Elon Musk | ప్రస్తుత ఆధునిక కాలంలో టెక్నాలజీ కొత్త పుంతలు తొక్కుతున్నది. ఈ టెక్నాలజీతో మనిషి జీవితమే మారిపోతున్నది. అదే సమయంలో మనషి తలచుకుంటే సాధించలేనిది ఏదీ లేదు.. అసాధ్యాన్నీ సుసాధ్యం చేసి చూపించొచ్చన్న నానుడిని ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ నేతృత్వంలోని కంపెనీ చేయి చూపించింది. మనిషి మెదడులో చిప్‌ను అమర్చేందుకు చేపడుతున్న ప్రయోగాల్లో మరో ముందడుగు పడింది.
ఎలాన్ మస్క్‌కి చెందిన న్యూరో టెకాల్నజీ చేపట్టిన ప్రయోగం ‘న్యూరాలింక్’ ఆశాజనకమైన ఫలితాలు వెల్లడైనట్లు ఎలాన్ మస్క్ వెల్లడించారు. మనిషి మెదడులో చిప్ అమర్చే తొలి పరీక్ష విజయవంతమైందని ఎలాన్ మస్క్ ప్రకటించారు. చిప్‌ను అమర్చిన వ్యక్తి ఆరోగ్యం మెరుగుపడుతున్నదని ప్రపంచ కుబేరుడు చెప్పారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా పోస్టు ద్వారా వెల్లడించారు.
గతేడాది మేలో మానవ మెదడులో చిప్‌ను అమర్చేందుకు అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ ఆమోదం తెలిపింది. ప్రారంభ ఫలితాలు చాలా ప్రోత్సాహకరంగా ఉన్నాయని ఎలాన్ మస్క్ వెల్లడించారు. న్యూరాలింక్ చిప్‌ను ఇప్పటికే పందులు, కోతుల్లో విజయవంతంగా పరీక్షించారు. ఈ చిప్ అత్యంత సురక్షితమైనదని, విశ్వసనీయమైందని న్యూరాలింక్ నిపుణులు పేర్కొంటున్నారు. చిప్ సహాయంతో ఓ కోతి పాంగ్ వీడియో గేమ్‌ను ఆడినట్లు నిపుణులు చెప్పారు.
ఏమిటీ ఈ న్యూరాలింక్..?
న్యూరాలింక్ అనేది 2016 సంవత్సరంలో కొంతమంది శాస్త్రవేత్తలు, ఇంజినీర్లతో కలిసి బిలియనీర్ ఎలోన్ మస్క్ ప్రారంభించిన స్టార్టప్. మానవ పుర్రెలో అమర్చగలిగే మెదడు చిప్ ఇంటర్‌ఫేస్‌లను రూపొందించడానికి న్యూరాలింక్ పనిచేస్తుంది. ఈ చిప్స్ సహాయంతో నడవలేని, మాట్లాడలేని, చూడలేని వికలాంగులు మళ్లీ కొంత వరకు మెరుగైన జీవితాన్ని పొందనున్నారు. చిప్ సహాయంతో, కంప్యూటర్లు లేదా ఫోన్‌ల వంటి పరికరాలకు నాడీ సంకేతాలను ప్రసారం చేస్తారు.
అయితే మస్క్ కంపెనీ కూడా విమర్శలు ఎదుర్కొంటోంది. వాస్తవానికి, కంపెనీ ఇంతకుముందు ల్యాబ్‌లో జంతువులపై చిప్ పరీక్షను నిర్వహించింది, దీనికి కంపెనీ తీవ్ర విమర్శలను ఎదుర్కొంది. 2022 సంవత్సరంలో కంపెనీ అమెరికా కేంద్ర విచారణను కూడా ఎదుర్కోవలసి వచ్చింది. టెస్టింగ్ సమయంలో కంపెనీ 1500 జంతువులను చంపిందని, వీటిలో ఎలుకలు, కోతులు, పందులు ఉన్నాయని ఆరోపణలు వచ్చాయి. అయితే, కంపెనీ ఆరోపణలను ఖండించింది.
ఎలా పని చేస్తుంది..
ఎనిమిది మీటర్ల వ్యాసం కలిగి ఎన్1 చిప్‌ను మెదడులో ఎన్1 అనే చిప్‌ను అమరుస్తారు. దాంట్లో సన్నటి ఎలక్ట్రోడ్లు ఉంటాయి. ఇవి ఎంత సన్నగా ఉంటాయంటే.. వెంట్రుకతో పోలిస్తే వాటి మందం 20వ వంతు మాత్రమే ఉంటుంది. పుర్రెలో చిన్న భాగాన్ని తొలగించి అక్కడ ఎన్1 చిప్‌ని అమరుస్తారు. ఈ చిప్‌నకు ఉండే సన్నటి ఎలక్ట్రోడ్లను మెదడులోకి చొప్పింపజేస్తారు. ఈ చిప్‌లో ఉండే మూడువేలకుపైగా ఎలక్ట్రోడ్లను మెదడులోని ముఖ్యమైన భాగాలకు చేరువగా ప్రవేశపెడతారు.
ఎలక్ట్రోడ్లు మెదడులోని న్యూరాన్ల మధ్య ప్రసారమవుతున్న సందేశాలను గుర్తించి చిప్‌నకు పంపుతుంటాయి. ఒక చిప్‌లోని ఎలక్ట్రోడ్లు వెయ్యి న్యూరాన్ల చర్యలను పరిశీలిస్తాయి. మొత్తం మీద ఒక వ్యక్తిలోకి పది చిప్‌లను ప్రవేశపెట్టొచ్చు. చిప్ ఇన్‌స్టాల్ అయ్యాక బ్రెయిన్-కంప్యూటర్ ఇంటర్‌ఫేస్ మెదడు నుంచి విద్యుత్ సంకేతాలను అందుకోవడం, పంపడం, ప్రేరేపించడం వాటిని కంప్యూటర్లు విశ్లేషించగలిగేలా అల్గారిథమ్‌గా మారుస్తూ ఉంటుంది.
363 మిలియన్ డాలర్ల పెట్టుబడి..
అయితే, మనిషి సామర్థ్యాలను ఉత్తేజం చేయడం, పార్కిన్సన్స్ తదితర నాడీ సంబంధిత వ్యాధులకు చికిత్స ప్రధాన లక్ష్యాలుగా న్యూరాలింక్ ప్రయోగాలు చేపడుతుందని పేర్కొంది. మనుషులు, కృత్రిమ మేధస్సు మధ్య సహజీవన సంబంధాన్ని సాధించడం ఓ ఆశయంగా ఉందని గతంలో న్యూరాలింక్ చెప్పింది. కాలిఫోర్నియా కేంద్రంగా కార్యకలాపాలు కొనసాగిస్తున్న ‘న్యూరాలింక్’ కంపెనీలో 400పైచీలుకు నిపుణులు ఇందులో పని చేస్తున్నారు.
ఈ స్టార్టప్ ఇప్పటికే ప్రయోగాల కోసం 363 మిలియన్ డాలర్ల నిధులు సేకరించి ప్రయోగాలను చేపడుతున్నది. న్యూరాలింక్ మాత్రమే కాకుండా మరికొన్ని కంపెనీలు సైతం ఈ తరహా ప్రయోగాలు చేపడుతున్నాయి. ఆస్ట్రేలియాకు చెందిన సింక్రాన్ అనే సంస్థ 2022లోనే అమెరికాకు చెందిన ఓ వ్యక్తికి ఈ తరహా చిప్‌ను అమర్చి వార్తల్లో నిలిచింది. అయితే న్యూరాలింక్ తరహాలో తాము మనిషి పుర్రెకు కోతలు పెట్టలేదని కంపెనీ స్పష్టం చేసింది.