ప్రజాభవన్ గేట్లను ఢీ కొట్టిన రోడ్డు ప్రమాదంలో బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ పేరును కూడా పోలీసులు ఎఫ్‌ఐఆర్‌లో చేర్చారు. షకీల్ కుమారుడు రహిల్ దుబాయ్ పారిపోయేందుకు 10 మంది సాయం చేసినట్లుగా అధికారులు గుర్తించారు. రహిల్‌కు సాయం చేసిన ఇద్దరిని పంజాగుట్ట పోలీసులు అరెస్ట్ చేశారు. మరో ముగ్గురు పారిపోయినట్లుగా అధికారులు గుర్తించారు. ఇప్పటికే రహిల్‌పై అధికారులు ఎల్‌వోసీ జారీ చేసిన విషయం తెలిసిందే.
దుబాయ్‌లో ఉన్న రహిల్‌ను రప్పించేందుకు అధికారులు ముమ్మర ప్రయత్నాలు చేపట్టారు. అటు హైకోర్టు సైతం రహిల్‌ను అరెస్టు చేయవద్దంటు సూచించినప్పటికి అతను ఈనెల 17న పోలీసుల ముందు విచారణకు హాజరుకావాలని ధర్మాసనం ఆదేశించింది. అలాగే పంజాగుట్ట కారు ప్రమాద కేసు వివరాలు సమర్పించాలని తెలిపింది. తదుపరి విచారణను హైకోర్టు ఈనెల 24కు వాయిదా వేసింది. గతేడాది డిసెంబర్ 24న ఆదివారం రాత్రి అతివేగంగా వచ్చిన బీఎండబ్ల్యూ కారు ప్రజాభవన్ వద్ద బారీకేడ్లను ఢీ కొట్టింది. ఆ సమయంలో కారులో ఇద్దరు యువకులతో పాటు ఇద్దరు యువతులు ఉన్నట్లు సమాచారం.
కారు బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు రహిల్‌కు చెందినదిగా పోలీసులు గుర్తించారు. ప్రమాద సమయంలో రహిల్ కారు నడిపినట్లు పోలీసులు నిర్ధారించారు. అయితే తొలుత ఈ కేసులో కారు నడిపింది తానేనంటూ డ్రైవర్ లొంగిపోయాడు. దీనిపై విచారణ చేసిన పోలీసు ఉన్నతాధికారులు కేసును తప్పుదో పట్టించారని భావించి పంజాగుట్ట ఇన్‌స్పెక్టర్‌పై వేటు వేసింది.