Bhopal | దళితుడి ముఖానికి అశుద్ధం.. చేయి తాకినందుకు కుల అహంకారి దుశ్చర్య

Bhopal మధ్యప్రదేశ్‌లో వెలుగు చూసిన కుల వివక్ష ఆధునిక కాలంలోనూ వదలని జాడ్యం భోపాల్‌: ఆధునిక సమాజంలో బతుకుతున్నా.. మనిషి ఇంకా బూజుపట్టిన భావజాలాల నుంచి బయటపడలేక పోతున్నాడు. ప్రత్యేకించి కుల వివక్ష అనే జాడ్యం సమాజాన్ని ఇంకా పట్టిపీడిస్తూనే ఉన్నది. అనునిత్యం అనేక రూపాల్లో అది బయట పడుతున్నది. కుల వివక్షను నిషేధించినా.. గ్రామాల్లో దురహంకారులు ఇంకా ఆ సంప్రదాయాలనే పాటిస్తూ.. మనిషిని మనిషిగా చూడటానికి నిరాకరిస్తున్న ఉదంతాలు అనేకం కనిపిస్తున్నాయి. కొన్ని చోట్ల అగ్రకుల […]

Bhopal | దళితుడి ముఖానికి అశుద్ధం.. చేయి తాకినందుకు కుల అహంకారి దుశ్చర్య

Bhopal

  • మధ్యప్రదేశ్‌లో వెలుగు చూసిన కుల వివక్ష
  • ఆధునిక కాలంలోనూ వదలని జాడ్యం

భోపాల్‌: ఆధునిక సమాజంలో బతుకుతున్నా.. మనిషి ఇంకా బూజుపట్టిన భావజాలాల నుంచి బయటపడలేక పోతున్నాడు. ప్రత్యేకించి కుల వివక్ష అనే జాడ్యం సమాజాన్ని ఇంకా పట్టిపీడిస్తూనే ఉన్నది. అనునిత్యం అనేక రూపాల్లో అది బయట పడుతున్నది. కుల వివక్షను నిషేధించినా.. గ్రామాల్లో దురహంకారులు ఇంకా ఆ సంప్రదాయాలనే పాటిస్తూ.. మనిషిని మనిషిగా చూడటానికి నిరాకరిస్తున్న ఉదంతాలు అనేకం కనిపిస్తున్నాయి. కొన్ని చోట్ల అగ్రకుల దురహంకారులు దారుణాలకు పాల్పడు తుంటే.. బలహీనవర్గాల వారు సైతం దళితుల పట్ల అమానుషంగా వ్యవహరిస్తున్నారు.

తాజాగా మధ్యప్రదేశ్‌లో ఇటువంటిదే ఒక దారుణం చోటు చేసుకున్నది. ఛత్తర్‌పూర్‌ జిల్లాలో ఈ నెల 21న జరిగిన ఘటన వెలుగుచూసింది. అక్కడ ఒక కుల దుహంకారి.. ఒక దళితుడి ముఖంపై బలవంతంగా అశుద్ధం పూయించాడు. బికౌరా గ్రామంలో డ్రైనేజ్ నిర్మించే పని జరుగుతున్నది. దశరథ్‌ అహిర్వార్ అనే దళితుడు ఆ నిర్మాణ పనుల్లో ఉన్నాడు.

ఇతర వెనుకబడిన తరగతులకు చెందిన రామ్ క్రుపాల్ పటేల్ ఈ డ్రైనేజ్ పనుల వద్ద వున్న బోరింగ్ దగ్గర స్నానం చేస్తున్నాడు. దశరథ్‌ చేతికి అంటుకుని ఉన్న డాంబరు.. అనుకోకుండా పటేల్‌కు అంటుకున్నది. ఈ చిన్న పొరపాటును రామ్ క్రుపాల్ పటేల్ కులవివక్ష అనే భూతద్దంలో చూసి.. రెచ్చి పోయి వెంటనే తన వద్ద ఉన్న మగ్గులో మానవ అశుద్ధాన్ని తెచ్చి దశరథ్‌ ముఖానికి, తలకు పులిమాడు. ఊహించని ఈ ఘటనతో దశరథ్‌ అవాక్కయ్యాడు.

మరుసటి రోజు గ్రామంలో పంచాయితీ నిర్వహించిన పెద్దలు కూడా.. బీసీ అయిన పటేల్‌ను దశరథ్‌ ముట్టుకోవడం తప్పని తేల్చారు. అంతేకాదు.. చేసిన తప్పిదానికి అతడిపై 600 జరిమానా విధించారు. దీంతో దశరథ్‌ పోలీసులను ఆశ్రయించాడు. షెడ్యూల్డ్‌ కులాల వేధింపుల నివారణ చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కొద్ది రోజుల క్రితం ఇదే రాష్ట్రంలో ఒక బీజేపీ నాయకుడు మతిస్థిమితం సరిగా లేని ఒక గిరిజనుడిపై మూత్ర విసర్జన చేసిన వీడియో సామాజిక మాధ్యమాల్లో ప్రత్యక్షమై.. తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే.