Chandrayaan-3 | చంద్రయాన్ -3 ఎంత వేగంతో ల్యాండ్ అవుతుందో తెలుసా? అక్కడ ఉంటే నుజ్జునుజ్జయిపోవడం ఖాయం
Chandrayaan-3 | విధాత: చంద్రయాన్ 3 (Chandrayan -3 )ల్యాండింగ్ అంత ఆషామాషీ వ్యవహారం కాదని లూనా 25 ఘటనతో మరోసారి రుజువయింది. అగ్ర దేశాలన్నీ చేరుకోవాలని భంగపడిన ఆ దక్షిణధ్రువం భారత్ (India) కు కొద్ది గంటల్లోనే దాసోహం కానుంది. అసలు దక్షిణ ధ్రువంపై దిగడం ఎందుకంత కష్టం. అక్కడ దిగే ముందు ఎలాంటి విన్యాసాలు చేయాలి? ఎగుడు దిగులు ఉపరితలంతో భారీ బిలాలతో ఉండే దక్షిణ ధ్రువంపై 3 ల్యాండర్ దిగాల్సి ఉంటుంది. ఆగస్టు […]

Chandrayaan-3 |
విధాత: చంద్రయాన్ 3 (Chandrayan -3 )ల్యాండింగ్ అంత ఆషామాషీ వ్యవహారం కాదని లూనా 25 ఘటనతో మరోసారి రుజువయింది. అగ్ర దేశాలన్నీ చేరుకోవాలని భంగపడిన ఆ దక్షిణధ్రువం భారత్ (India) కు కొద్ది గంటల్లోనే దాసోహం కానుంది. అసలు దక్షిణ ధ్రువంపై దిగడం ఎందుకంత కష్టం. అక్కడ దిగే ముందు ఎలాంటి విన్యాసాలు చేయాలి?
ఎగుడు దిగులు ఉపరితలంతో భారీ బిలాలతో ఉండే దక్షిణ ధ్రువంపై 3 ల్యాండర్ దిగాల్సి ఉంటుంది. ఆగస్టు 23న జరగనున్న ఈ చివరి దిశలో కేవలం 15 నిమిషాల్లో సాఫ్ట్ ల్యాండింగ్ ప్రక్రియ పూర్తి కావాల్సి ఉంటుంది. ఈ 15 నిమిషాలనే 15 మినిట్స్ ఆఫ్ టెర్రర్ అని ఇస్రో (ISRO) మాజీ ఛైర్మన్ కె. శివన్ గతంలో అభివర్ణించారు. మరి ఈ 15 నిమిషాల్లో ఏం జరుగుతుంది?
ముందుగా ల్యాండింగ్ ప్రక్రియ ప్రారంభమైన 23వ తేదీ సాయంత్రం 5:47కు చంద్రుని ఉపరితలానికి చంద్రయాన్ 3.. 90 డిగ్రీల కోణంలో ఉంటుంది. అయితే అప్పటికి ఇది అడ్డంగా చంద్రుని కక్ష్యలో పరిభ్రమిస్తూ ఉంటుంది. దానిని నిలువుగా ల్యాండింగ్ కు సిద్ధం చేయడంతో అసలు ప్రక్రియ ప్రారంభం అవుతుంది.
దీనికి కొన్ని వేల గణిత సూత్రాలను క్రోడీకరించి ఒక సిమ్యులేషన్‌ను తయారుచేసినట్లు ఇస్రో ఛైర్మన్ ఒక సందర్భంలో పేర్కొన్నారు. సరిగ్గా ఈ సిమ్యులేషన్‌లో తేడా రావడంతో మనం చంద్రయాన్ 2ని విజయవంతం చేయలేకపోయామని వెల్లడించారు. ఇంధనాన్ని తక్కువగా వినియోగిస్తూ.. దూరాన్ని సరిగ్గా అంచనా వేసి ఉపగ్రహాన్ని వెర్టికల్ పొజిషన్‌లోకి తీసుకురావాల్సి ఉంటుంది.
హారిజాంటల్ (అడ్డం)గా పరిభ్రమించేటప్పుడు చంద్రయాన్ గంటకు 6048 కి.మీ. వేగంతో పయనిస్తుంది. దీనిని సుమారు 1290 కి.మీ. వేగానికి తగ్గించాలి. అనంతరం వెర్టికల్ పొజిషన్‌కు వచ్చాక ఈ వేగం మరింత తగ్గి గంటకు 220 కి.మీ. వద్దకు రావాలి. రఫ్ బ్రేకింగ్ ఫేస్‌గా పిలిచే ఈ ప్రక్రియ మొత్తం 690 సెకన్లలో ముగిసిపోవాలి. చంద్రయాన్ 3 ఈ ఫీట్ చేసే క్రమంలో చంద్రుని ఉపరితలంపై 30 కి.మీ. ఎత్తు నుంచి 7.42 కి.మీ. ఎత్తుకు వచ్చేస్తుంది.
ఇందుకు అది చంద్రుని గగనతలంలో 713.5 కి.మీ ప్రయాణించాల్సి ఉంటుంది. 7.42 కి.మీ ఎత్తుకు చేరుకున్నాక దీనిని ఆల్టిట్యూడ్ హోల్డిండ్ ఫేస్ అని పిలుస్తారు. ఈ ప్రక్రియలో రాకెట్ ఎలా పైకి నేరుగా వెళుతుందో.. అంతే నేరుగా చంద్రునిపై దిగడానికి ఉపగ్రహం తన స్థితిని పూర్తిగా మార్చుకుంటుంది. అనంతరం ఉపరితలంపై ల్యాండ్ అవుతుంది. మరీ నేరుగా కాకపోయిన 12 డిగ్రీల వంపుతో ల్యాండ్ అయినా ఉపగ్రహం సురక్షితంగా ఉంటుందని ఇస్రో పేర్కొంది.
ఆ వేగం మనిషిని చంపేస్తుంది..
చంద్రయాన్ 3 జాబిల్లి ఉపరితలంపై సాఫ్ట్ ల్యాండింగ్ చేస్తున్నా దాని వేగం మాత్రం గణనీయంగానే ఉంటుంది.. ఒక వేళ అక్కడ మనిషి ఉండి.. చంద్రయాన్ 3 అతడిపై ల్యాండ్ అయితే అతడి ఎముకలు మొత్తం నుజ్జునుజ్జయిపోతాయి. ఉపరితలాన్ని ముద్దాడేటప్పుడు చంద్రయాన్ 3 వేగం గంటకు 10.8 కి.మీ. గా శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు.
అన్నీ అనుకున్నట్లు జరిగితే.. అది 7.2 కి.మీ.గా ఉండాలి. కానీ 10.8 కేఎంపీహెచ్ వేగాన్ని తట్టుకునే లాగానే ల్యాండర్, రోవర్, ఇతర పరికరాలను శాస్త్రవేత్తలు డిజైన్ చేశారు. వీటి మొత్తం బరువు భూమిపై 1750 కేజీలు కాగా చంద్రునిపై అవి 2000 కేజీలు తూగుతాయి.