వరంగల్ తూర్పు BRSలో కొత్త మార్పు.. విభేదాలు వీడి నేతలు కలిసిపోయారా?

విభేదాలు వీడి నేతలు కలిసిపోయారా? కేసీఆర్ జన్మదిన వేడుకల్లో 'ఐక్య ప్రదర్శన' ప్రారంభానికి హాజరైన మేయర్ సుధారాణి ఎగ్జిబిషన్ సందర్శించిన పసునూరి, బసవరాజు, మెట్టు గులాబీ పార్టీ వర్గాల్లో గుసగుసలు ఎన్నికల ఎత్తుగడల్లో ఎవరికి వారే విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: వరంగల్ తూర్పు నియోజకవర్గం గులాబీ లీడర్ల మధ్య సఖ్యత నెలకొన్నదా? అనే చర్చ సాగుతుంది. ఎంత కాలం ఉప్పూ నిప్పుగా ఉంటూ ఒకరిపై ఒకరు పరోక్ష విమర్శలు చేసుకుంటూ, గ్రూపులుగా కొనసాగుతున్న బీఆర్ఎస్ పార్టీలో […]

  • Publish Date - February 16, 2023 / 08:28 AM IST
  • విభేదాలు వీడి నేతలు కలిసిపోయారా?
  • కేసీఆర్ జన్మదిన వేడుకల్లో ‘ఐక్య ప్రదర్శన’
  • ప్రారంభానికి హాజరైన మేయర్ సుధారాణి
  • ఎగ్జిబిషన్ సందర్శించిన పసునూరి, బసవరాజు, మెట్టు
  • గులాబీ పార్టీ వర్గాల్లో గుసగుసలు
  • ఎన్నికల ఎత్తుగడల్లో ఎవరికి వారే

విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: వరంగల్ తూర్పు నియోజకవర్గం గులాబీ లీడర్ల మధ్య సఖ్యత నెలకొన్నదా? అనే చర్చ సాగుతుంది. ఎంత కాలం ఉప్పూ నిప్పుగా ఉంటూ ఒకరిపై ఒకరు పరోక్ష విమర్శలు చేసుకుంటూ, గ్రూపులుగా కొనసాగుతున్న బీఆర్ఎస్ పార్టీలో హఠాత్తుగా మార్పు వచ్చిందా? అని అనుమానాలూ తలెత్తుతున్నాయి.

ఎందుకంటే తాజాగా ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ పార్టీ వ్యవస్థాపకులు కేసీఆర్ పుట్టినరోజు వేడుకలు ఈ నాయకుల మధ్య ఐక్యతకు దారి తీశాయా? విభేదాలను పక్కకు పెట్టి కలిసిపోయారా? అనే చర్చ పార్టీ కేడర్లో సాగుతోంది. అదే సందర్భంలో ఈ ఐక్యత కార్యక్రమం రానున్న కాలంలో కూడా కొనసాగుతుందో? లేదోననే అనుమానాలు లేకపోలేదు. అయితే పార్టీ అధిష్టానం ఈ నాయకులకు అంతర్గతంగా ఏదైనా దిశా నిర్దేశం ఏమైనా చేసిందా? లేదా? రానున్న ఎన్నికల అవసరార్థం మేరకు ఈ ఆహ్వానాలు… ఐక్యతా రాగాలు కనిపిస్తున్నాయా? అనే ఆసక్తి కూడా నెలకొంది.

  • నాయకులను కలిపిన జన్మదిన వేడుకలు

వరంగల్ తూర్పు కేంద్రంగా ఓ సిటీలో స్థానిక ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్ జన్మదినోత్సవ వేడుకలను అట్టహాసంగా మూడు రోజులపాటు నిర్వహించేందుకు ఏర్పాటు చేశారు. ఈ మేరకు బుధవారం ఈ వేడుకలను రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రారంభించారు. ఎమ్మెల్సీ, మాజీ స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి, జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి, వరంగల్ జడ్పీ చైర్ పర్సన్ గండ్ర జ్యోతి తోపాటు మేయర్ గుండు సుధారాణి ప్రారంభ కార్యక్రమానికి హాజరయ్యారు.

కాగా.. వరంగల్ జిల్లా పార్టీ అధ్యక్షుడిగా కొనసాగుతున్న వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేష్ హాజరు కాకపోవడం పార్టీ వర్గాల్లో చర్చకు దారి తీసింది.తూర్పు నియోజకవర్గంలో పార్టీ కార్యక్రమంగా సీఎం జన్మదిన వేడుకలు చేపట్టి ఈ కార్యక్రమానికి మేయర్ సుధారాణి పిలవడం, ఆమె హాజరు కావడం గులాబీ వర్గాల్లో గుసగుసలకు దారి తీసింది.

  • తూర్పులో మేయర్‌కు నో ఎంట్రీ

సుధారాణి మేయర్‌గా ఉన్నప్పటికీ తూర్పు నియోజకవర్గంలో పర్యటించాలన్నా.. ప్రారంభ కార్యక్రమాల్లో భాగస్వామ్యం కావాలన్నా… అంతర్గతంగా అడ్డంకులు సృష్టిస్తున్నది ఎమ్మెల్యే నరేందర్ అనేది బహిరంగ సత్యం. ఇరువురికి ఒకరంటే ఒకరికి గిట్టని పరిస్థితి నెలకొందనేది అందరికీ తెలిసిన విషయమే. పరోక్షంగా ఒకరిపై ఒకరు విమర్శలు కూడా చేసుకుంటున్న సందర్భాలు ఇప్పటికీ ఉన్నాయి. ఈ నేపథ్యంలో మొన్న ఉర్సు దర్గా ఉత్సవాల ఏర్పాట్లను మేయర్ పరిశీలించడం, బస్తి దవాఖానాల ప్రారంభ కార్యక్రమం గురించి ఇరువురు కలెక్టర్ సమక్షంలో మాట్లాడుకోవడం ఆసక్తి రేకించే అంశాలు. తాజాగా కేసీఆర్ జన్మదిన వేడుకలకు హాజరు కావడం మరో విశేషం.

  • ఇరుకున పడుతున్న కేడర్, కార్పొరేటర్లు

పరస్పర అధిపత్యంలో అభివృద్ధి కార్యక్రమాలకు అడ్డంకిగా మారుతున్నాయి. కొన్ని సందర్భాలలో కార్పొరేటర్లు కూడా అటు మేయర్ ఇటు ఎమ్మెల్యేల మధ్య అవస్థలు పడుతున్నారనేది అందరికీ తెలిసిన విషయమే. ఈ నేపథ్యంలో తన నియోజకవర్గంలో చేపట్టిన కార్యక్రమానికి మేయర్ హాజరు కావడం ఎమ్మెల్యే అనుచరుల్లోనే చర్చకు దారి తీసింది.

  • ఎగ్జిబిషన్ సందర్శించిన పసునూరి, బసవరాజ్, మెట్టు

ఇదిలా ఉండగా ప్రారంభ కార్యక్రమానికి హాజరు కాలేకపోయినా ఎగ్జిబిషన్ సందర్శనకు వరంగల్ ఎంపీ పసునూరి దయాకర్, మాజీమంత్రి, ఎమ్మెల్సీ బస్వరాజ్ సారయ్య, రోడ్డు, భవనాల అభివృద్ధి కమిటీ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు శ్రీనివాసు హాజరు కావడం మరింత ఆసక్తిని కల్పించింది. బసవరాజ్ సారయ్య, మెట్టు శ్రీనివాసు సైతం ఎమ్మెల్యే నరేందర్ వ్యతిరేక వర్గంగా ప్రస్తుతం గుర్తింపు పొందారు. ఈ నాయకులన్నా… వీరి కార్యక్రమాలున్నా గులాబీ శ్రేణులు దూరంగా ఉండాలని ఎమ్మెల్యే అంతర్గతంగా ఆదేశాలు జారీ చేసినట్లు ఆ పార్టీ వర్గాలు బహిరంగంగానే చెప్పుకుంటాయి. ఈ నేపథ్యంలో వారిరువురు కూడా ఈ ఉత్సవాలతో హాజరు కావడం గమనార్హం.

  • ఎమ్మెల్యే వ్యతిరేకవర్గంగా ముద్ర

ఎమ్మెల్యే నరేందర్ కి వ్యతిరేకంగా సుధారాణి, సారయ్య, మెట్టు శ్రీనివాస్ తో పాటు మరి కొంతమంది నాయకులు వేరే గ్రూపుగా కొనసాగుతున్నారు. ఈ గ్రూపులో ఇంతకాలం భాగస్వామిగా ఉన్న ఎర్రబెల్లి ప్రదీప్ రావు కమలం గూటికి చేరిన విషయం తెలిసిందే. ఈ స్థితిలో కేసీఆర్ జన్మదినోత్సవ వేడుకల సందర్భంగా ఒకరంటే ఒకరికి పడని నాయకులు హాజరై ఉత్సవాల్లో భాగస్వామ్యం కావడం విశేషం.

  • ఎన్నికల నేపథ్యంలో ఈ సయోధ్య?

రానున్న ఎన్నికల నేపథ్యంలో ఎవరికి వారు తూర్పులో టికెట్ కోసం ప్రయత్నిస్తున్నారనే చర్చ ఒకవైపు ఉంది. ఈ నేపథ్యంలో కలిసి ఉన్నట్లు బయటికి కనిపిస్తూనే తమ ప్రయత్నాలు ముమ్మరం చేసుకోవాలనే ఆలోచనతో ఎవరికి వారు ఉన్నట్లు వారి అనుచర వర్గాల్లో చర్చ సాగుతుంది. ఇదే సమయంలో మేమంతా కలిసి ఉన్నాం నాకు వ్యతిరేకులు ఎవరూ లేరు అంటూ చూపెట్టుకునేందుకు ఎమ్మెల్యే నన్నపనేని ప్రయత్నిస్తున్నట్లు మరో వాదన ఉంది.

ఈ కారణంగానే ఇటీవల బహిరంగంగా కలిసి ఉంటూ అంతర్గతంగా తన బలము అనుచర వర్గాన్ని కాపాడుకునే ప్రయత్నాలు చేస్తున్నారనేది ఒక అభిప్రాయం. ఇదిలా ఉండగా ఈ ఐక్యత ఎంత కాలం కొనసాగుతుందో? చూడాలంటూ పార్టీలోని మరో వర్గం వ్యాఖ్యానిస్తుంది. పైకి కలిసున్నట్లు కనిపిస్తున్న లోపల ఎవరికి వారే అన్నట్టు వ్యవహ రిస్తున్నారని అనుమానాలు ఒకవైపు వ్యక్తం అవుతున్నాయి. ఈ ఐక్యత రాగం వేదికలకే పరిమితం తప్ప… ఆ తర్వాత ఎవరి వర్గం వారిదే అన్నట్లు కొనసాగుతుందని అభిప్రాయాలు సైతం బాహాటంగానే వ్యక్తమవుతున్నాయి.