Love Story | ప్రేమకు హద్దులు, ఎల్లలు లేవు. ఆస్తులు, అంతస్తులు అంత కంటే అవసరం లేదు. ప్రేమించే మనసు ఉండాలి కానీ.. ఇవేవీ అడ్డుకావు అని ఓ కుర్రాడు నిరూపించాడు. సైకిల్ రిపేర్ చేసే ఓ వ్యక్తి కుమార్తెను పెళ్లాడి తన నిజమైన ప్రేమను చాటుకున్నాడు.
వివరాల్లోకి వెళ్తే.. మధ్యప్రదేశ్‌లోని మనావర్‌కు చెందిన సాధిక్ హస్సేన్ అనే వ్యక్తి స్థానిక బస్టాండ్ వద్ద ఓ సైకిల్ రిపేర్ షాపులో మెకానిక్‌గా పని చేస్తున్నాడు. సాధిక్ భార్యనేమో గృహిణి. ఈ దంపతులకు ముగ్గురు కుమార్తెలు, ఇద్దరు కుమారులు. ఇద్దరు కుమార్తెలకు పెళ్లిళ్లు అయ్యాయి. మూడో కూతురు తబస్సుమ్ చిన్నప్పట్నుంచే చదువులో ఫస్ట్ ఉండేది. డిగ్రీ అనంతరం ఉన్నత చదువులకు విదేశాలకు వెళ్లాలని తబస్సుమ్ నిర్ణయించుకుంది. ఇక మధ్యప్రదేశ్ ప్రభుత్వం రూ. 45 లక్షలు స్కాలర్‌షిప్ మంజూరు చేయడంలో తబస్సుమ్ ఆస్ట్రేలియాలోని బ్రిస్‌బేన్‌కు 2017లో వెళ్లింది.
ఇక తన సీనియర్ అయిన యాష్ హాన్స్‌చైల్డ్‌తో తబస్సుమ్‌కు పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం కాస్త ప్రేమకు దారి తీసింది. పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నారు. దీంతో ఈ ఏడాది ఆగస్ట్ 2వ తేదీన ఆస్ట్రేలియాలో వివాహం చేసుకుని, ఒక్కటయ్యారు. ఇటీవలే ఈ జంట మనావర్‌కు చేరుకుంది. యాష్ తల్లి కూడా ఇండియాకు వచ్చింది. భారత సంస్కృతి, సంప్రదాయాలకు ముగ్ధుడైన యాష్.. మరోసారి తబస్సుమ్‌ను వివాహమాడాడు. ఈ క్రమంలో తబస్సుమ్, యాష్ ప్రేమ కథ నెట్టింట వైరల్ అవుతోంది.