Dharaṇi | Part-1
ధరణి.. ప్రస్తుతం ఈ పేరు తెలంగాణ రాష్ట్రంలోని రైతుల వెన్నులో వణుకు పుట్టిస్తుండగా, ప్రతిపక్ష పార్టీలకు ఆయుధంగా మారింది. రాష్ట్రంలో ఏదో ఒక మూలన ధరణి కారణంగా ఇబ్బందులు పడుతున్న రైతులు ప్రతిరోజూ దర్శనమిస్తున్నట్లుగానే.. ధరణి పేరు లేకుండా ప్రతిపక్షాలకు, మీడియాకు ఒక్క రోజు కూడా గడవడం లేదు. అధికారంలోకి వస్తే ధరణిని రద్దు చేస్తామని ప్రతిపక్ష పార్టీలు ఎన్నికల హామీగా ప్రకటిస్తున్నాయి. అయితే రాష్ట్రంలోని భూ సమస్యలన్నింటికి ధరణి ఓ పరిష్కారం అని నాడు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. కానీ నేడు కనిపిస్తున్న లోపాలను అంగీకరించేందుకు ప్రభుత్వం సాహసించడం లేదు. ధరణి ఎలా మొదలైంది? లోపాలు ఎక్కడున్నాయి? పరిష్కారాలేంటి?
తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకువచ్చిన ధరణి.. అంతే ప్రతిష్ఠాత్మకంగా అమలు కావడం లేదన్న విమర్శలు బలంగా ఉన్నాయి. ధరణి పేరుతో సాక్షాత్తు పాలకులే భూ దందాకు పాల్పడుతున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సామాన్య రైతులకు ధరణిలో తగిన సేవలు అందడం లేదని హైకోర్టు సైతం వ్యాఖ్యానించింది. అదే సమయంలో బడా భూస్వాములకు మాత్రం క్షణాల్లో సేవలందుతున్నాయి.
ధరణి పోర్టల్‌ను 2020 అక్టోబర్ 28న ముఖ్యమంత్రి కేసీఆర్ మేడ్చల్ జిల్లా మూడు చింతలపల్లిలో ప్రారంభించారు. 2020 నవంబర్ 2వ తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా ధరణి సేవలు అందుబాటులోకి వచ్చాయి. అంతకు ముందు 2018లో ధరణి పేరుతో రైతులకు పట్టాదారు పాసుపుస్తకాలను జారీ చేసి వివాదాస్పద భూములను పార్ట్-బీలో చేర్చారు.
అదిగదిగో అద్భుతం అంటూ అట్టహాసంగా అమల్లోకి తెచ్చిన ధరణి కారణంగా కొన్ని లక్షల మంది రైతులు నిద్ర లేని రాత్రులను గడుపుతున్నారనేది బహిరంగ రహస్యం. గత రెవెన్యూ చట్టాలలో లోపాలను ఎరగా చూపి, సమగ్ర భూ సర్వేనే పరిష్కారమని నమ్మబలికిన ప్రభుత్వం.. ఎలాంటి భూ సర్వే నిర్వహించలేదు. రెవెన్యూ, న్యాయ నిపుణుల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోకుండా ధరణిని అమల్లోకి తీసుకువచ్చింది.
రాష్ట్రంలోని భూ సమస్యలన్నింటికీ ధరణి ఓ పరిష్కారం అని నాడు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. కానీ నేడు తెలంగాణలో యావత్తు భూ సమస్యలకు ధరణినే కారణమని బాధిత రైతులు ఆరోపిస్తున్నారు. ధరణి పోర్టల్ లో ఉన్న లోపాలను అంగీకరించేందుకు ప్రభుత్వం సాహసించడం లేదన్న అభిప్రాయాలు ఉన్నాయి. గతంలో అనేక ప్రభుత్వాలు భూ సంస్కరణలకు శ్రీకారం చుట్టాయి. వాటి ఫలాలు రైతులకు కొంత వరకు మేలు చేశాయి. కానీ అంతా తానై కొత్త రెవెన్యూ చట్టాన్ని రూపకల్పన చేసిన ముఖ్యమంత్రి యావత్తు రెవెన్యూ చరిత్రలోనే ధరణి ఒక విఫల ప్రయోగమని మాత్రం నేటికి ఒప్పుకోవడం లేదు.
సకల భూ సమస్యలకు పరిష్కారం ధరణి అని పదే పదే చెప్పుకునే ముఖ్యమంత్రి.. రైతులకు ఏదేని భూ సమస్య వచ్చినప్పుడు దానిని పరిష్కరించుకునే వ్యవస్థను ప్రభుత్వ పరిధిలో లేకుండా చేశారనే విమర్శలు ఎదురవుతున్నాయి. నేడు చిన్న చిన్న భూ సమస్యలను సవరించే వ్యవస్థ లేని కారణంగా రాష్ట్రవ్యాప్తంగా సివిల్ కోర్టులలో రోజుకు వందల సంఖ్యలో భూ సంబంధిత కేసులు నమోదవుతున్నాయి. వందల యేండ్ల నుంచి సాగు చేసుకుంటున్న భూములపై హక్కులు లేకుండా చేసిన ధరణి కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది రైతులు ఆత్మహత్యలకు, హత్యలకు గురవుతున్నారు.
ధరణి అమల్లోకి వచ్చిన రోజునే ప్రభుత్వం కబ్జా కాలంను తొలగించింది. అంతేకాదు ఆదరాబాదరగా, ఎలాంటి క్షేత్రస్థాయి పరిశీలన, పంచనామా లేకుండానే భూ మార్పిడీలకు శ్రీకారం చుట్టింది. లక్షల ఎకరాల భూములను ఆనాదిగా అనుభవిస్తున్న పేద, చిన్న, సన్నకారు రైతుల నోట్లో ప్రభుత్వ చర్యల కారణంగా మట్టి కొట్టినట్లైంది. ధరణి వెబ్ పోర్టల్ ముసుగులో ఆ లక్షల ఎకరాల భూములు ధరణి రికార్డులలో ఎవరి పేరుతో నమోదు చేశారో తెలియదు. ఎప్పుడో భూములను విక్రయించిన వారిపై పట్టాదారు పాసు పుస్తకాలను ఇచ్చి కొత్త సమస్యలకు తెరలేపారన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
భూ పరిపాలన సౌలభ్యం పేరుతో రాష్ట్రంలో జరిగిన భూ సంస్కరణలు సామాన్య రైతుకు మేలు చేయకపోగా, వేల కోట్ల విలువైన భూములు బడాబాబుల కబంధహస్తాల్లోకి చేరుతున్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ధరణిలో ఉన్న లొసుగులను అడ్డం పెట్టుకొని రాష్ట్ర వ్యాప్తంగా లక్షల కోట్ల దందా నడుస్తున్నదని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. చాలా సంవత్సరాలుగా భూములను నమ్ముకున్న పట్టాదారులపై దౌర్జన్యాలకు పాల్పడుతూ ఎన్నడో భూములను అమ్ముకున్న వారి వారసుల పేర అనధికారికంగా వారసత్వ పట్టాలను జారీ చేస్తున్నారని మండిపడుతున్నాయి.
రాత్రి సమయాల్లో ఆ భూములపై క్రయవిక్రయాలు జరుపుతూ.. తెల్లారేసరికి ఆ భూములను ప్రైవసీ జాబితాలో చేర్చుతున్నారని అంటున్నారు. రంగారెడ్డి జిల్లా వట్టినాగులపల్లిలోని పలు సర్వే నెంబర్లలోని సుమారు వెయ్యి ఎకరాలపై అక్రమంగా క్రయవిక్రయాలు జరుగుతున్నాయని చెబుతున్నారు. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ప్లాట్లుగా, అలాగే ధరణి (తహసీల్దార్ కార్యాలయాల్లో) లో వ్యవసాయ భూములుగా రిజిస్ట్రేషన్లు చేసుకుంటున్నారు.
సామాన్యుల పట్టా భూములు నిషేధిత జాబితాలో చేరితే.. ఆపతి సమయంలో విక్రయించేందుకు కూడా ధరణిలో అవకాశం లేకుండా పోయింది. కానీ.. వివాదాల్లో ఉన్న వేల ఎకరాల భూములపై రిజిస్ట్రేషన్లు మాత్రం దర్జాగా జరిగిపోతున్నాయని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. చాలా గ్రామాలలో వందల ఎకరాల భూములపై ధరణిలో జరిగిన తప్పిదాల (అటవీ, ఎండోమెంట్ , ప్రభుత్వ సేకరణ తదితర) కారణంగా వందల యేండ్లుగా సాగుచేసుకుంటున్న రైతులకు పట్టాదారు పాసుపుస్తకాలు, రైతుబంధు, రైతుబీమా అందడం లేదు.
మేడ్చల్, రంగారెడ్డి జిల్లాల పరిధిలో ఉన్న కొన్ని వేల కోట్ల విలువైన ప్రభుత్వ భూములను ( సీఎస్ -14 / సీఎస్ 7 ) ధరణిని అడ్డం పెట్టుకొని ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టేందుకు ప్రయత్నం చేస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.