Censorship of the Press। కేంద్రానికి వ్యతిరేకంగా వార్తలు రాస్తే.. కత్తెరే

Censorship of the Press వార్తలను వడ కట్టే ‘నిజ నిర్ధారణ వ్యవస్థ’! వ్యతిరేక వార్తలపై కాషాయ సర్కార్‌ ఆంక్షలు ఫ్యాక్ట్‌ చెక్‌ యూనిట్‌ను నోటిఫై చేయనున్న కేంద్రం కేంద్రానికి వ్యతిరేకంగా ఉన్న కంటెంట్‌ పై కోతలు సదరు పోస్టులు, యూఆర్‌ఎల్స్‌ను తొలగించాల్సిందే కొత్త నిబంధనలపై వెల్లువెత్తుతున్న విమర్శలు క్రూర నిబంధనలన్న ఎడిటర్స్‌ గిల్డ్‌ ఆఫ్ ఇండియా విధాత : దేశంలో మీడియాపై సెన్సార్‌షిప్‌ (Censorship of the Press) మొదలవనున్నదా? కేంద్ర ప్రభుత్వం తనకు వ్యతిరేకంగా […]

  • Publish Date - April 7, 2023 / 01:32 PM IST

Censorship of the Press

  • వార్తలను వడ కట్టే ‘నిజ నిర్ధారణ వ్యవస్థ’!
  • వ్యతిరేక వార్తలపై కాషాయ సర్కార్‌ ఆంక్షలు
  • ఫ్యాక్ట్‌ చెక్‌ యూనిట్‌ను నోటిఫై చేయనున్న కేంద్రం
  • కేంద్రానికి వ్యతిరేకంగా ఉన్న కంటెంట్‌ పై కోతలు
  • సదరు పోస్టులు, యూఆర్‌ఎల్స్‌ను తొలగించాల్సిందే
  • కొత్త నిబంధనలపై వెల్లువెత్తుతున్న విమర్శలు
  • క్రూర నిబంధనలన్న ఎడిటర్స్‌ గిల్డ్‌ ఆఫ్ ఇండియా

విధాత : దేశంలో మీడియాపై సెన్సార్‌షిప్‌ (Censorship of the Press) మొదలవనున్నదా? కేంద్ర ప్రభుత్వం తనకు వ్యతిరేకంగా వివిధ సామాజిక మాధ్యమాల్లో వచ్చే పోస్టులపై కత్తులు ఎక్కుపెట్టనున్నదా? ప్రభుత్వ తాజా చర్యలు అవే అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. అనేక అనుమానాలు, ఆందోళనలు వెల్లువెత్తుతున్నప్పటికీ.. ఫేస్‌బుక్‌, ట్విట్టర్‌ మొదలైన ఆన్‌లైన్‌ ప్లాట్‌ఫాంలలో కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి ఉన్న అంశాలు నిజమా? తప్పుదారి పట్టించేవా? అనేది గుర్తించేందుకు ‘నిజ నిర్థారణ వ్యవస్థ’ను నియమించనున్నది.

ఈ సంస్థ ఏదైనా ‘కంటెంట్‌’ను తప్పు/ఫేక్‌ అని తేల్చిందంటే.. సదరు పోస్టు లేదా కంటెంట్‌ ఉన్న ప్లాట్‌ఫాం.. దానిని తొలగించక తప్పదు. లేదంటే.. వాటికి చట్టపరంగా ఉన్న రక్షణలను తొలగిస్తారు. ఈ మేరకు ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ నిబంధనలు-2021లో సవరణలు చేస్తూ నోటిఫికేషన్‌ను కేంద్ర ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ ఐటీ మంత్రిత్వ శాఖ విడుదల చేసింది. దేశంలోని పత్రికలు, మీడియా సంస్థల ప్రతినిధి సంస్థ అయిన ఎడిటర్స్‌ గిల్డ్‌ ఈ నోటిఫికేషన్‌ను తీవ్రంగా తప్పుపట్టింది. ఇది పత్రికా స్వేచ్ఛకు సంకెళ్లు వేయడమేనని వ్యాఖ్యానించింది.

వాస్తవానికి కొన్ని నెలల క్రితమే.. జనవరిలో ప్రభుత్వం ఒక ప్రతిపాదన చేసింది. కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన వార్తలను వివిధ పత్రికలు, మీడియా సంస్థలకు అందించే కేంద్ర ప్రభుత్వం నోడల్‌ ఏజెన్సీ.. ప్రెస్‌ ఇన్ఫర్మేషన్‌ బ్యూరో ఏదైనా వార్తను ఫేక్‌ అని గుర్తించినట్టయితే.. ఇంటర్మీడియర్స్‌ దానిని ఆన్‌లైన్‌లో పెట్టకూడదు. అయితే.. తుది నిబంధనల్లో పీఐబీ ప్రస్తావనను కేంద్రం తీసుకురాలేదు. కేంద్రం ఈ తరహా వ్యవస్థను తీసుకురానున్నట్టు జనవరిలో సంకేతాలు పంపినప్పుడే ఈ ప్రతిపాదనపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి.

తుది నిబంధనలు ఏం చెబుతున్నాయి?

కేంద్రం నోటిఫై చేసే ఫ్యాక్ట్‌ చెక్‌ యూనిట్‌.. కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన సమాచారం ఏదైనా ఫేక్‌ లేదా తప్పుదారి పట్టించేది అని గుర్తించినట్టయితే.. సామాజిక మాధ్యమాలైన ఫేస్‌బుక్‌, యూట్యూబ్‌, ట్విట్టర్‌తోపాటు.. ఇంటర్‌నెట్‌ సర్వీస్‌ ప్రొవైడర్లు అయిన ఎయిర్‌టెల్‌, జియో, వొడాఫోన్‌ ఐడియా వంటివి సదరు కంటెంట్‌ను ఆన్‌లైన్‌లోకి రాకుండా ‘సహేతుక ప్రయత్నాలు’ చేయాలని కొత్త నిబంధనలు పేర్కొంటున్నాయి. సూటిగా చెప్పాలంటే.. కేంద్రం నియమించుకున్న సంస్థ ఏది వద్దనుకుంటే.. అది ఇంటర్‌నెట్‌లోకి రాదన్నమాట! ఉదాహరణకు.. ఏదైనా సమాచారం ఫేక్‌ అని ఫ్యాక్ట్‌ చెక్‌ యూనిట్‌ గుర్తిస్తే.. ఇంటర్మీడియరీలు వాటికి సంబంధించిన పోస్టులు, యూఆర్‌ఎల్స్‌ను తీసివేయాల్సి ఉంటుంది.

కొత్త నిబంధనలపై ఆందోళనేంటి?

కొత్త నిబంధనలు న్యూస్‌ పబ్లిషర్లు, పాత్రికేయులు, సామాజిక కార్యకర్తలు వంటివారి భావ ప్రకటనా స్వేచ్ఛకు భంగకరమని పౌర సమాజ సంస్థలు అంటున్నాయి. ఆన్‌లైన్‌లో తమ గళాన్ని వినిపించే అవకాశాన్ని కోల్పోయే ప్రమాదం ఉన్నదని ఢిల్లీకి చెందిన డిజిటల్‌ హక్కుల గ్రూప్‌ ‘ఇంటర్‌నెట్‌ ఫ్రీడం ఫౌండేషన్‌’ పేర్కొన్నది. ఇది అంతిమంగా ఆన్‌లైన్‌లో వాస్తవాలు మాట్లాడేవారి గొంతు నొక్కడమే అవుతుందని అంటున్నారు. అయితే.. కేంద్ర ప్రభుత్వం మాత్రం తాము నోటిఫై చేయబోయే నిజ నిర్ధారణ యూనిట్‌.. విశ్వసనీయంగా పనిచేస్తుందని అంటున్నది. ఇది దుర్వినియోగం అవుతుందేమో అనే అనుమానాలు ప్రజల మనసులలో ఉంటే.. వాటన్నింటినీ తాము ఏజెన్సీని నోటిఫై చేసే సమయంలో నివృత్తి చేస్తామని ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ ఐటీ శాఖ సహాయ మంత్రి రాజీవ్‌ చంద్రశేఖర్‌ చెప్పారు. కొన్ని నియమనిబంధనలు ఉంటాయిని, వాటిని సదరు ఫ్యాక్ట్‌ చెక్‌ యూనిట్‌ తప్పనిసరిగా పాటించాల్సి వస్తుందని తెలిపారు.

క్రూర నిబంధనలను వెంటనే తొలగించాలి : ఎడిటర్స్‌ గిల్డ్‌

సొంతగా ఒక ఫ్యాక్ట్‌ చెక్‌ యూనిట్‌ను నియమించుకుని, సోషల్‌ మీడియాలో వార్తలపై పోలీసింగ్‌ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలపై ఎడిటర్స్‌ గిల్డ్‌ ఆఫ్‌ ఇండియా తీవ్ర విస్మయం వ్యక్తం చేసింది. ఈ కొత్త నిబంధనలు క్రూరమైనవని, మీడియా స్వేచ్ఛపై సెన్సార్‌షిప్‌కు దారి తీస్తాయని పేర్కొన్నది. ఫేక్‌న్యూస్‌ ఏదో నిర్ధారించే సంపూర్ణ అధికారం కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉండకూడదని, అది అంతిమంగా మీడియాపై సెన్సార్‌షిప్‌కు దారి తీస్తుందని ఎడిటర్స్‌ గిల్డ్‌ హెచ్చరించింది. ఇది మీడియాపై పెను ప్రభావం చూపిస్తుందని, వెంటనే ఉపసంహరించాలని న్యూస్‌ బ్రాడ్‌కాస్టర్స్‌ అండ్‌ డిజిటల్‌ అసోసియేషన్‌ డిమాండ్‌ చేసింది.

వ్యతిరేక శక్తుల గొంతు నులిమేందుకేనా?

కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం అనేక అంశాల్లో మేధోవర్గం నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నది. దేశంలో పెచ్చరిల్లుతున్న మతోన్మాదంపై, దేశంలో నెలకొన్న సమస్యలపై అనేక సంస్థలు సామాజిక మాధ్యమాల్లో తమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నాయి. అవి ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశాలు అవుతున్నాయి. ఇండియా వెలిగిపోతున్నదని అధికార పక్షం చెప్పుకొంటున్నా.. వాస్తవాలు మాత్రం అందుకు విరుద్ధంగా ఉన్న తీరును ప్రతిపక్షాలు, ఇతర సామాజిక స్పృహ ఉన్న సంస్థలు విశ్వవ్యాప్తం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే మోదీ సర్కారు ఈ నల్ల నిబంధనలను ముందుకు తెస్తున్నదన్న అభిప్రాయాలను మేధావి వర్గం వ్యక్తం చేస్తున్నది