విధాత: అనర్హత వేటుకు వ్యతిరేకంగా రాహుల్ గాంధీకి మద్దతు ఇచ్చినంత మాత్రాన బీఆర్‌ఎస్‌తో పొత్తు ఉంటుందని అనుకోవడం అమాయకత్వమే అవుతుందని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జానారెడ్డి (Janareddy) అన్నారు. పొత్తులపై మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు సమాధానంగా బీఆర్‌ఎస్‌తో పొత్తుకు అవకాశమే లేదన్నారు.
ప్రజాస్వామ్య పరిరక్షణ కోసమే ఉద్యమిస్తున్నాం తప్ప పొత్తులు – ఎత్తులేమి లేవని ఆయన స్పష్టం చేశారు. పదే పదే మీడియా ప్రతినిధులు పొత్తులపై అడిగిన ప్రశ్నకు సమాధానంగా ప్రజలే నిర్ణయిస్తారని సమాదానం ఇస్తూ దాట వేశారు.
ప్రశ్నించే గొంతుల నోరును బీజేపీ నోక్కేస్తోందన్నారు. అదాని అక్రమాలకు మోడీ సహకారం ఉన్నదని రాహుల్ గాంధీ పార్లమెంట్‌లో ఆరోపిస్తే సమాధానం ఇవ్వకుండా ప్రధాని మోడీ తెల్లమొహం వేశాడన్నారు. కార్పోరేట్ శక్తులకు మోడీ వత్తాసు పలుకుతున్నాడని రాహుల్ గాంధీ చేస్తోన్న ఆరోపణల్లో నిజం ఉందనే బీఆర్ఎస్ తో సహా విపక్ష పార్టీలు రాహుల్ గాంధీకి మద్దతు ఇస్తున్నాయని జానా అన్నారు.
రాహుల్ పై కేంద్రం కక్షసాధింపు చర్యలు
ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ గారిపై కేంద్రం కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోందని జానారెడ్డి అన్నారు. దేశంలో ప్రజాస్వామ్యాన్ని బీజేపీ ప్రమాదంలోకి నెట్టేసిందన్నారు. కేంద్రం వ్యవహరిస్తోన్న అప్రజాస్వామిక విధానాలకు వ్యతిరేకంగా, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం 17విపక్ష పార్టీలు ఉమ్మడిగా ఉద్యమిస్తాయని తెలిపారు.
లోక్ సభలో అదానీ-మోడీల స్నేహంపై ప్రశ్నించి, కుంభకోణాలను ఎండగట్టినందుకే రాహుల్‌పై బీజేపీ కక్ష కట్టిందన్నారు. దారుణమైన నేరాలకు పాల్పడిన బీజేపీ ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్యేల విషయంలో లేని అత్యుత్సాహం రాహుల్ గాంధీ విషయంలో ప్రదర్శించడం రాజకీయ కుట్రలో భాగమేనన్నారు.
సూరత్ కోర్టు ఇచ్చిన తీర్పుపై అప్పీల్ కు వెళ్ళే అవకాశం ఉన్నా రాహుల్ గాంధీ లోక్ సభ సభ్యత్వం రద్దు చేయడం ఎవరి డైరక్షన్ లో జరిగిందని ప్రశ్నించారు. వ్యవస్థలను కేంద్రం మేనేజ్ చేస్తోందని జానా ఆరోపించారు.
కేంద్రం విధానాలు పూర్తిగా ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేలా ఉన్నాయన్నారు. ఈ మీడియా సమావేశంలో ఖైరతాబాద్ డీసీసీ అధక్షులు రోహిన్ రెడ్డి, కార్పొరేటర్ విజయా రెడ్డి , ఫిరోజ్ ఖాన్ గారు, మైనార్టీ సెల్ అధక్షుడు సోహైల్ తదితరులు పాల్గొన్నారు.