BJP to Congress
విధాత: పొలిటికల్ లీడర్లు ఒక పార్టీ నుంచి మరో పార్టీలో చేరే సందర్భంలో తమ బలాన్ని నిరూపించు కునేందుకు చాలా రకాల ప్రయత్నాలు చేస్తుంటారు. తన బలగాన్ని అంతా వెంటేసుకుని, భారీ కాన్వాయ్‌లో బయల్దేరి.. తన బలాన్ని ప్రదర్శించుకుంటారు.
ఆ మాదిరిగానే ఓ నాయకుడు కూడా తన సొంతగూటికి చేరేందుకు భారీ కాన్వాయ్‌తో బయల్దేరారు. 300 కిలోమీర్ల మేర 400 కార్ల కాన్వాయ్‌తో హడావుడి సృష్టించారు. మధ్యప్రదేశ్‌లోని శివ్‌పురి నుంచి రాజధాని భోపాల్ వరకు సైరన్లు మోగించుకుంటూ వెళ్లారు.
మధ్యప్రదేశ్‌కు చెందిన బైజనాథ్ సింగ్ 2020లో ప్రముఖ నేత జ్యోతిరాధిత్య సింధియాతో కలిసి కాంగ్రెస్ పార్టీని వీడి భారతీయ జనతా పార్టీలో చేరారు. వీరి తిరుగుబాటుతో మధ్యప్రదేశ్‌లోని కమల్‌నాథ్ ప్రభుత్వం కుప్పకూలింది. అనంతరం శివరాజ్ సింగ్ చౌహాన్ నేతృత్వంలో భారతీయ జనతా పార్టీ తమ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.
తిరుగుబాటుకు నాయకత్వం వహించిన సింధియానేమో ఇప్పుడు కేంద్ర మంత్రిగా కొనసాగుతున్నారు. ఇక బైజనాథ్ సింగ్ ఈ ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ కోసం గట్టిగా ప్రయత్నిస్తున్నారు. కానీ ఆయనకు బీజేపీ టికెట్ ఇచ్చే పరిస్థితి లేదు.
దీంతో మళ్లీ సొంతగూటికి(కాంగ్రెస్) చేరుకున్నారు. మాజీ ముఖ్యమంత్రి కమల్‌నాథ్, సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ సమక్షంలో బైజనాథ్ సింగ్ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. బైజనాథ్‌తో పాటు 15 మంది జిల్లా స్థాయి నేతలు కూడా హస్తం పార్టీలో చేరారు.