CM Jagan
విధాత: ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తరచూ వినిపిస్తున్న మాట ముందస్తు ఎన్నికలు. అంటే జగన్ మోహన్ రెడ్డి షెడ్యూల్ కు ముందే అంటే 2024 ఏప్రిల్ మే నెలల్లో జరగాల్సిన ఎన్నికలు ముందుకు జరుపుతున్నారని, తెలంగాణతో బాటు ఈ ఏడాది చివర్లో ఎన్నికలకు వెళ్తారని, ఆ తరువాత లోక్ సభ ఎన్నికలకు షెడ్యూల్ ప్రకారం వెళ్తారని రూమర్లు వెల్లువెత్తాయి.
దీనికి టిడిపి అధినేత చంద్రబాబు సైతం మినహాయింపు కాదు. ఆయన సైతం పలుమార్లు పార్టీ సమావేశాల్లో నాయకులూ, కార్యకర్తలతో మాట్లాడుతూ ఎన్నికలు ఏ క్షణమైనా రావచ్చని, జగన్ తో పోరాటానికి సిద్ధంగా ఉండాలని చెబుతూ దానికి సపోర్టింగ్ కోసం ఇంకో వాదన కూడా తెస్తూ వస్తున్నారు.
ఇప్పటికే జగన్ మీద ప్రజల్లో గట్టి వ్యతిరేకత ఉందని, దాన్ని అడ్డుకునేందుకు, అదింకా ముదిరి ఎన్నికల్లో తనను ముంచేసే ప్రమాదం ఉందని భయపడిన జగన్ ఆర్నెల్లు ముందుగానే ఎన్నికలకు వెళ్తున్నారని చంద్రబాబు చెబుతూ వస్తున్నారు. ఇప్పటికే నిస్త్రాణంగా ఉన్న తన పార్టీ క్యాడర్ ను ఎన్నికలకు రెడీ చేసే ఉద్దేశంలో అన్నారో, ఇంకే కారణంతో అన్నారో కానీ చంద్రబాబు మాత్రం ముందస్తు.. ముందస్తు అంటూ వస్తున్నారు.
అయితే జగన్ మాత్రం నిన్నటి కేబినెట్ భేటీలో జగన్ రూమర్లను కొట్టి పారేసారు. షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు ఉంటాయి అని.. అంటే దాదాపు ఇంకో తొమ్మిది నెలల్లో ఎన్నికలు ఉన్నాయ్ అని, నాయకులు ప్రజల్లోకి వెళ్లి కష్టపడాలని, మిగతాది అంతా తానూ చూసుకుంటాను అని జగన్ హామీ ఇచ్చారు.
అంతేకాకుండా ముందస్తు ఎన్నికలు అనే భావన లేకుండా మొత్తం క్లియర్ గా చెప్పేసారు. దీంతో ఇక అలాంటి అనుమానాలు., అపోహలు పెట్టుకోకుండా ఇంకో తొమ్మిది నెలలు వెయిట్ చేయాల్సిందేనని టిడిపి కార్యకర్తలు అంటున్నారు. మరోవైపు జగన్ ఇప్పుడున్న వ్యతిరేకతను తగ్గించుకునేందుకు ఒక్కో పని క్లియర్ చేస్తూ వెళ్తున్నారు.
మొన్నటికి మొన్న మున్సిపాలిటీల్లో చేసిన పనులకు బిల్లులు క్లియర్ చేసిన జగన్ ఇప్పుడు గ్రామాల్లో మండలాల్లో చేపట్టిన పనులకు సంబంధించిన బిల్స్ చెల్లింపు మీద దృష్టి పెట్టారు. ఇలా మెల్లగా వ్యతిరేకతను న్యూట్రలైజ్ చేస్తూ ఎన్నికలకు వెళ్తున్న జగన్ కాన్ఫిడెన్స్ మీద ఉన్నారు. అటు టిడిపి సైతం ప్రభుత్వ వ్యతిరేకత తమకు లాభిస్తుందని ఆశతో ముందుకు సాగుతోంది.