Congress | మేమిచ్చాం.. మీరు లాక్కున్నారు: భట్టి

Congress ధరణి పేరుతో ఇచ్చిన పట్టాలు రద్దు చేశారు అసైన్డ్‌ భూములు బడా కంపెనీలకు ఇచ్చారు అసెంబ్లీలో సర్కారుపై ధ్వజమెత్తిన సీఎల్పీ నేత భట్టి విక్రమార్క విధాత: కాంగ్రెస్‌ పార్టీ దళితులు, గిరిజనులు ఆదివాసీలకు భూములు ఇచ్చి యజమానులను చేస్తే బీఆరెస్‌ సర్కారు వాటిని గుంజుకొన్నదని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క ధ్వజమెత్తారు. అసెంబ్లీలో తెలంగాణ సాధన- సాధించిన ప్రగతిపై భట్టి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధి గారికి ధన్యవాదాలు తెలిపారు. […]

  • Publish Date - August 6, 2023 / 01:24 AM IST

Congress

  • ధరణి పేరుతో ఇచ్చిన పట్టాలు రద్దు చేశారు
  • అసైన్డ్‌ భూములు బడా కంపెనీలకు ఇచ్చారు
  • అసెంబ్లీలో సర్కారుపై ధ్వజమెత్తిన సీఎల్పీ నేత భట్టి విక్రమార్క

విధాత: కాంగ్రెస్‌ పార్టీ దళితులు, గిరిజనులు ఆదివాసీలకు భూములు ఇచ్చి యజమానులను చేస్తే బీఆరెస్‌ సర్కారు వాటిని గుంజుకొన్నదని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క ధ్వజమెత్తారు. అసెంబ్లీలో తెలంగాణ సాధన- సాధించిన ప్రగతిపై భట్టి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధి గారికి ధన్యవాదాలు తెలిపారు. అందరి భాగాస్వామ్యంతో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందన్నారు.

ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తెలంగాణలో ప్రజల ఆశలు, ఆకాంక్షలు నెరవేరలేదన్నారు. చాలా సమస్యలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఆదిలాబాద్ నుంచి ఖమ్మం వరకూ ప్రతి పల్లెలో ఆదివాసీలు, దళితులు, గిరిజనులు, బడుగు బలహీన వర్గాల ప్రజలు ధరణికి సంబంధించిన సమస్యలను పాదయాత్రలో మా దృష్టికి తీసుకు వచ్చారన్నారు. ప్రశ్నిస్తే పోలీస్ కేసులు పెడ్తారన్న భయం నెలకొన్నదని, భావ వ్యక్తీకరణ లేదన్నారు. భయం లేనటువంటి స్వేచ్ఛయుత వాతావరణాన్ని ప్రభుత్వం తెలంగాణలో కల్పించాలన్నారు.

ట్రాక్టర్లతో తొక్కించి భూములు లాక్కున్నారు…

సోనియా గాంధీ పార్లమెంట్ సాక్షిగా తీసుకువచ్చిన ఫారెస్ట్ రైట్ యాక్ట్ చట్టం ద్వారా ఆదిలాబాద్ ఆదివాసీలకు పంపిణీ చేసిన భూములకు బీఆరెస్‌ ప్రభుత్వం తీసుకువచ్చిన ధరణి వల్ల భూమి హక్కులను కోల్పోయారన్నారు. ఆసిఫాబాద్ జిల్లా హ‌స్నాపూర్ మండలం దేవ‌గూడ గ్రామంలో మ‌రుపా గంగాబాయి, శ్రీరామ్ ల‌క్షీబాయి, మ‌రుప కోసు ప‌టేల్ మాతో మాట్లాడుతూ.. మాకు కాంగ్రెస్ ప్రభుత్వ హాయంలో పోడు భూములకు పట్టాలిచ్చారు.

కేసీఆర్ ప్రభుత్వం వచ్చాక..మా పంటలను ట్రాక్టర్లతో తొక్కించి భూములను లాక్కున్నారు. ధరణిలో మా భూములను ప్రభుత్వ భూములుగా చూపుతున్నారని చెప్పారన్నారు. కెరిమెరి మండలం బూసిమెట్ట క్యాంప్ లో సుమ‌ను బాయికి 4.32 గుంట‌లు, డాకూరే రుక్మిణి బాయి 3.31 గుంట‌ల భూమి, వాలే ల‌క్ష్మీ బాయి, సుశీలా బాయిలకు అట‌వీ హ‌క్కుల చ‌ట్టం ప్ర‌కారం కాంగ్రెస్ ప్ర‌భుత్వం భూములు ఇస్తే, ఈ ప్రభుత్వం వాటిని ప్రభుత్వ భూములని లాక్కుందన్నారు.

ఇదే మండలంలోని గోండుగూడెంలోనూ నాటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన పట్టా పాసు పుస్తకాలకు కొత్త పాసు పుస్తకాలు ఇవ్వకుండా,ఇది ప్రభుత్వ భూమని అధికారులు లాక్కున్నారన్నారు. మేమెలా బతకాలంటూ ఆ గిరిజనుల మావద్ద కన్నీళ్లతో మొరపెట్టుకున్నారన్నారు.

ధరణిలో మా పేరు లేకపోతే మేము బతికున్నా సచ్చినట్టే కదా అని వారు కన్నీటి పర్యంతమయ్యారు. పోడు భూములు సాగు చేసుకుంటున్న అడవి బిడ్డలకు వెంటనే కొత్త పాస్ పుస్తకాలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరుతున్నానన్నారు.

భూములు గుంజుకొని దళితులను పేదలుగా మార్చారు..

వెట్టి చాకిరి చేసుకునే దళితులు ఆత్మగౌరవంతో జీవించాలని నాటి కాంగ్రెస్ ప్రభుత్వాలు ఇచ్చినన్‌ అసైన్డ్‌ భూములను ప్రభుత్వ అవసరాల కోసం గుంజుకొని వారిని పేదలుగా మార్చడం సరికాదని భట్టి విక్రమార్క అన్నారు.

మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం పోలంపల్లి గ్రామంలో దొరల కింద వెట్టి చాకిరీ చేస్తున్న 44 మందికి నాటి ఇందిరమ్మ ప్రభుత్వం ఇండ్లు, భూములు ఇస్తే, ఈ ప్రభుత్వం ఆ భూములు, ఇండ్లను ధరణి పేరుతో మానుంచి గుంజుకుందని జంబిశెట్టి రాఘవులు తన వద్ద మొర పెట్టుకున్నారన్నారు.

పేదల నుంచి గుంజుకొని…

ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో ఫార్మా హబ్ పేరుతో 8 నుంచి 10 వేల ఎకరాలను పేదల నుంచి వెనక్కి తీసుకొని, ఫార్మాహబ్, మల్టీ నేషనల్ కంపెనీలకు విలువైన భూములు కేటాయించారని భట్టి ఆరోపించారు. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గంలోని చందనవెల్లి గ్రామంలో దళితులకు సంబంధించిన 1800 వందల ఎకరాల అసైన్డ్‌ భూములు బ‌ల‌వంతంగా గుంజుకొని ప్రపంచంలోనే

అత్యంత సంపన్న కంపెని అయిన అమెజాన్ వంటి బహుళ జాతి కంపెనీలకు కేటాయిస్తున్నారన్నారు. బలవంతంగా మా భూములు గుంజుకోవద్దని మా భూములు మాకు కావాలని ఆగ్రామ ప్రజలు పెద్ద ఎత్తున పోరాటం చేస్తున్నారని తెలిపారు. వారు ఆవేదనతో చేస్తున్న పోరాటం హృదయాలను కదిలిస్తున్నదని తెలిపారు.

చందనవెల్లి భూముల్లో ఒక్క ఎకరం కూడ తీసుకోవద్దని ప్రభుత్వాన్ని కోరారు. బుద్వేల్ అసైన్డ్‌ ల్యాండ్ 164.35 ఎకరాలు పేదల నుంచి తీసుకొని హెచ్ఎండిఏ, పర్యాటకశాఖకు బదలాయించారని, ఆ తరువాత అమ్మకానికి పెట్టారని భట్టి అన్నారు. ప్రజల చేతుల్లో భూములు ఉంటే ప్రజలు కోటీశ్వరులుగా ఉంటారని, ప్రభుత్వం తీసుకొంటే బీదలుగా మారుతారన్నారు. దయచేసి మానవత్వంలో ఆలోచన చేసి పేదల భూములు బలవంతంగా తీసుకోవద్దని మనవి చేస్తున్నానన్నారు.

హరితహారం, స్మశాన వాటిక, రైతు వేదిక, తదితర అవసరాల కోసం పేదలకు గత ప్రభుత్వాలు ఇచ్చిన భూములను వెనక్కి తీసుకొని భవనాలు కడుతున్నారని, ఇచ్చిన భూములు వెనక్కి తీసుకుంటే వారు ఎట్లా బతుకుతారు? అని భట్టి ప్రశ్నించారు.

ఆదిలాబాద్ జిల్లా జిన్నారం గ్రామంలో ఆదివాసీలు చేపల వేటకు వెళితే, అక్రమ కేసులు పెట్టి జైల్లో పెట్టారన్నారు. దీనిని ప్రశ్నించిన మీడియా ప్రతినిధిని సైతం అరెస్ట్ చేశారన్నారు. టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ పేరిట ఆంక్షలు విధించి కేసులు పెడుతున్నారన్నారు.

మంచిర్యాల జిల్లా కేంద్రంలోని పాతమంచిర్యాల రోడ్డులో వెదురుబుట్టలు అమ్ముకునే బేగరి లక్ష్మి, లతలు అడవి నుంచి వెదురును తెచ్చుకోకుండా ఫారెస్ట్ అధికారులు మమ్మల్ని అడ్డుకుంటున్నారని తెలిపారన్నారు. పెండ్లికి ఇంటిముందట పచ్చని పందిరి వేసుకోవడానికి కర్రలు, ఆకులను ఆడవి నుంచి తెచ్చుకొని వేసుకునేవాళ్లమని, ఇప్పుడు ఆడవి నుంచి తీసుకురానివ్వడంలేదని చెప్పారన్నారు.

అడవిలో పుట్టాం.. ఆడవిలో పెరిగాం.. ఆడవిలోనే చస్తాం. ఆడవిలోకి పోనివ్వకుంటే మేం ఎట్లా బతుకాలని అడవిబిడ్డలు ఆవేదన చెందుతున్నారని, వారిని అడవిలో స్వేచ్చగా బతుకనివ్వండని కోరారు. ఆసిఫాబాద్ నియోజ‌క‌వ‌ర్గం జంగాం గ్రామంలోని ఆదివాసీ ఓజ గిరిజ‌న హ‌స్త‌క‌ళ‌ల కేంద్రం కార్మికులు మాకు స‌రైన ఆర్థిక ప్రోత్సాహ‌కాలు అందడం లేద‌ని, వారికి ఐకేపీ ద్వారా రుణాలు ఇప్పించాలని కోరారు.

కొలువులేవి..

మా రాష్ట్రం మాకొస్తే మా కొలువులు మాకొస్తాయని ఉస్మానియా యూనివర్సిటీ సాక్షిగా ఉద్యమాలు చేసి జైలు జీవితం గడిపిన విద్యార్థులకు ఉద్యోగాలేవని భట్టి ప్రశ్నించారు. కొంత మంది నిరుద్యోగులు ఉద్యోగాలు లేక కులవృత్తులు చేసుకుంటున్న విధానాన్ని ఉదహారణలతో సహ వివరించారు.

ఆసిఫాబాద్ జిల్లా కెరిమెరి మండలం గోయగామ్ గ్రామంలో షిండె సరస్వతి అనే మహిళ తన కుమారడు శుభంను గ్రూప్ -1 కోసం టైలరింగ్ పని చేస్తూ కష్టపడి చదివించిందని, పరీక్ష పత్రం లీకేజీ కావడంతో నా కొడుకుకు ఉద్యోగం వచ్చే వరకు నేను బతికి ఉంటానో లేదో అని కంటతడి పెట్టిందన్నారు.

గ్రూప్1, గ్రూప్2 పరీక్షలను ప్రభుత్వం చాల పకడ్భందీగా నిర్వహించాలన్నారు. పేద విద్యార్థుల కోసం కోచింగ్ కేంద్రాలు పెట్టాలన్నారు. ఖాళీలను వెంటనే భర్తీ చేయడానికి చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

సోనియా తెచ్చిన చట్టం ప్రకారం పరిహారం ఇవ్వడం లేదు..

వట్టెం రిజర్వాయర్ లో ముంపుకు గురవుతున్న 5 గ్రామాలు గిరిజన, దళితులవేనని, వీరెవ్వరికి 2013లో సోనియాగాంధీ తీసుకువచ్చిన భూ సేకరణ చట్టం ప్రకారం పరిహారం ఇవ్వలేదని భట్టి అన్నారు. ఆసిఫాబాద్ కొమరం భీమ్ జిల్లా ఆడ ప్రాజెక్ట్ కాంగ్రెస్ హయాంలో పూర్తికాగా, 10 ఏండ్ల బిఆర్ఎస్ పాలనలో కుడి ఎడమ కాలువలు, డిస్ట్రిబ్యూటర్ కెనాల్స్ పూర్తి చేయలేదన్నారు.

కాంగ్రెస్ హయాంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 63 చెరువులను నిర్మాణం చేయగా పంట పొలాలకు వెళ్లేందుకు వాటి కూడా డిస్ట్రిబ్యూటర్ కెనాల్స్ తవ్వలేదన్నారు. మహబూబ్ నగర్ జిల్లాలోని కల్వకుర్తి ఎత్తిపోతల పథకం ప్రాజెక్టు నుంచి పంట పొలాలకు సాగునీరు పంపిణీ చేయడానికి కాలువలను తవ్వలేదని, వీటిని పూర్తి చేస్తే లక్షల ఎకరాలకు సాగు నీరు అందేదన్నారు.

నత్తనడకన ఎస్‌ఎల్‌బీసీ

ఎస్‌ఎల్‌బీసీ టటెన్నల్‌, నక్కల గండి, ఉదయ సముద్రం, బ్రాహ్మణ వెల్లంల ప్రాజెక్టులు చాలా నత్త నడకన సాగుతున్నాయని భట్టి ఆరోపించారు. ఖమ్మం జిల్లాలో ఇందిరా సాగర్, రాజీవ్ సాగర్ ప్రాజెక్టులను రీడిజైన్ చేసిరూ. 25 వేల కోట్లకు అంచనాలు పెంచి పది ఏళ్లు అవుతున్నా ప్రాజెక్టు పూర్తి చేయలేదన్నారు.

ప్రాణహిత- చేవెళ్ల ను రీడిజైన్ చేసి నిర్మించిన కాళేశ్వరం నుంచి ఎత్తిపోసిన నీళ్లు155 టీఎంసీలు మాత్రమేనన్నారు. ప్రాణహితను కాదని నిర్మించిన కాళేశ్వరం వల్ల మంథని, మంచిర్యాల నియోజకవర్గాల్లోని అనేక గ్రామాలు నీట మునిగాయన్నారు. కాళేశ్వరం నుంచి డిస్ర్టీబ్యూటరీ కెనాల్స్ నిర్మించి అద‌నపు ఆయకట్టును సాగులోకి ఎప్పటి లోగా తీసుకువస్తారో ప్రభుత్వం చెప్పాలని భట్టి ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.

ధాన్యం కొనుగోళ్లు జాప్యం చేయడం వల్ల రైతులు వరి కోతలు కోసి ధాన్యం రోడ్లపైన పోసి ఆరబెట్టడం వర్షాలు రావడం తడువడం వల్ల మొలకెత్తి నష్టపోయారు.

ఉత్తర తెలంగాణ వారికే సింగరేణిలో ఉద్యోగాలు ఇవ్వాలి..

సింగరేణిని ప్రయివేటీకరణ చేయడం వల్ల 1.05లక్షల ఉద్యోగాల నుంచి 45వేలకు ఉద్యోగాలు తగ్గాయన్నారు. ఆస్తులు సృష్టించి ఉపాధి కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానిది, కానీ ప్రయివేటీకరణ చేసి ఉన్న ఉద్యోగాలను తొలగించడం సరికాదన్నారు.

ఆదిలాబాద్ నుంచి ఖమ్మం వరకు విస్తరించి ఉన్న బొగ్గు గనుల్లో ఉద్యోగ అవకాశాలు ఉత్తర తెలంగాణ వాసులకు కల్పించాలన్నారు. సింగరేణి ప్రైవేటీకరణ వల్ల ఉద్యోగ నియామకంలో రూల్ ఆఫ్ రిజర్వేషన్ పూర్తిగా నిర్వీర్యం అవుతున్నదన్నారు.

కాంగ్రెస్‌ కట్టిన ట్యాంకులకు రంగులేసుకొని బిల్లులు తీసుకున్నారు..

ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం ద‌స్నాపూర్ గూడా గ్రామంలో కాంగ్రెసోళ్ళు కట్టిన ట్యాంకులకు రంగులేసుకుని బిల్లులు తీసుకున్నారని భట్టి ఆరోపించారు. మిషన్ భగీరథ దేశానికి తెలంగాణ మోడల్ అంటున్న ప్రభుత్వం స్పేషల్ ఆఫీసర్ ను నియామకం చేసి తాను చెప్పిన గ్రామల్లో నీళ్లు వస్తున్నాయా? లేదా విచారణ చేసి చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

రాష్ట్రంలో ఇండ్లు లేని పేదలందరికీ ఇండ్లు కట్టించి ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నానన్నారు. భద్రచలంకు ఆనుకొని ఉన్న ఐదు గ్రామాలను ఏపీ నుంచి తెలంగాణలోకి విలీనం చేయడానికి సీఎం కేసీఆర్ ఆలోచన చేయాలన్నారు. దళిత బంధు రాష్ట్రంలోని అందరికి త్వరగా ఇవ్వాలని, గిరిజన బంధు అమలు చేయాలని, బిసి సబ్ ప్లాన్ తీసుకువచ్చి బిసి బంధును కూడ ప్రవేశపెట్టాలన్నారు. మైనార్టీల అభివృద్ధి కోసం సచార్ కమిటి ఇచ్చిన నివేదికను అమలు చేయాలన్నారు.

ఐకేపీ ఉద్యోగులను రెగ్యులరైజ్‌ చేయండి..

గ్రామ పంచాయతీ వర్కర్స్ తో పాటు మిషన్ భగీరథ, ఐకేపిలో పని చేస్తున్న ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను రెగ్యూలరైజ్ చేయాలని భట్టి డిమాండ్‌ చేశారు. యూనివర్సిటీల్లో ఖాళీగా ఉన్న ఆద్యాపక పోస్టులు భర్తీ చేయాలని భట్టి అన్నారు మల్టీనేషనల్ కంపెనీల్లో ఉద్యోగ అవకాశాలను పేదలు పొందే విధంగా కొత్త కోర్సులను ప్రవేశపెట్టాలన్నారు.

ప్రయివేటు యూనివర్సిటీల్లో రూల్ ఆఫ్‌ రిజర్వేషన్ అమలు చేయడానికి పకడ్భందీగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఉపాధ్యాయుల పోస్టులను భర్తీ చేయడానికి వెంటనే డీఎస్సీ వేయాలన్నారు. జీవో నెంబర్ 46 వల్ల గ్రామీణ ప్రాంత కానిస్టేబుల్ అభ్యర్తులు కొలువు పొందే విషయంలో ఎదురవుతున్న ఇబ్బందులను పరిష్కరించడానికి జీవోను పునసమీక్షించాలన్నారు.

మమ్మల్ని తిట్టడమే మీ సమాధానమా.. కేసీఆర్ ప్రసంగంపై భట్టి వ్యాఖ్య

మమ్మల్ని తిట్టడమే మీ సమాధానమా అని కేసీఆర్‌ సమాధానంపై భట్టి వాఖ్యానించారు. మేం అడిగినవి…ప్రజల డిమాండ్‌లన్నారు. అవి సరైనవేనని, ఇళ్లు, ఇళ్ల స్థలాల గూర్చి అడిగామని, ప్రభుత్వ పాఠశాలల స్వీపర్ల గూర్చి, పంచాయతీ వర్కర్ల గూర్చి, భద్రాచలం ఐదు గ్రామాలను వెనక్కి తీసుకోవడం గూర్చి, వీవర్స్‌కు ఉచిత విద్యుత్తు గూర్చి అడిగామని, వాటికి సీఎం నుంచి సమాధానం వస్తుందని ఆశించామన్నారు. ఆ వెంటనే స్పందించిన సీఎం కేసీఆర్ భట్టి అడిగిన వాటిలో సమంజసమైనవి ఉన్నాయన్నారు.

పాత పద్దతిలో ఉన్న వాటిని క్లియర్ చేసి, మిగిలిన వారికి ఇళ్ల స్థలాలను అసైన్ చేసి ఇస్తామన్నారు. అసైన్డ్ భూములను కొన్ని చోట్ల పెద్దవాళ్లు కొట్టేశారని, అలాంటి చోట రీఅసైన్‌మెంట్ చేయమన్నామని, పేదలు కొంటే ఏమీ అనమన్నారు. అసైన్డ్ స్థలాలు అమ్ముకునేందుకు లబ్ధిదారులకు హక్కు కల్పించేందుకు సిద్ధంగా ఉన్నామని, ఏపి కూడా ఇటీవల జీవో తెచ్చిందన్నారు.

అర్బన్‌ ఏరియాలో అసైన్డ్ స్థలాలు అమ్ముకోవడానికి ప్రతిపక్షాలు సరేనంటే వెంటనే దళిత ఎమ్మెల్యేలతో సమావేశం నిర్వహించి నిర్ణయం తీసుకుంటామన్నారు. కార్మికుల డిమాండ్లను సానూభూతితో పరిశీలిస్తామని, గొంతెమ్మ కోర్కేలు మాత్రం సమంజసం కాదన్నారు.

ఈటెల రాజేందర్ అడిగిన అంశాలపై కేసీఆర్ స్పందిస్తు ఆయన అడిగిన వాటిలో వంద శాతం కరెక్టేనని భార్య, భర్తలలో ఒకరు చనిపోతే మిగతా వారికి వెంటనే పించన్ అందేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఫీజు రీఎంబర్స్‌మెంట్ బకాయిలు, గల్ఫ్ పాలసీపై చర్యలు తీసుకుంటామన్నారు.

Latest News