జైలులో మగ్గుతూ లా చదివిన ఖైదీ.. తన కేసును వాదించుకుని నిర్దోషిగా బయటకు
దేశంలో చాలా మంది నిరపరాధులు రకరకాల కారణాల చేత జైళ్ల (Jails) లోనే మగ్గిపోతూ ఉంటారు

దేశంలో చాలా మంది నిరపరాధులు రకరకాల కారణాల చేత జైళ్ల (Jails) లోనే మగ్గిపోతూ ఉంటారు. కోర్టులకు వెళ్లడానికి చాలా మందికి డబ్బులు లేకపోవడం, కోర్టు వ్యవహారాల పట్ల అవగాహన లేకపోవడం దీనికి ప్రధాన కారణాలు. ఇలానే తనకు సంబంధం లేని కేసులో జైలు పాలైన ఓ వ్యక్తి.. తొలుత దిగాలు పడినా తర్వాత తేరుకున్నాడు. తన కేసును తానే వాదించుకోవడానికి లా చదివి (Prisoner Studied Law in Jail) నిర్దోషిత్వాన్ని నిరూపించుకున్నాడు.
ఉత్తర్‌ప్రదేశ్ (Uttar Pradesh) కు చెందిన అమిత్ చౌధురి కథే ఇదంతా. ఇతడిది బాఘ్‌పట్‌లోని కిర్తాల్ గ్రామానికి చెందిన ఓ రైతు కుటుంబం. అప్పటి అందరి కుర్రాళ్లలాగే ఆర్మీలో చేరాలని కలలు కనేవాడు. అయితే అతడి కలలన్నీ కల్లలయ్యే ఘటన 2011లో అతడికి 18 ఏళ్లు ఉన్నపుడు జరిగింది. కొంత మంది దుండగులు మీరట్ నగరంలో ఇద్దరు కానిస్టేబుల్స్‌ను హత్య చేసి వారి నుంచి రైఫిల్స్ లాక్కుని పారిపోయారు. అమిత్ అప్పుడు ఆ సమీపంలోనే ఉండటంతో అతడికి సంబంధం లేకపోయినా 17 మంది నిందితుల జాబితాలో ఇతడి పేరునూ చేర్చారు.
ఆ ఘటన సంచలనం సృష్టించడంతో అప్పటి సీఎం మాయావతి నిందితులను వెంటనే అరెస్టు చేసి రౌడీషీట్ తెరవాలని ఆదేశించారు. దీంతో జైలుపాలైన అమిత్.. సుమారు రెండేళ్ల పాటు అక్కడే ఉండిపోయాడు. ఈ క్రమంలో తన ఆర్మీ కల ముగిసిపోయినందుకు తొలుత కుంగిపోయినా తర్వాత తేరుకున్నాడు. ముజఫర్‌నగర్ జైలులోని పెద్ద పెద్ద పేరు మోసిన గూండాలు, డాన్‌లు తమ తమ బృందాల్లో చేరాలని ప్రలోభాలకు గురి కాకుండా లా చదవడం ప్రారంభించాడు. జైలు అధికారులు కూడా ఇతడి చిత్తశుద్ధిని గమనించి వేరుగా చిన్న బ్యారక్‌ను కేటాయించారు.
2013లో బెయిల్‌పై విడుదలైన తర్వాత బీఏ, ఎల్ఎల్‌బీ, ఎల్ఎల్ఎంలను పూర్తి చేసిన అమిత్.. తాజాగా తను సంపాదించిన జ్ఞానంతో తన కేసును తానే వాదించుకున్నాడు. పోలీసులు తాను దోషిని అని నిర్ధారించేందుకు ఎలాంటి బలమైన ఆధారాలనూ సేకరించలేకపోయారని కోర్టుకు తెలిపాడు, అంతే కాకుండా కానిస్టేబుల్స్ నుంచి సేకరించిన రైఫిల్స్‌నూ గుర్తించలేదని వివరించాడు.
కాగా.. వాదనలు విన్న కోర్టు అమిత్ సహా 13 మందిని నిర్దోషులుగా ప్రకటించింది. బలమైన సాక్ష్యాలను సమర్పించడంలో ప్రాసిక్యూషన్ విఫలమైందని అభిప్రాయపడింది. ఈ కేసులో సూత్రధారులుగా భావిస్తున్న సుమిత్ కైల్ 2013లో ఎన్‌కౌంటర్‌లో చనిపోగా నీతు అనే వ్యక్తికి ఇప్పటికే యావజ్జీవం పడింది. ధర్మేంద్ర క్యాన్సర్‌తో చనిపోయాడు. దీంతో కేసు ముగిసిపోయినట్టేనని భావిస్తున్న అమిత్.. క్రమినల్ జస్టిస్ లో పీహెచ్‌డీ చేయడానికి సిద్ధపడుతున్నాడు.