విధాత: ప్రజా సమస్యలపై దృష్టి మరల్చేందుకు టీఆర్ఎస్-బీజేపీలు కలిసి బిల్లుల ఆమోదంపై రాజకీయాలు చేస్తున్నాయని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆరోపించారు. గవర్నర్ కూడా ప్రతి విషయాన్ని రాజకీయం చేయడం సరికాదని తెలిపారు. రాజ్యాంగ వ్యవస్థలు ఉన్నాయి. 75 సంవత్సరాల నుంచి అవి పనిచేస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఏవైనా బిల్లులు ఆమోదించుకోవాలనుకుంటే గవర్నర్ వాటిపై ఏమైనా అభ్యంతరాలు వ్యక్తం చేస్తే వాటిని నివృత్తి చేయాలి తప్పేమున్నదని అన్నారు.
ప్రభుత్వం నుంచి ఏదైనా ప్రతిపాదన వచ్చినప్పుడు గవర్నర్‌కు ఏదైనా అంశంపై అనుమానాలు ఉంటే నివృత్తి చేయడం రాష్ట్ర ప్రభుత్వ బాధ్యత అని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వారి బాధ్యతను నిర్వర్తించ కుండా వాళ్ల చిల్లర రాజకీయాల కోసం దాన్ని చర్చకు పెట్టి నిజమైన ప్రజాసమస్యలను పక్కదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు. ఈ చిల్లర పంచాయితీలకు మీడియా కూడా అంత ప్రాధాన్యం ఇవ్వడం సరి కాదన్నారు. ప్రజలు తీవ్రమైన సమస్యలతో కొట్టు మిట్టాడుతున్నారని అన్నారు.
ఉద్యోగ నోటిఫికేషన్లు రాక నిరుద్యోగులు చనిపోతున్నారు. ఇచ్చిన నోటిఫికేషన్లలో సరైన నిబంధనలు పాటించడం లేదని నిరుద్యోగులు వాపోతున్నారు అవేవీ కాదని ఈ చిల్లర పంచాయీతీలకు మీడియా అతిగా ప్రాధాన్యం ఇవ్వడం కరెక్టు కాదన్నారు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఈ గాడిద వేశాలు మానాలి అన్నారు. గవర్నర్ కూడా పారదర్శకంగా ఉండాలి. ప్రతి అంశాన్నీ రాజకీయ కోణంలో చూడాల్సిన అవసరం లేదన్నారు.
బీజేపీ నాయకులు సన్నాసులు అని నిన్న మొన్న వీడియోల్లో వచ్చాయి. వాళ్లు సన్నాసులయ్యారు కాబట్టి వాళ్ల బాధ్యత కూడా గవర్నర్ నిర్వర్తించాలనుకుంటే కష్టమన్నారు. బండి సంజయ్, కిషన్‌రెడ్డి పాత్ర గవర్నర్ తమిళ్ సై పోషించాలనుకోవడం సమంజసం కాదన్నారు.
అదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వం పరిపాలన నిర్వహించడానికి రాజ్యాంగబద్ధమైన సంస్థలను గౌరవించి అనుమానాలను నివృత్తి చేసి, ఆ బిల్లులను ఆమోదింపజేసుకుని ప్రజలకు పరిపాలన అందించాలని రేవంత్ సూచించారు. గవ్నర్‌కు వచ్చిన నష్టం లేదు, కేసీఆర్‌కు వచ్చిన కష్టం లేదు. ఇద్దరు బాగానే ఉన్నారు. వీళ్లద్దరు కలిసి ప్రజలను హింసిస్తున్నారు. కాబట్టి ఇలాంటి చిల్లర రాజకీయాలు బీజేపీ, టీఆర్ఎస్ వదిలి పెట్టాలని ఆయన స్పష్టం చేశారు.