విధాత: తెలంగాణ సాయుధ పోరాటంలో చిట్యాల (చాకలి) ఐలమ్మ త్యాగాలు, పోరాట స్పూర్తితో ముందుకు సాగుదామని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు పిలుపునిచ్చారు. మంగళవారం రాష్ట్ర ప్రభుత్వం చిట్యాల ఐలమ్మ జయంతిని అధికారికంగా నిర్వహించింది. ఈసందర్భంగా ముఖ్యమంత్రి ఘన నివాళులర్పించారు. ఐలమ్మ ప్రదర్శించిన ధైర్య సాహసాలు, చైతన్యాన్ని స్మరించుకున్నారు.
నాటి కాలంలోనే, హక్కుల సాధన కోసం న్యాయస్థానాల్లో చట్టపరమైన పోరాటం చేసిన ప్రజాస్వామిక వాది, సబ్బండ వర్గాల ఆత్మగౌరవ ప్రతీక చిట్యాల ఐలమ్మ అని కొనియాడారు. అదే స్పూర్తితో తెలంగాణ సాధనలోనూ, అనంతర ప్రగతి ప్రస్థానంలోనూ ఇమిడి వున్నదని సీఎం తెలిపారు. చిట్యాల ఐలమ్మ త్యాగాలకు గుర్తుగా రాష్ట్ర ప్రభుత్వం జయంతి, వర్ధంతి కార్యక్రమాలను అధికారికంగా నిర్వహిస్తున్నదన్నారు.
మహిళా చైతన్యానికి ప్రతీక: మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి
తెలంగాణ సాయుధ పోరాటంలో బడుగు, బలహీన వర్గాల హక్కుల కోసం అలుపెరుగని పోరాటం చేసిన ఐలమ్మ మహిళా చైతన్యానికి ప్రతీక అని అటవీ, పర్యావరణ, న్యాయ, దేవదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి కొనియాడారు.
నిర్మల్ పట్టణంలోని చాకలి ఐలమ్మ విగ్రహానికి మంత్రి నివాళులర్పించారు. అంతకుముందు మంత్రి క్యాంప్ కార్యాలయం నుంచి పాత బస్టాండ్ చౌరస్తా వరకు నిర్వహించిన బైక్ ర్యాలీకి హాజరైన ఆయన మాట్లాడారు. తెలంగాణ ఉద్యమంలో రజకుల కృషి ఎనలేనిదని అన్నారు.
తెలంగాణ సమాజానికి స్పూర్తి: మంత్రి జగదీశ్ రెడ్డి
ఐలమ్మ సాహసమే తెలంగాణ సమాజానికి స్పూర్తి అని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్ రెడ్డి అన్నారు. సూర్యాపేట కలెక్టరేట్ లో ఐలమ్మ చిత్రపటానికి మంత్రి పూలమాలవేసి ఘన నివాళులర్పించారు. సైదా పోరాటంలో ఆమె చూపించిన తెగువ ప్రపంచంలోనే తెలంగాణకు గుర్తింపు తెచ్చిందని కొనియాడారు.
ఐలమ్మ స్ఫూర్తితోనే రాష్ట్రం లో కేసీఆర్ పాలన కొనసాగుతోందన్న మంత్రి, అమలు చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలు దేశంలో తెలంగాణను నంబర్ వన్ గా నిలబెట్టాయని తెలిపారు. కార్యక్రమంలో ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, కలెక్టర్ వెంకట్రావ్, అడిషనల్ కలెక్టర్ ప్రియాంక, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్ గౌడ్, మున్సిపల్ చైర్ పర్సన్ పెరుమాళ అన్నపూర్ణమ్మ, జడ్పీటీసీ జీడీ బిక్షం పాల్గొన్నారు.
సబ్బండ వర్గాల ఆత్మగౌరవ ప్రతీక ఐలమ్మ: చీఫ్ విప్ దాస్యం
సబ్బండ వర్గాల ఆత్మగౌరవ ప్రతీక చాకలి ఐలమ్మ అని రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ అన్నారు. పద్మాక్షి రోడ్డు వద్ద ఐలమ్మ జయంతి వేడుకలను జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.
ప్రభుత్వ చీఫ్ విప్ తో పాటు ఎంపీ పసునూరి దయాకర్, తూర్పు శాసనసభ్యులు నన్నపునేని నరేందర్, హనుమకొండ జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్, వరంగల్ కలెక్టర్ పీ ప్రావీణ్య, కుడా చైర్మన్ సుందర్ రాజ్ యాదవ్, కార్పొరేషన్ కమిషనర్ రిజ్వాన్ బాషా షేక్ కలిసి ఐలమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
వరంగల్ లో…
పోతన జంక్షన్ లో ఐలమ్మ చిత్రపటానికి రజక సెల్ కన్వీనర్ కొత్తపల్లి రాజేష్, బీజేపీ వరంగల్ తూర్పు నియోజకవర్గ నాయకులు గంట రవికుమార్ నివాళులు అర్పించారు. తెలంగాణ పర పీడన పాలన నుంచి విముక్తి కోసం వీరవనిత ఐలమ్మ చేపట్టిన సాయుధ పోరాటం చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందన్నారు.