విశాల్ ఆరోపణలపై సత్వరం విచారణ

- స్పందించిన కేంద్ర ప్రభుత్వం
ఫిలిం సెన్సార్ బోర్డు అవినీతికి పాల్పడుతున్నదని సినీ హీరో విశాల్ చేసిన ఆరోపణలపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది. వెంటనే విచారణ జరిపేందుకు ఒక సీనియర్ అధికారిని కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి కార్యాలయం శుక్రవారం హుటాహుటిన ముంబైకి పంపింది. ‘ఈ రోజే విచారణ జరపాలి’ అని ఆయనను ఆదేశించింది.
గత వారం ఉత్తర భారతదేశంలో విడుదలైన తన కొత్త సినిమా మార్క్ ఆంటోనీ హిందీ వర్షన్‌కు సెన్సార్ బోర్డు నుంచి సర్టిఫికెట్ పొందటానికి 6.5 లక్షలు లంచాలు ఇవ్వాల్సి వచ్చిందని గురువారం సాయంత్రం విశాల్ సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే.
మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండేతోపాటు.. ప్రధాని మోదీని ఉద్దేశించి విశాల్ ఆ వీడియోలో మాట్లాడారు. విశాల్ చేసిన ఆరోపణలు తీవ్ర దురదృష్టకరమని పేర్కొన్న సమాచార శాఖ.. అవినీతిని సహించేది లేదని స్పష్టం చేసింది. సెన్సార్ బోర్డు ఇంకెవరినైనా ఇలా లంచాల పేరుతో వేధించి ఉంటే వారు వివరాలు అందజేయాలని కోరింది. అవినీతికి పాల్పడినవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపింది.