విధాత: నేడు రీమేకులు చేయడం అనేది జూదంతో సమానంగా మారింది. ఒకనాడు ఒక భాషలో విడుదలైన సూపర్ హిట్ చిత్రాలను వివిధ భాషల్లో రీమేక్ చేసేవారు. అలా రీమేక్‌లుగా రూపొందిన ఎన్నో చిత్రాలు ఇండస్ట్రీ హిట్లుగా కూడా నిలిచాయి.
దానికి చంటి, పెదరాయుడు, ఠాగూర్ వంటి చిత్రాలే ఉదాహరణ. కానీ నేడు ఓటీటీలు, సోషల్ మీడియా పుణ్యమా అని సినిమా అనౌన్స్ అయిన వెంటనే ఆయా చిత్రాలను వాటి ఒరిజినల్ భాషలోని వెర్షన్‌లను ప్రేక్షకులు చూసేస్తున్నారు.
చిరంజీవి ఇంతకుముందు తమిళంలో ‘రమణ’ చిత్రంగా వచ్చిన తమిళ చిత్రాన్ని వివి వినాయక్ దర్శకత్వంలో ‘ఠాగూర్’గా రీమేక్ చేశాడు. నాడు ఓటిటి లు, సోషల్ మీడియా ఇంత విస్తృతంగా లేవు. దాంతో ఆ చిత్రం ఘన విజయం సాధించింది.
ఇక చిరు రీ ఎంట్రీ ఫిలింగా చేసిన ‘ఖైదీ నెంబర్ 150’కి కూడా వివి వినాయకే దర్శకుడు. ఈ చిత్రం కూడా కోలీవుడ్‌లో విజయం సాధించిన కత్తికి రీమేకే అనే సంగతి తెలిసిందే. ఇక ఇటీవల చిరంజీవి మలయాళంలో వచ్చిన ‘లూసిఫర్’ చిత్రాన్ని తెలుగులో ‘గాడ్‌ఫాదర్’గా తీశాడు.
ఈ చిత్రానికి పాజిటివ్ రివ్యూలు వచ్చినా కూడా కమర్షియల్‌గా పెద్దగా విజయం సాధించలేకపోయింది. దానికి కారణం ‘లూసిఫర్’ తెలుగు వెర్షన్ ఆల్రెడీ అమెజాన్ ప్రైమ్‌లో ఉండటమే. వీరాభిమానులు తప్ప సామాన్య ప్రేక్షకులు అందరూ గాడ్‌ఫాదర్‌ను ముందుగానే లూసిఫర్‌గా ఓటీటీలో చూసేశారు. దాంతో వారు థియేటర్లకు వెళ్లి ‘గాడ్‌ఫాదర్’ను వీక్షించలేదు.
ఇలాంటి సమయంలో చిరు ఒరిజినల్ కంటెంట్‌తో స్ట్రయిట్ ఫిల్మ్‌గా ‘వాల్తేరు వీరయ్య’ చిత్రం చేశాడు. పక్కా మాస్ యాక్షన్ ఎంటర్‌టైన్ చిత్రమైనప్పటికీ స్ట్రయిట్ చిత్రం కావడంతో ఈ చిత్రం ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటూ బాక్సాఫీస్ వద్ద రికార్డులను క్రియేట్ చేస్తూ ఉంది.
ఇక మెగాస్టార్ తన తదుపరి చిత్రాన్ని మరో రీమేక్‌గా చేయనున్న సంగతి తెలిసిందే. తమిళంలో అజిత్ నటించిన ‘వేదాళం’ చిత్రాన్ని మెహర్ రమేష్‌తో కలిసి ‘భోళాశంకర్’గా తీస్తున్నాడు. ఇలా రీమేకులు చేయవద్దని చిరుని ఆయన అభిమానులు వేడుకుంటున్నారు.
అయినా చిరు వాటిని లెక్కపెట్టకుండా వేదాళం రీమేకును ‘భోళాశంకర్’గా ఆల్రెడీ సెట్స్ పైకి తీసుకుని వెళ్ళాడు. తాజాగా మెగాస్టార్ చిరంజీవి కోలీవుడ్ అజిత్ నటించిన మరో చిత్రం ‘విశ్వాసం’ను కూడా తెలుగులోకి రీమేక్ చేస్తున్నాడనే వార్తలు హల్చల్ చేస్తున్నాయి.
తమిళంలో విజయం సాధించిన విశ్వాసం చిత్రాన్ని చిరు వినాయక్‌తో కలిసి రీమేక్ చేస్తున్నాడని ఆ వార్తల సారాంశం. అయితే ‘విశ్వాసం’ తెలుగులో కూడా డబ్ అయింది. మళ్లీ దానిని రీమేక్ అంటే.. మెగా ఫ్యాన్స్ అస్సలు తట్టుకోలేక పోతున్నారు. దీంతో ఈ సినిమాను ఆపేయమని సోషల్ మీడియాలో చిరంజీవిని ట్యాగ్ చేస్తూ బతిమలాడుతున్నారు.
అయితే ఈ రీమేక్ విషయమై మెగా వర్గాలు స్పందించాయి. వినిపిస్తున్న వార్తలో ఎలాంటి నిజం లేదని, పనికిమాలిన రూమర్స్ నమ్మవద్దని చిరంజీవి సన్నిహిత వర్గాలు అభిమానులకు క్లారిటీ ఇచ్చాయి. దీంతో ఆందోళన పడిన మెగాఫ్యాన్స్ కాస్త శాంతించారనే చెప్పాలి.