విధాత: ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఏపీకి ఉదారంగా నిధులు విడుదల చేయడం పట్ల ఏపీ దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ (Minister Kottu Satyanarayana) కొత్త భాష్యం చెప్పారు. విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో మే నెలలో సీఎం వైఎస్ జగన్ రాజశ్యామల యాగం నిర్వహించారు.
శ్రీ లక్ష్మీ మహా యజ్ఞం పూర్ణాహుతి కార్యక్రమంలో సీఎం వైయస్.జగన్, కొట్టు సత్యనారాయణ దంపతులు పాల్గొన్నారు. ఏపీ సర్వతోముఖాభివృద్ధిని కాంక్షిస్తూ అమ్మవారికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు సమర్పించారు. అమ్మవారి ఆశీస్సులు అందుకున్నారు.
ఈ నేపథ్యంలో కేంద్రం విభజన హామీల్లో భాగంగా ఇవ్వాల్సిన రెవెన్యూ లోటుతో పాటు ఇతర నిధుల్ని విడుదల చేసింది. రూ.10 వేల కోట్ల మేర రెవెన్యూ లోటు నిధులతోపాటు, పోలవరం కోసం మరో 11 వేల కోట్ల రూపాయల విడుదలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కేంద్రం ఇలా నిధులివ్వడానికి రాజశ్యామల యాగం చేయడమే కారణమని దేవాదాయశాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ అభిప్రాయపడ్డారు.
యాగం చేసిన ఫలితంగా అనుకూల పరిస్థితులు వచ్చాయని తెలిపారు. ఎప్పటి నుంచో పెండింగ్ లో ఉన్న నిధులు విడుదల కావడంతో రాష్ట్రానికి నిధుల వరద అని మీడియాలో కథనాలు వచ్చాయని కొట్టు వెల్లడించారు. ఇది యజ్ఞఫలితమనే చెప్పటానికి దేవదాయశాఖ మంత్రిగా చొరవ తీసుకున్నట్లు మంత్రి తెలిపారు.