విధాత: కాంగ్రెస్ పార్టీకి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి (Kiran Kumar Reddy) రాజీనామా చేశారు. ఈ మేరకు పార్టీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే (Mallikharjuna Kharge)కు శనివారం సాయంత్రమే ఆయన లేఖ పంపారు. కిరణ్‌కుమార్‌రెడ్డి 1989 సాధారణ ఎన్నికల్లో పోటీ చేసి మొదటి సారి గెలుపొందారు.
తర్వాత 1994లో ఓడిపోయినా.. 1999, 2004, 2009 ఎన్నికల్లో వరుసగా గెలిచారు. 2004లో ప్రభుత్వ చీఫ్ విప్‌గా, 2009లో అసెంబ్లీ స్పీకర్ (Assembly Speaker)గా ఎన్నికయ్యారు. అనంతరం 2014 ఎన్నికల వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేశారు.
కాంగ్రెస్ అధిష్ఠానం తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకోవడంతో ఆ బిల్లుపై అసెంబ్లీలో చర్చ జరిగి మూజువాణి ఓటుతో తిరస్కరించింది. అయినా అప్పటి కేంద్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం లోక్‌సభలో ఆ బిల్లును ప్రవేశపెట్టి ఆమోదించింది. అప్పటివరకు లాస్ట్ బాల్ మిగిలే ఉన్నదని అన్న నల్లారి సీఎం పదవికి, కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. ఆ తర్వాత సమైక్యాంధ్ర పేరుతో పార్టీ పెట్టి 2014 ఎన్నికల్లో పోటీ కూడా చేశారు.
మళ్లీ రెండు రాష్ట్రాలను తిరిగి కలుపుతామని అన్న ఆయన 2014 ఎన్నికల అనంతరం రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. ఇటీవల బాలకృష్ణ వ్యాఖ్యాతగా అన్ స్టాపబుల్‌లో బీఆర్ఎస్ ఎంపీ సురేశ్‌రెడ్డితో కలిసి కనిపించారు.
ఆయన మళ్లీ ప్రత్యక్ష రాజకీయాల్లోకి రానున్నారని వార్తలు వస్తున్న సమయంలోనే ఆయన కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. త్వరలో కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రధాని మోడీ, కేంద్ర మంత్రి అమిత్ షాతో భేటీ అవుతారని సమాచారం. దీంతో ఆయన కాషాయ తీర్థం పుచ్చుకుంటున్నారనేది స్పష్టమైంది.