Nalgonda | విధాత: రాష్ట్ర ప్రభుత్వ అమలు చేస్తున్న దళిత బంధు, బీసీ, మైనార్టీ బంధు, గృహలక్ష్మి పథకాలను అర్హులైన వారికి అందజేయాలని డిమాండ్ చేస్తూ నల్లగొండ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సోమవారం జిల్లా కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. జిల్లా కేంద్రంలో భారీ ర్యాలీ నిర్వహించిన కాంగ్రెస్ శ్రేణులు కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహించారు.
ఈ సందర్భంగా డీసీసీ అధ్యక్షుడు కె.శంకర్ నాయక్, నల్లగొండ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు గుమ్మల మోహన్‌రెడ్డిలు మాట్లాడుతు ప్రభుత్వం అర్హులైన పేదలకు సంక్షేమ పథకాలు ఇవ్వకుండా కేవలం అధికార పార్టీ ఎమ్మెల్యేలు చెప్పినటువంటి వారి అనుచరులకు, కార్యకర్తలకు మాత్రమే ఇస్తున్నారంటు ఆరోపించారు.
ప్రభుత్వం సంక్షేమ పథకాల లబ్ధిదారుల ఎంపికను అధికార యంత్రాంగం ద్వారా లేక డ్రా పద్దతిలో పారదర్శకంగా నిర్వహించి అర్హులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ధర్నా అనంతరం జిల్లా కలెక్టర్ కర్ణన్ కు వినతిపత్రం అందజేశారు.
ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ వంగూరి లక్ష్మయ్య, వైస్ ఎంపీపీ జిల్లెల పరమేశ్, ఎస్సీ సెల్ నాయకలు పెరికె వెంకటేశ్వర్లు, తిప్పర్తి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జూకూరి రమేష్, కనగల్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గడ్డం అనుప్ రెడ్డితో పాటు పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కౌన్సిలర్లు, యూత్ కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.