విధాత: భగవంతుడిని పూజించడానికి అనేకానేక మార్గాలలో నోము, వ్రతములు ప్రధానమైనవి. ముఖ్యంగా ఇవి స్త్రీలు పాటించే వాటిలో సాధారణమైన భక్తి విధానాలు. భగవంతుడు- దేవుడు అనేది మానవుని నమ్మకం. దండం పెట్టి దక్షిణ ఇస్తే చేసే పాపాలు పోయి పుణ్యం వస్తుందంటే నవీనకాలంలో శాస్రపరంగా నమ్మకం కుదరడం లేదు. ఏది ఏమైనా మన ప్రాచీన గ్రంథాలలో ఉన్న ప్రకారం..
నోము:
మనస్సుని కేవలం భగవంతుడి పైనే లగ్నం చేసి స్వామిని పూజించి ధ్యానం చేసేది – నోము . ఉదా: శ్రావణ మంగళవారం నోము , అట్లతద్ది నోము. నోములు నోచుట అనాదిగా ఆచారంగా ఉన్నది. స్త్రీలకు బాల్యం నుంచి సదాచార సంపత్తులను సంప్రాప్తింప జేసేందుకు ఈ నోముల ఆచారం ఏర్పడి ఉండొవచ్చనే అభిప్రాయం ఉంది.
ఈ నోములలో చిన్నతనం నుంచి స్త్రీలు కోరవలసిన సామాన్య సుఖసంతోషాలు మొదలుకొని వార్ధక్యంలో కైవల్యప్రాప్తి కొసం కోరే కోరికలు.. వాటికి తగినట్లుగా ఆచరించాల్సిన నోములు ఉంటాయి. ఈ నోములలో నిగూఢమై యున్న మొదటి ధర్మం వితరణం ఇవ్వడం. అంటే ఉన్నంతలో పండో, పత్రమో, వస్తువో, ధనమో, ధాన్యమో, భోజనమో ఇతరులకు ఇవ్వడం.
వ్రతము :
అత్యంత నియమనిష్టలతో మంత్రోచ్చారణలతో ధూపదీప నైవేద్యాలతో భగవంతుని (దేవుని లేదా దేవతను )సేవించేది వ్రతం. వ్రతం… అనగా దీర్ఘకాలాను పాలనీయమైన సంకల్పం. సంకల్పం అంటే “ఇది నేను చేయవలెను, విడవరాదు” అనుకొనుట. నియమ-నిబంధనలతో ఉపవాసముంతో చేసే పూజ లేక అరాధన. వ్రతంలో సంకల్పము, దీక్ష, కథాపఠనము తప్పనిసరి. వ్రతం చేయడం వలన సమస్త పాపాలు పోయి పుత్ర, పౌత్ర సంపదాభివృద్ధి , సర్వ సౌభాగ్యాలు కలుగుతాయి. ఉదా: వరలక్ష్మీ వ్రతం, సావిత్రీ వ్రతం, గౌరీ వ్రతం మొదలైనవి.