CI Anju Yadav
విధాత: ఆమధ్య ధర్నా చేస్తున్న జనసేన కార్యకర్త సాయి మీద చేయిచేసుకున్న కాళహస్తి సీఐ అంజూ యాదవ్ అంశాన్ని అటు జనసేన ఇటు వైసిపి రెండూ తమకు అనుకూలంగా మలచుకుంటున్నారు. తమ కార్యకర్తను కొట్టిన సీఐ మీద చర్యలు తీసుకోవాలని కోరుతూ పవన్ కళ్యాణ్ తిరుపతి ఎస్పీ పరమేశ్వర రెడ్డికి వినతిపత్రం ఇచ్చారు..
ఈ సందర్భముగా అయన భారీ ర్యాలీగా అక్కడికి వెళ్లారు. తమ కార్యకర్తను కొట్టిన సీఐ మీద చర్యలకు జనసేన డిమాండ్ చేస్తోంది. అయితే దీనికి ఇటు ప్రభుత్వం నుంచి ఏమంటున్నారంటే ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి దిష్టిబొమ్మ దగ్ధం చేస్తూ… అది కూడా రావణుడి మాదిరిగా పది తలలతో కూడిన దిష్టిబొమ్మను తగులబెడుతూ తలమీద కాళ్ళు వేసి తొక్కుతున్న కార్యకర్తలను చెదరగొట్టేందుకు అంజూ యాదవ్ ప్రయత్నించారు.
ఈ తరుణంలో జనసేన కార్యకర్తలు నియంత్రణ కోల్పోయి పోలీసుల మీదకే దాడి చేసే పరిస్థితి నెలకొంది. ఇక వేరేమార్గం లేక పరిస్థితి అదుపు చేసే క్రమంలో ఆమె ఒక చెంపదెబ్బ కొట్టారు. ఒక బీసీ మహిళా పోలీస్ ఇలా తమ మీద అధికారం చూపడాన్ని సహించలేని పవన్ కళ్యాణ్ ఇలా ఆమె మీద రాజకీయ దాడి చేస్తున్నారని ఇటు యాదవ వర్గాలను వైసిపి గిల్లింది. దీంతో ఇది కాస్తా ప్రభుత్వం, జనసేన అనే దారి నుంచి జనసేన వర్సెస్ బీసీ అనే బాటలోకి వెళ్ళింది.
కేవలం బీసీ యాదవ కులానికి చెందిన సిన్సియర్ పోలీస్ అధికారి అనే దుగ్ధతోనే పవన్ కళ్యాణ్ ఆమెను టార్గెట్ చేస్తున్నారని ప్రభుత్వం చెప్పినట్లుగా వింటున్న యాదవ సంఘాలు విమర్శిస్తున్నాయి. తాము పవన్ కు బుద్ధి చెబుతామని అంటున్నారు.
ఇదిలా ఉండగా ఆమె గతంలో అటు వైసిపి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి కుమార్తె పవిత్రను సైతం రోడ్డుమీద నిలబెట్టి ప్రశ్నించారని, వైసిపి ఎంపిపి, ఇంకా టిడిపి నాయకుల విషయంలోనూ ఆమె దూకుడుగా వెళ్లిన చరిత్ర ఉంది. మొత్తానికి ఆమె వ్యవహారాన్ని జనసేన ఒక కోణంలో చూస్తుండగా వైసిపి నాయకులు మాత్రం దాన్ని కులానికి ఆపాదించి జనసేన మీద ఎదురుదాడి చేస్తున్నారు.