Income Tax Return Filing : గడువులోపుగా ఐటీ రిటర్న్స్ దాఖలు చేయకపోతే నష్టమా?
సెప్టెంబర్ 15 వరకు ఐటీ రిటర్న్స్ దాఖలు చెయ్యకపోతే ఫైన్, రీఫండ్ ఆలస్యం, నోటీసులు, వడ్డీ, జైలు పాఠాలు ఎదురవుతాయి.

గడువు లోపుగా ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు చేయకపోతే ఏం జరిగే అవకాశం ఉంది? గడువు దాటిన తర్వాత కూడా రిటర్న్స్ ఫైల్ చేయవచ్చా? ఫైన్ ఎంత ఉంటుంది? గత ఆర్థిక సంవత్సరానికి ఈ ఆర్ధిక సంవత్సరానికి ఉన్న తేడా ఏంటి? జూలైలో ముగిసే గడువును సెప్టెంబర్ వరకు పెంచిన కారణాలను తెలుసుకుందాం.
2025-26 అసెస్‌మెంట్ ఇయర్ కోసం ఆదాయపు పన్ను రిటర్న్ (ITR) దాఖలు గడువును ఈ ఏడాది సెప్టెంబర్ 15 వరకు పెంచింది కేంద్ర ప్రభుత్వం. సాధారణంగా ప్రతి ఏటా జూలై 31 వరకు ఐటీ రిటర్న్స్ దాఖలు చేయాలి. అంటే గత ఆర్ధిక సంవత్సరానికి చెందిన 2024-25 ఆదాయ పన్ను వివరాలను 2025-26 జూలై 31 వరకు దాఖలు చేయాలి. అయితే ఆదాయ పన్ను స్లాబులల్లో మార్పులతో పాటు ఇతర మార్పులతో గడువును జూలై 31 నుంచి సెప్టెంబర్ 15 వరకు పొడిగించారు.
గడువు దాటినా రిటర్న్స్ దాఖలు చేయవచ్చా?
ఆదాయ పన్ను శాఖ ప్రకటించిన గడువు సెప్టెంబర్ 15. ఈ గడువు తర్వాత కూడా రిటర్న్స్ దాఖలు చేయవచ్చు. అయితే దానికి ఫైన్ చెల్లించాలి. మొత్తం ఆదాయం రూ. 5 లక్షల కంటే ఎక్కువగా ఉంటే రూ. 5 వేలు ఫైన్ చెల్లించాలి. రూ. 5 లక్షలలోపు ఆదాయం ఉంటే ఫైన్ రూ. 1000 కట్టాలి. ట్యాక్స్ విధించే పరిమితికి తక్కువగా ఆదాయం ఉంటే ఎలాంటి ఫైన్ ఉండదు. మీరు ఫైల్ చేసిన రిటర్న్స్ లో విదేశీ ఆదాయం వంటి వివరాలు చూపితే అప్పుడు కొంత ఇబ్బంది పడాల్సి వస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఆలస్యంగా రిటర్న్స్ దాఖలు చేస్తే ఆదాయపు పన్ను చట్టం 234 ఏ ప్రకారం పెండింగ్ లో ఉన్న ట్యాక్స్ కు నెలకు 1 శాతం వడ్డీ కట్టాల్సి ఉంటుంది. ఆదాయపన్ను చట్టంలోని సెక్షన్ 139 (4) ప్రకారం ఆర్ధిక సంవత్సరం ముగిసే చివరి రోజు అంటే మార్చి 31 వరకు దాఖలు చేయవచ్చు.
నష్టాలు ఏంటి?
- సకాలంలో రిటర్న్స్ ను దాఖలు చేయకపోతే కొన్ని ఇబ్బందులున్నాయి. 2025 ఆర్ధిక సంవత్సరంలో మీకు వ్యాపారంలో నష్టాలు లేదా మూలధన నష్టాలు వస్తే వచ్చే ఆర్ధిక సంవత్సరాల్లో దీన్ని సర్దుబాటు చేయడం కుదరదు.
- ఆదాయ పన్ను ఆలస్యంగా దాఖలు చేస్తే మీకు ఐటీ శాఖ నుంచి రావాల్సిన రీఫండ్ కూడా ఆలస్యమయ్యే అవకాశం ఉంది.
- సకాలంలో రిటర్న్స్ దాఖలు చేయకపోతే ఐటీ శాఖ నుంచి నోటీసులు వస్తాయి.
- క్రెడిట్ స్కోరుమీద ప్రభావం పడుతుంది.
- ఉద్దేశపూర్వకంగా ఐటీ రిటర్న్స్ దాఖలు చేయకపోతే ప్రాసిక్యూషన్ చేసే అధికారం కూడా ఆదాయ పన్ను శాఖకు ఉంది. అయితే ఇది చాలా అరుదు. కొన్ని సందర్భాల్లో మూడు నుంచి రెండేళ్ల వరకు జైలు శిక్ష కూడా విధించే అవకాశం ఉంది.
ఆదాయ పన్ను ఎవరు చెల్లించాలి?
2025-26 ఆర్ధిక సంవత్సరంలో ఆదాయ పన్ను పరిమితిని కేంద్ర ప్రభుత్వం పెంచింది. ప్రాథమిక పన్ను మినహాయింపును రూ. 3 లక్షల నుంచి రూ. 4 లక్షలకు వరకు పెంచారు. ఆదాయపు పన్ను చట్టం సెక్షన్ 87 ఏ కింద రాయితీ గడువును రూ.7 లక్షల నుంచి రూ. 12 లక్షలకు పెంచారు. ఇక రూ. 4 లక్షల నుంచి రూ. 8 లక్షల వరకు 5 శాతం, రూ. 8 నుంచి రూ. 12 లక్షల వరకు 10 శాతం, రూ. 12 లక్షల నుంచి రూ.16 లక్షల వరకు 15 శాతం, రూ. 16 లక్షల నుంచించి రూ.20 లక్షల వరకు 20 శాతం, రూ. 20 లక్షల నుంచి రూ. 24 లక్షల వరకు 25 శాతం, రూ. 24 లక్షలకు పైగా ఆదాయం ఉంటే 30 శాతం ట్యాక్స్ కట్టాలి.