపై BRS అధినాయకత్వం దృష్టి సారించింది. నల్గొండ-ఖమ్మం-వరంగల్ ఎమ్మెల్సీ ఎన్నికలలో PRTUలో ముగ్గురు నాయకులు సీటు ఆశలు పెట్టుకున్నారు.
వారంతా ఎన్నికల్లో ఐక్యంగా సాగుతారో లేదో అన్న సందేహాలకు తోడు ప్రస్తుత సంఘంలో ప్రభుత్వ వ్యతిరేక ఆలోచన పెరిగిందన్న ఆందోళన, సంఘ నాయకత్వంపై పార్టీ పట్టు సడలడం ఒకవైపు, తపస్ ను నిలువరించాలన్న లక్ష్యం ఇంకోవైపుగా ఉన్న నేపథ్యంలో కొత్త ఉపాధ్యాయ సంఘం ఏర్పాటు యోచనకే బిఆర్ఎస్ అధిష్టానం మొగ్గు చూపిందని సమాచారం.
ముఖ్యంగా అధికారం ఉన్నప్పుడే జిల్లాల్లోని మంత్రుల, ఎమ్మెల్యేల, ఎమ్మెల్సీల సహకారంతో BRSకు అనుబంధంగా కొత్త ఉపాధ్యాయ సంఘం నిర్మాణం చేయాలని పార్టీ అధినాయకత్వం తలపోస్తుందని సమాచారం. కొత్త ఉపాధ్యాయ సంఘం ఏర్పాటుకు కసరత్తు చేయాలని విద్యారంగంకు చెందిన ఎమ్మెల్యేలను, ఎమ్మెల్సీలను BRS అధినాయకత్వం పురమాయించిందన్న ప్రచారం ఇప్పుడు ఉపాధ్యాయ వర్గాల్లో ఆసక్తికర చర్చలకు ఆజ్యం పోస్తుంది.