Warangal | గులాబీలో అసమ్మతి గుంభనం.. పట్టించుకోని వరంగల్ ప్రజలు

Warangal | సిట్టింగ్ ఎమ్మెల్యేలు, అనుచరుల సంబురం టికెట్ ఆశావహుల్లో నిరాశ ములుగు అభ్యర్థి తప్ప అన్నీ పాత ముఖాలే.. బీఆర్ఎస్ సంబురాలను పట్టించుకోని వరంగల్ ప్రజలు విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: బీఆర్ఎస్ శాసనసభ అభ్యర్థుల ప్రకటనతో ఉమ్మడి వరంగల్ జిల్లా గులాబీలో అసమ్మతి గుంభనంగా ఉంది. టికెట్ లభించిన సిటింగ్ ఎమ్మెల్యేలు, నేతలు, వారి అనుచరులు సంబరాల్లో మునిగిపోయారు. టికెట్ వస్తుందో? లేదో అన్న అనుమానం ఉన్న ఎమ్మెల్యేలు, వారి అనుచరులు ఊపిరిపీల్చుకున్నారు. టికెట్ […]

  • Publish Date - August 22, 2023 / 12:22 PM IST

Warangal |

  • సిట్టింగ్ ఎమ్మెల్యేలు, అనుచరుల సంబురం
  • టికెట్ ఆశావహుల్లో నిరాశ
  • ములుగు అభ్యర్థి తప్ప అన్నీ పాత ముఖాలే..
  • బీఆర్ఎస్ సంబురాలను పట్టించుకోని వరంగల్ ప్రజలు

విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: బీఆర్ఎస్ శాసనసభ అభ్యర్థుల ప్రకటనతో ఉమ్మడి వరంగల్ జిల్లా గులాబీలో అసమ్మతి గుంభనంగా ఉంది. టికెట్ లభించిన సిటింగ్ ఎమ్మెల్యేలు, నేతలు, వారి అనుచరులు సంబరాల్లో మునిగిపోయారు. టికెట్ వస్తుందో? లేదో అన్న అనుమానం ఉన్న ఎమ్మెల్యేలు, వారి అనుచరులు ఊపిరిపీల్చుకున్నారు. టికెట్ ఆశించిన అసమ్మతి నేతలు, వారి అనుచరులు మాత్రం తీవ్ర నిరాశకు లోనయ్యారు.

ఈ సంబురాలకు దూరంగా ఉన్నారు. అధికార పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థుల ప్రకటన, సంబురాలను చూస్తున్న ప్రజలు మాత్రం… దాదాపు అంతా పాతముఖాలే కదా? అంటూ నిరాసక్తిని వ్యక్తపరిచారు. ఎన్నికల నాటికి పరిస్థితి ఎలా ఉంటుందోగానీ, ఈ హడావుడి పై పెద్దగా స్పందన కనిపించకపోవడం గమనార్హం. జిల్లాలో 12 అసెంబ్లీ సెగ్మెంట్లుండగా, 11 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు.

పెండింగులో జనగామ

జనగామ అసెంబ్లీ సీటును పెండింగులో పెట్టారు. ఈ స్థానానికి సిటింగ్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి, ఎమ్మెల్సీలు పోచంపల్లి శ్రీనివాసరెడ్డి, పల్లా రాజేశ్వర్ రెడ్డి పోటీపడుతున్నారు. ఈ టికెట్ వ్యవహారం ఇప్పుడు తేలే అవకాశాలు లేవు. ఈ లోపు నియోజకవర్గంలో బేరసారాలు, ప్రలోభాలు జోరందుకున్నాయి. తమ వర్గాలను బలోపేతం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.

స్టేషన్ సిటింగుకు ఝలక్

స్టేషన్ ఘన్ పూర్ లో సిటింగ్ ఎమ్మెల్యే రాజయ్యకు చెక్ పెట్టారు. ఎమ్మెల్సీ పాత కాపు కడియం శ్రీహరికి టికెటిచ్చారు. రాజయ్య వర్గం తీవ్ర నిరాశలోకి వెళ్ళింది. ఆయన వర్గం వేచిచూసే ధోరణితో వ్యవహరిస్తోంది. అధిష్టానం ఏమైనా హామీ ఇచ్చిందా? లేక ఆశతో ఎదురుచూస్తున్నారా? తేలాల్సి ఉంది.

ఊపిరిపీల్చుకున్న సిటింగులు

వరంగల్ తూర్పు, భూపాలపల్లి, మానుకోట, డోర్నకల్, వర్ధన్నపేట ఎమ్మెల్యేలు నన్నపునేని నరేందర్, గండ్ర వెంకటరమణారెడ్డి, శంకర్ నాయక్, రెడ్యానాయక్, అరూరి రమేష్ లు హమ్మయ్యా అంటూ ఊపిరిపీల్చుకున్నారు. ఈ నియోజకవర్గ సిటింగులకు టికెట్లు వస్తాయా? లేదా? అనే ఉత్కంట నెలకొన్న స్థితిలో అధినేత పేర్లు ప్రకటించారు.

ఈ ఐదు నియోజకవర్గాల్లో పార్టీలో అసమ్మతి బజారునపడ్డది. ఇతర నాయకులు టికెట్ ఆశించారు. ఎమ్మెల్యేల పై భూకబ్జాలు, అవినీతి, పార్టీ కేడర్ ను పట్టించుకోకపోవడం లాంటి తీవ్ర విమర్శలు సొంత పార్టీ నేతలే చేశారు. ఈ స్థితిలో తిరిగి టికెట్ రావడంతో ఈ ఎమ్మెల్యేలు, వారి అనుచరులు సంబురాల్లో మునిగిపోయారు.

తూర్పులో టికెట్ ఆశించిన ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, మేయర్ సుధారాణి, ఎంపీ రవిచంద్ర, భూపాలపల్లిలో ఎమ్మెల్సీ మధుసూధనాచారి, మానుకోటలో ఎమ్మెల్సీ తక్కెళ్ళపల్లి, ఎంపీ కవిత, డోర్నకల్ లో మంత్రి సత్యవతి, వర్ధన్నపేటలో మార్నేని రవిందర్ రావు వర్గాలు పూర్తి నిరాశలో మునిగిపోయారు. అసంతృప్తి నేతలు సంబురాలకు దూరంగా ఉన్నారు.

ఈ ఐదు సెగ్మెంట్లు ఊహించినవే..

ఐదు సెగ్మెంట్లలో మాత్రం ముందుగా ఊహించిన మేరకే టికెట్లు రావడంతో సంబురాల్లో మునిగిపోయారు. ఈ నియోజకవర్గాల్లో అసమ్మతి వర్గాలు లేకున్నా, అసంతృప్తులు మాత్రం ఉన్నారు. వరంగల్ పశ్చిమలో వినయ్ భాస్కర్, పాలకుర్తిలో ఎర్రబెల్లి, నర్సంపేటలో పెద్ది సుదర్శన్ రెడ్డి, పరకాలలో ధర్మారెడ్డి, ములుగులో తొలిసారి టికెట్ వచ్చిన జడ్పీ చైర్ పర్సన్ బడే నాగజ్యోతి వర్గాలు సంబురాలు చేసుకున్నారు.