CM KCR | కేసీఆర్‌ సారు.. హామీల జోరు

CM KCR హ్యాట్రిక్‌ విజయం కోసం కొత్త ఎత్తుగడలు కాంగ్రెస్‌ మ్యానిఫెస్టో అంశాలపైనా ప్రకటనలు హైజాక్‌ చేశారంటున్న కాంగ్రెస్‌ నాయకులు అది తమ విజయమేనంటూ జనంలో ప్రచారం విధాత, హైదరాబాద్‌: రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో హ్యాట్రిక్ విజయసాధనకు అధికార బిఆరెస్ పార్టీ అధినేత సీఎం కేసీఆర్ ఒకవైపు, స్వరాష్ట్రంలో రానున్న మూడో అసెంబ్లీ ఎన్నికల్లోనైనా గెలువాలన్న లక్ష్యంతో కాంగ్రెస్ ఇంకోవైపు సాగిస్తున్న రాజకీయ పోరాటంలో ఎన్నికల హామీలు ప్రధానాంశంగా మారిపోయాయి. అయితే ప్రతిపక్ష కాంగ్రెస్ ఎన్నికల మ్యానిఫెస్టోను […]

CM KCR | కేసీఆర్‌ సారు.. హామీల జోరు

CM KCR

  • హ్యాట్రిక్‌ విజయం కోసం కొత్త ఎత్తుగడలు
  • కాంగ్రెస్‌ మ్యానిఫెస్టో అంశాలపైనా ప్రకటనలు
  • హైజాక్‌ చేశారంటున్న కాంగ్రెస్‌ నాయకులు
  • అది తమ విజయమేనంటూ జనంలో ప్రచారం

విధాత, హైదరాబాద్‌: రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో హ్యాట్రిక్ విజయసాధనకు అధికార బిఆరెస్ పార్టీ అధినేత సీఎం కేసీఆర్ ఒకవైపు, స్వరాష్ట్రంలో రానున్న మూడో అసెంబ్లీ ఎన్నికల్లోనైనా గెలువాలన్న లక్ష్యంతో కాంగ్రెస్ ఇంకోవైపు సాగిస్తున్న రాజకీయ పోరాటంలో ఎన్నికల హామీలు ప్రధానాంశంగా మారిపోయాయి. అయితే ప్రతిపక్ష కాంగ్రెస్ ఎన్నికల మ్యానిఫెస్టోను హైజాక్ చేసే రీతిలో గులాబీ బాస్ కేసీఆర్ తాజాగా తీసుకున్న నిర్ణయాలు ఉండటం రాజకీయ వర్గాలను సైతం ఆశ్చర్యపరుస్తున్నది.

నిన్నటిదాకా ‘తెలంగాణ ఆచరిస్తుంది.. దేశం అనుసరిస్తుందంటూ’ పదేళ్లుగా అమలు చేసిన సంక్షేమ పథకాల గురించి గొప్పగా చెప్పుకొన్న కేసీఆర్.. ఇప్పుడు అనూహ్యంగా గేరు మార్చి కాంగ్రెస్ పథకాల వెంట పడ్డారన్న చర్చ నడుస్తున్నది. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఏంచేసేదీ చెబుతూ ఆ పార్టీ విడుదల చేసిన మ్యానిఫెస్టో హామీలను సీఎంగా తనకున్న అధికారాలతో ముందే అమలు చేయడానికి సిద్ధపడటం ఆసక్తి రేపుతున్నది.

ఇంతకాలం బీఆరెస్‌ పెండింగ్‌లో ఉంచిన అంశాలే కాంగ్రెస్‌ మ్యానిఫెస్టోలో ప్రధానాంశాలుగా ఉన్న నేపథ్యంలో వాటిని పదవీకాలం ముగిసేలోపే పూర్తి చేసే యోచనలో కేసీఆర్‌ ఉన్నారని తెలుస్తున్నది. ఈ జాబితాలో వీఆర్ఏల క్రమబద్ధీకరణ, దివ్యాంగుల పింఛన్ పెంపు, ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం, మెట్రో పొడిగింపు, ఆరోగ్యశ్రీ పెంపు, బీసీ, మైనార్టీలకు సహాయం వంటి అంశాలు కాంగ్రెస్ మ్యానిఫెస్టో స్ఫూర్తితోనే కేసీఆర్ అమలు చేశారన్న విమర్శలు రేగాయి.

అలాగే కేసీఆర్ ఎప్పుడో ప్రకటించిన సొంతింటి స్థలం ఉంటే ఐదు లక్షల పథకాన్ని మూడు లక్షలకు కుదించి గృహలక్ష్మి పథకంగా బీఆరెస్ ప్రభుత్వం ఇటీవల అమల్లోకి తెచ్చింది. టెట్‌పై కూడా తాజాగా కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి సీఎం కేసీఆర్‌కు లేఖ రాయడం, బీఆరెస్ ఇవ్వకపోతే కాంగ్రెస్ అధికారంలో రాగానే నెల రోజుల్లోనే టెట్ నోటిఫికేషన్ విడుదల చేస్తామని చెప్పడం జరిగింది.

దీంతో కేసీఆర్ ప్రభుత్వం టెట్ నోటిఫికేషన్ కూడా విడుదల చేసేసింది. ఇలా కాంగ్రెస్ ఒక్కో డిక్లరేషన్ చేస్తుంటే.. సీఎం కేసీఆర్ ఆ డిక్లరేషన్‌ల స్ఫూర్తితో కొత్త పథకాలు, పెండింగ్ హామీలు అమలు చేస్తూ వెళ్తున్నారు. దీంతో తమ ఎన్నికల మ్యానిఫెస్టోను కేసీఆర్ హైజాక్ చేస్తున్నారని కాంగ్రెస్ నాయకులు గగ్గోలు పెడుతూ తమ రాజకీయ ప్రచార వ్యూహాన్ని మరో మలుపు తిప్పేశారు.

కాంగ్రెస్ విజయమేనంటూ కొత్త ప్రచార వ్యూహం

కాంగ్రెస్ ఇస్తున్న ఎన్నికల హామీలను ఎన్నికలకు ముందే సీఎం కేసీఆర్ అమలు చేస్తుండటం నిస్సందేహంగా తమ పార్టీ విజయమేనని సీఎల్పీ నేత భట్టి, పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, ప్రచార కమిటీ కన్వీనర్ మధుయాష్కి జనంలో తమ ప్రచారం మొదలుపెట్టారు. తద్వారా కాంగ్రెస్ పథకాలను జనానికి గుర్తు చేసే ప్రయత్నాలు చేస్తున్నారు.

ఇప్పటికే తాము బీసీ డిక్లరేషన్ చేస్తాం అనగానే కేసీఆర్ బీసీ,మైనార్టీలకు లక్ష సాయం ప్రకటించారని, కాంగ్రెస్ అధికారంలోకి వస్తే పోడు పట్టాలిస్తామంటే ఇన్నాళ్లుగా ఇవ్వని పోడుపట్టాలను కేసీఆర్ ప్రభుత్వం ఇటీవల పంపిణీ చేసిందని చెబుతున్న కాంగ్రెస్‌ నాయకులు.. అవన్నీ తమ పార్టీ విజయాలని చెబుతున్నారు.

భవిష్యత్తు ప్రకటనలపైనా గురి?

వరుసగా తమ ఎన్నికల హామీల వెంట పరుగెడుతున్న సీఎం కేసీఆర్ మునుముందు తాము ప్రకటించే పథకాలకు కూడా ఎసరు పెడతారని కాంగ్రెస్ వర్గాలు కలవర పడుతున్నాయి. ఈ నేపథ్యంలో తాము భవిష్యత్తులో ప్రకటించాల్సిన బీసీ, మహిళా డిక్లరేషన్లను కూడా కేసీఆర్ ఎక్కడ హైజాక్ చేస్తారోనన్న బెంగ కాంగ్రెస్ నేతలను పీడిస్తున్నది.

అసెంబ్లీ వేదికగా ‘బ్రహ్మాస్త్ర’ పథకాలు

మూడోసారి అధికార సాధన దిశగా ఎంత దాకైనా అన్నట్లుగా దూసుకెళ్తున్న సీఎం కేసీఆర్ రానున్న అసెంబ్లీ సమావేశాల్లో కాంగ్రెస్ పార్టీ సహా విపక్షాలకు మరింత ఝలక్ ఇచ్చే రీతిలో తన మదిలోని బ్రహ్మాస్త్రం వంటి పథకాలను ప్రకటించవచ్చని గులాబీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ముఖ్యంగా లక్ష రూపాయల రైతు రుణమాఫీకి సంబంధించి ప్రకటన చేయవచ్చని, అలాగే మహిళలు, ఉద్యోగ వర్గాలకు కూడా వరాలు కురిపించవచ్చని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు