విధాత: తెలంగాణ ప్రభుత్వం ఈ నెలలో వచ్చే రెండో శనివారం విషయం కీలకం నిర్ణయం తీసుకుంది. ఆ రోజున సెలవును రద్దు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. నెలలో ప్రతి రెండో శనివారం రోజున ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలకు సెలవు అమలవుతున్న సంగతి తెలిసిందే. కానీ హైదరాబాద్, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాల్లోని ప్రభుత్వ కార్యాలయాలకు, విద్యాసంస్థలకు ఈ రెండో శనివారం రోజున సెలవును రద్దు చేసింది.
సెలవు రద్దు ఎందుకంటే..?
ఈ ఏడాది సెప్టెంబర్ 9న వినాయక నిమజ్జనం సందర్భంగా ప్రభుత్వం సాధారణ సెలవుగా ప్రకటించింది. అందుకు బదులుగా ఈ నెల 12న సెలవులను రద్దు చేసినట్లు ప్రభుత్వం పేర్కొంది. ఈ మేరకు ప్రభుత్వ కార్యదర్శి సోమేష్ కుమార్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు.