బంగారం ధర రూ.60వేలపైనే
-ఈ ఏడాది చేరవచ్చన్న అంచనాలు -ఇప్పటికే దేశ, విదేశీ మార్కెట్లలో పరుగులు పెడుతున్న గోల్డ్ రేట్లు విధాత: బంగారం ధరలు ఈ ఏడాది సరికొత్త రికార్డులను సృష్టించవచ్చని మార్కెట్ నిపుణులు అంటున్నారు. ఈ క్రమంలోనే దేశీయ మార్కెట్‌లో 24 క్యారెట్ పసిడి 10 గ్రాముల ధర రూ.60,000 పైనే పలుకుతుందని అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం బహిరంగ మార్కెట్‌లో తులం విలువ రూ.58,000 పైనే ఉన్నది. ఆభరణాల బంగారం ధరలు కూడా గత రెండు వారాల్లో భారీగానే పెరిగిన […]

-ఈ ఏడాది చేరవచ్చన్న అంచనాలు
-ఇప్పటికే దేశ, విదేశీ మార్కెట్లలో పరుగులు పెడుతున్న గోల్డ్ రేట్లు
విధాత: బంగారం ధరలు ఈ ఏడాది సరికొత్త రికార్డులను సృష్టించవచ్చని మార్కెట్ నిపుణులు అంటున్నారు. ఈ క్రమంలోనే దేశీయ మార్కెట్‌లో 24 క్యారెట్ పసిడి 10 గ్రాముల ధర రూ.60,000 పైనే పలుకుతుందని అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం బహిరంగ మార్కెట్‌లో తులం విలువ రూ.58,000 పైనే ఉన్నది. ఆభరణాల బంగారం ధరలు కూడా గత రెండు వారాల్లో భారీగానే పెరిగిన విషయాన్ని గుర్తుచేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే వచ్చే 2-3 నెలల్లో ధర రూ.60,000 దాటుతుందన్న అభిప్రాయాల్ని వ్యక్తం చేస్తున్నారు.
గ్లోబల్ మార్కెట్‌లో రయ్.. రయ్
అంతర్జాతీయ మార్కెట్‌లో పుత్తడి ధరలు అంతకంతకూ పెరుగుతున్నాయి. ప్రస్తుతం ఔన్సు ధర 1,915 డాలర్లుగా ఉన్నది. ఈ క్రమంలో ఈ ఏడాది 2,050 డాలర్లను తాకుతుందని అమెరికాకు చెందిన ప్రముఖ ఫండమెంటల్ రిసెర్చ్ సంస్థ గోయెరింగ్-రోజెన్స్‌వాగ్ మేనేజింగ్ పార్ట్‌నర్ లీ గోయెరింగ్ ఓ వార్తా సంస్థతో అన్నారు. ఇదే జరిగితే భారతీయ మార్కెట్‌లోనూ ఆ ప్రభావం తప్పక కనిపిస్తుందని అటు పరిశ్రమ, ఇటు మార్కెట్ వర్గాలు పేర్కొంటున్నాయి.
స్టాక్ మార్కెట్ల ఒడిదుడుకులతోనే..
ఆర్థిక మాంద్యం భయాలు, రష్యా-ఉక్రెయిన్‌ల మధ్య యుద్ధం, ఆయా దేశాల్లో పెరిగిపోతున్న రక్షణాత్మక ధోరణులు స్టాక్ మార్కెట్లను తీవ్ర ఒడిదుడుకుల్లోకి నెడుతున్నాయి. ప్రస్తుత దేశ, విదేశీ స్టాక్ మార్కెట్ల కదలికలే ఇందుకు నిదర్శనం. ఈ నేపథ్యంలోనే మదుపరులు తమ పెట్టుబడుల రక్షణార్థం బంగారం వైపు చూస్తున్నారు. దీంతో పుత్తడి ధరలు వేగంగా ఎగబాకుతున్నాయని నిపుణులు విశ్లేషిస్తున్నారు. పరిస్థితులు ఇలాగే ఉంటే పసిడి ధరలు అంచనాలను మించి రికార్డు స్థాయిల్లో పరుగులు పెట్టవచ్చని అంటున్నారు.