Kanpur | ప్ర‌భుత్వ టీచ‌ర్ ని గ‌దిలో బంధించి నిప్పటించిన దుండ‌గులు

యూపీలోని కాన్పూర్ లో దారుణం జ‌రిగింది. పంకీ ప్రాంతంలో 48 ఏండ్ల ప్రభుత్వ కళాశాల అధ్యాపకుడిని గదిలో బంధించి దుండ‌గులు నిప్పంటించడంతో సజీవ ద‌హ‌న‌మ‌య్యాడు.

  • Publish Date - January 29, 2024 / 06:43 AM IST
  • యూపీలోని కాన్పూర్‌లో దారుణ ఘ‌ట‌న‌


Kanpur | విధాత‌: ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని కాన్పూర్ జిల్లాలో ఆదివారం దారుణం జ‌రిగింది. పంకీ ప్రాంతంలో 48 ఏండ్ల ప్రభుత్వ కళాశాల అధ్యాపకుడిని గదిలో బంధించి దుండ‌గులు నిప్పంటించడంతో సజీవ ద‌హ‌న‌మ‌య్యాడు. పోలీసులు కేసు ద‌ర్యాప్తు జరుపుతున్నారు.


పోలీసుల వివ‌రాల ప్ర‌కారం.. ఉపాధ్యాయుడు దయారామ్ ఆదివారం మ‌ధ్యాహ్నం తన తమ్ముడు అనూజ్‌కు ఫోన్ చేసి సంజీవ్ అనే వ్య‌క్తితోపాటు అతడి సహాయకులు తనను పత్రసా గ్రామంలోని ఒక గదిలో బంధించి నిప్పంటించారని చెప్పారు. వెంట‌నే అనూజ్ ఈఘ‌ట‌న‌పై పోలీసుల‌కు ఫిర్యాదు చేశాడు. పోలీసులతో స‌హా ఆయ‌న సంఘటనా స్థలానికి చేరుకున్నాడు. వారు తలుపు తెరిచి చూడ‌గా దయారామ్ తీవ్ర కాలిన గాయాలతో అప్ప‌టికే మరణించాడు. ప్రాథ‌మిక ఆధారాల ఆధారంగా పోలీసులు నిందితుడైన సంజీవ్‌ను అదుపులోకి తీసుకున్నారు. డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (వెస్ట్) విజయ్ ధుల్ ఘటనా స్థలాన్ని పరిశీలించారు.


‘‘ఒక గదిలో కాలిపోయిన టీచర్ మృతదేహం లభ్యమైంది. అతని సోదరుడు అనూజ్ తన కోడలు, ఆమె మగ స్నేహితుడితో సహా నలుగురిపై హత్య ఆరోపణలు చేశాడు ”అని విజ‌య్‌ధుల్ తెలిపారు. ఈ దారుణ ఘ‌ట‌న వెనుక వ్య‌క్తిగ‌త కార‌ణాలు ఉన్నాయా? ఇంకేమైనా కార‌ణాలు ఉన్నాయా? అనే కోణాల్లో కేసు ద‌ర్యాప్తు చేస్తున్నట్టు పేర్కొన్నారు.