Delhi | విధాత: పాఠశాల తరగతి గదుల్లో సెల్‌ఫోన్లను ఢిల్లీ ప్రభుత్వం నిషేధించింది. ఈ మేరకు గురువారం ఢిల్లీ పాఠశాల విద్య డైరెక్టర్ ఆదేశాలు జారీచేశారు. టీచర్లు, ఇతర సిబ్బంది బోధించే సమయంలో ఫోన్లు వాడకూడదని ఆదేశాల్లో స్పష్టంచేశారు. క్లాస్ రూముల్లో చదువుకొనే వాతావరణం కల్పించడంలో భాగంగా ఈ చర్యలు తీసుకున్నట్టు వెల్లడించారు.
ఇటీవల సెల్‌ఫోన్ల వాడకం అందరికీ సాధారణంగా మారింది. విద్యార్థులు, టీచర్లు, ఇతరవర్గాల ప్రజలు నిత్యం సెల్‌ఫోన్ వాడకుండా ఉండలేకపోతున్నారు. సెల్‌ఫోన్ల వాడకం వల్ల మేలుతోపాటు కీడు కూడా జరుగుతున్నది. ముఖ్యంగా విద్యార్థులు సెల్‌వాడటం వల్ల చెడు ప్రభావాలు పడుతున్నాయి. తీవ్ర ఒత్తిడి, తీవ్ర కోపం, తీవ్ర ఆందోళన, ఒంటరితనం, చూపు మందగించడం, నిద్రలేమి వంటి మానసికంగా, శారీరకంగా అనారోగ్య సమస్యలు ఏర్పడుతున్నాయి.
అకడమిక్ కార్యకలాలపై సెల్ ఫోన్ ప్రతికూల ప్రభావం చూపుతున్నది. ముఖాముఖీగా మాట్లడటం, సాన్నిహిత్యం తగ్గుతున్నది. ఫొటోలు తీయడం, రికార్డు చేసుకోవడం, ఇతర వ్యాపకాల కారణంగా క్లాస్‌రూమ్‌లో టీచర్ చెప్పేది వినలేని, గ్రహించలేని పరిస్థితి దాపురిస్తున్నది. తరగతి గదిలో, పాఠశాల ఆవరణలో ఇతర నెగెటివ్ అవసరాలకు సెల్‌ఫోన్ వాడకం పెరుగుతున్నది. తద్వారా లెర్నింగ్ స్కిల్స్ దెబ్బతింటున్నాయి. ఈ నేపథ్యంలో తరగతి గదుల్లో సెల్‌ఫోన్ అనుమతిని నిషేధించినట్టు ఢిల్లీ పాఠశాల విద్య డైరెక్టర్ తెలిపారు. విద్యార్థులు తల్లిదండ్రులు కూడా ఇందుకు సహకరించాలని కోరారు.