CM KCR | గవర్నర్ కోటా ఎమ్మెల్సీల భర్తీపై KCR ఫోకస్! తెరపైకి మోత్కుపల్లి పేరు!

CM KCR ఈ నెలలో రెండు సీట్ల ఖాళీ.. మోత్కుపల్లికి ఛాన్స్.! విధాత: తెలంగాణ శాసనమండలిలో ఈనెల 27వ తేదీతో ఖాళీకాబోతున్న రెండు ఎమ్మెల్సీ స్థానాల భర్తీకి సీఎం కేసీఆర్ కసరత్తు ప్రారంభించినట్లు తెలుస్తోంది. పదవీకాలం ముగిసి పోనుండడంతో క్రిస్టియన్ మైనారిటీ డి. రాజేశ్వరరావు, ముస్లిం మైనారిటీ ఫారుక్ హుస్సేన్‌ల ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ కాబోతున్నాయి. కాగా.. ఇప్పటికే మూడుసార్లు వారు ఎమ్మెల్సీలుగా వ్యవహరించి ఉన్నందున ఈ దఫా కొత్త వారికి సీఎం కేసీఆర్ అవకాశం కల్పిస్తారని, […]

CM KCR | గవర్నర్ కోటా ఎమ్మెల్సీల భర్తీపై KCR ఫోకస్! తెరపైకి మోత్కుపల్లి పేరు!

CM KCR

  • ఈ నెలలో రెండు సీట్ల ఖాళీ.. మోత్కుపల్లికి ఛాన్స్.!

విధాత: తెలంగాణ శాసనమండలిలో ఈనెల 27వ తేదీతో ఖాళీకాబోతున్న రెండు ఎమ్మెల్సీ స్థానాల భర్తీకి సీఎం కేసీఆర్ కసరత్తు ప్రారంభించినట్లు తెలుస్తోంది. పదవీకాలం ముగిసి పోనుండడంతో క్రిస్టియన్ మైనారిటీ డి. రాజేశ్వరరావు, ముస్లిం మైనారిటీ ఫారుక్ హుస్సేన్‌ల ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ కాబోతున్నాయి.

కాగా.. ఇప్పటికే మూడుసార్లు వారు ఎమ్మెల్సీలుగా వ్యవహరించి ఉన్నందున ఈ దఫా కొత్త వారికి సీఎం కేసీఆర్ అవకాశం కల్పిస్తారని, లేక వారిలో ఒకరి సభ్యత్వాన్ని రెన్యువల్ చేస్తారని సమాచారం కూడా వినిపిస్తుంది. సీఎం కేసీఆర్ ఢిల్లీ పర్యటన పిదప గవర్నర్ కోటా ఎమ్మెల్సీల పేర్లను ఖరారు చేస్తారని ఇందుకోసం ఇప్పటికే పలువురి పేర్లను సీఎం కేసీఆర్ పరిశీలించి వడపోత ప్రక్రియ ముగించారని గులాబీ వర్గాల్లో ప్రచారం సాగుతుంది.

తెరపైకి మోత్కుపల్లి పేరు

ప్రధానంగా ఈ దఫా ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన మాజీ మంత్రి మోత్కుపల్లి నరసింహులు పేరు గవర్నర్ కోట ఎమ్మెల్సీ ప్రముఖంగా వినిపిస్తుంది. మోత్కుపల్లి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి రెండు సార్లు ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా, మూడు సార్లు TDP ఎమ్మెల్యేగా, ఒక పర్యాయం కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించారు. ఐదు పర్యాయాలు ఆలేరు ఎస్సీ రిజర్వుడు స్థానం నుంచి, ఒక పర్యాయం తుంగతుర్తి రిజర్వుడ్ స్థానం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. మధిర నుంచి ఓడిపోయారు.

దివంగత ఎన్టీఆర్ ప్రభుత్వ హయాంలో విద్యుత్, టూరిజం, సాంఘిక సంక్షేమం, గనుల శాఖల మంత్రిగా పనిచేశారు. రాజ్యసభ సభ్యత్వం, గవర్నర్ పదవి విషయంలో చంద్రబాబుతో నెలకొన్న విభేదాల నేపథ్యంలో 2018 మే 28న TDP నుంచి సస్పెండ్ గురయ్యారు. 2019 నవంబర్ 4న BJPలో చేరిన మోత్కుపల్లి 2021 జులై 23న ఆ పార్టీకి రాజీనామా చేశారు. 2021 అక్టోబర్ 18న సీఎం కేసీఆర్ సమక్షంలో BRSలో చేరారు.

రైతుబంధు రాష్ట్ర కమిటీ చైర్మన్ గా మోత్కుపల్లిని నియమిస్తారని భావించినప్పటికీ ప్రత్యేక కమిటీ ఏర్పాటు లేకపోవడంతో, ఎమ్మెల్సీగా ఆయన పేరు తరచూ పరిశీలనలోకి వచ్చింది. గతంలో టిడిపిలో ఉన్నప్పుడు మోత్కుపల్లి తో సీఎం కేసీఆర్ కు ఉన్న అనుబంధంతోపాటు రాష్ట్ర రాజకీయాల్లో దళిత వర్గాలను ఆకట్టుకునేందుకు, విపక్షాల రాజకీయ విమర్శలకు చెక్ పెట్టే దిశగా సీఎం కేసీఆర్ గవర్నర్ కోటా ఎమ్మెల్సీగా మోత్కుపల్లిని ఎంపిక చేయాలని భావిస్తున్నట్లుగా తెలుస్తుంది.

ఇదే సమయంలో బీసీ వర్గం నుంచి మోత్కుపల్లి ఆలేరు నియోజకవర్గంకే చెందిన బూడిద బిక్షమయ్య గౌడ్, అలాగే దాసోజు శ్రవణ్, టీఎస్పీఎస్సీ మాజీ చైర్మన్ గంట చక్రపాణి, విద్యార్థి కోటాలో డి. రాజారాం యాదవ్, తుంగ బాలు, చిరుమల రాకేష్ పేర్లను సైతం బిఆర్ఎస్ అధిష్టానం పరిశీలనలో ఉన్నట్లు ఆ పార్టీ వర్గాల్లో చర్చ సాగుతుంది.

రానున్న ఎన్నికల నేపథ్యంలో బిఆర్ఎస్ పార్టీ రాజకీయ ప్రయోజనాల అంశాలతో పాటు సామాజిక, రాజకీయ సమీకరణ అంశాలను కూడా పరిగణలోకి తీసుకొని ఎమ్మెల్సీ అభ్యర్థులను ఎంపిక చేసే అవకాశం ఉందని ఆ పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.

ముఖ్యంగా గతంలో పాడి కౌశిక్ రెడ్డి ఎంపిక వివాదం తరహా రచ్చ లేకుండా గవర్నర్ ఆమోదించదగ్గ పేర్లను గవర్నర్ కోటా ఎమ్మెల్సీ స్థానాలకు సీఎం కేసీఆర్ ఎంపిక చేయబోతున్నారని,చివరి దశలో మరిన్ని కొత్త పేర్లు పరిశీలనలోకి వచ్చే అవకాశం కూడా ఉందంటూ గులాబీ పార్టీలో ఆసక్తికరమైన ప్రచారం సాగుతుంది.