Gurugram | హంతకుడిని పట్టించిన పాలిథిన్‌ బ్యాగ్‌.. గురుగావ్‌లో హత్య, విశాఖలో లింకు

Gurugram చాలా కేసులలో హంతకుడు ఎంత తెలివైనోడైనా.. ఎక్కడో ఒక చోట తప్పు చేస్తాడు! సరైనోడు దర్యాప్తు చేస్తే.. దెబ్బకు దొరికిపోతాడు. ఇది అలాంటి కేసే! గురుగావ్‌లో హత్య జరిగితే.. విశాఖపట్నంలోని ఒక ఫ్యాక్టరీలో తయారైన పాలిథిన్‌ బ్యాగు.. హంతకుడిని పట్టిచ్చింది. విధాత: గురుగావ్‌ (Gurugram) లోని మానేసర్‌ వద్ద దహనమైపోయిన స్థితిలో కనిపించిన యువతి మృతదేహం కేసును పోలీసులు అక్కడ లభించిన ఒక పాలిథిన్‌ బ్యాగ్‌ సహాయంతో ఛేదించారు. హంతకుడిని పట్టుకుని.. తమదైన శైలిలో విచారించగా.. […]

Gurugram | హంతకుడిని పట్టించిన పాలిథిన్‌ బ్యాగ్‌.. గురుగావ్‌లో హత్య, విశాఖలో లింకు

Gurugram

చాలా కేసులలో హంతకుడు ఎంత తెలివైనోడైనా.. ఎక్కడో ఒక చోట తప్పు చేస్తాడు! సరైనోడు దర్యాప్తు చేస్తే.. దెబ్బకు దొరికిపోతాడు. ఇది అలాంటి కేసే! గురుగావ్‌లో హత్య జరిగితే.. విశాఖపట్నంలోని ఒక ఫ్యాక్టరీలో తయారైన పాలిథిన్‌ బ్యాగు.. హంతకుడిని పట్టిచ్చింది.

విధాత: గురుగావ్‌ (Gurugram) లోని మానేసర్‌ వద్ద దహనమైపోయిన స్థితిలో కనిపించిన యువతి మృతదేహం కేసును పోలీసులు అక్కడ లభించిన ఒక పాలిథిన్‌ బ్యాగ్‌ సహాయంతో ఛేదించారు. హంతకుడిని పట్టుకుని.. తమదైన శైలిలో విచారించగా.. అతడు నిజాలన్నీ కక్కేశాడు. మృతదేహం లభ్యమైన ప్రాంతాన్ని పూర్తిగా పరిశీలించిన క్లూస్‌ టీమ్‌.. ఒక పాలిథిన్‌ బ్యాగును గుర్తించింది.

అది విశాఖపట్నంలో తయారైనదిగా దానిపై ఉన్న కంపెనీ పేరును బట్టి గుర్తించారు. ఆ కంపెనీ ఆఫీసులో వాకబు చేస్తే.. తాము ఈ బ్యాగులను కేవలం నావికాదళం కోసమే తయారు చేస్తామని చెప్పారు. ఈ ఒక్క క్లూ ఆధారంగా దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. హంతకుడు జితేందర్‌ శర్మ (35) అని గుర్తించారు. అతడు గతేడాది వరకు నావికాదళంలో వంటవాడిగా పనిచేసి.. రిటైర్‌ అయ్యాడు.

అతడిని అరెస్టు చేసిన పోలీసులు విచారించగా.. తన భార్య సోనియా (28)ను ఏప్రిల్‌ 21న హత్య చేశానని ఒప్పుకొన్నాడు. మృతదేహాన్ని తను వంటలకు వాడే కత్తితో ముక్కలు ముక్కలు చేసి నగరంలోని వేర్వేరు ప్రాంతాల్లో పడేశాడు. చేతులు ఖేర్కీ దౌలాలో, తల కేఎంపీ ఎక్స్‌ప్రెస్‌ వే సమీపంలోని చెరువులో లభించాయి.

అక్రమసంబంధాన్ని ప్రశ్నించినందుకు హత్య జితేందర్‌కు జార్ఖండ్‌కు చెందిన ఒక యువతితో అక్రమ సంబంధం ఉన్నది. సోనియా ఆ విషయాన్ని పసిగట్టింది. దీంతో ఆమెను అంతమొందించాలని జితేందర్‌ శర్మ ప్లాన్‌ చేశాడు. వీరికి 8 ఏళ్ల కుమార్తె ఉన్నది.

Gurugram
Gurugram

హత్య ఇలా వెలుగులోకి..

కుక్రోలా గ్రామానికి చెందిన ఒక వ్యక్తికి మానెసర్‌లోని పంచ్‌గావ్‌ చౌక్‌లో 8 ఎకరాల స్థలం ఉన్నది. అక్కడ ఆయన ఒక గదిని నిర్మించాడు. అది ఖాళీగా ఉంటున్నది. ఏప్రిల్‌ 21వ తేదీన ఆ గదిలో నుంచి పొగలు రావడాన్ని సమీప ఇళ్లలోని వారు గమనించి.. సదరు ఓనర్‌కు సమాచారం ఇచ్చాడు. ఆయన వచ్చి, చూడగా ఆ గదిలో సగం కాలిన స్థితిలో మొండెం కనిపించింది.

వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు. అక్కడ పోలీసులకు విశాఖ పట్నంలో తయారైన పాలిథిన్‌ బ్యాగ్‌ కనిపించింది. పోలీసులకు అదొక్కటే క్లూ లభించింది. దాంతో ఇటీవలి కాలంలో తప్పిపోయినట్టు వచ్చిన ఫిర్యాదులను తిరగతోడారు.

అందులో ఒక ఫిర్యాదు పోలీసుల దృష్టిని ఆకర్షించింది. తన భార్య సోనియా కనిపించడం లేదంటూ జితేందర్‌ శర్మ పేరుతో ఏప్రిల్‌ 21న ఫిర్యాదు కనిపించింది. జితేందర్‌ శర్మ గతంలో నావికాదళంలో పని చేశాడని దర్యాప్తు అధికారులు గుర్తించారు. గత కొన్ని రోజుల సీసీటీవీ పుటేజీని పరిశీలించారు.

దాదాపు 60 ఫుటేజీలు పరిశీలిస్తే.. ఒక దాంట్లో జితేందర్‌శర్మ మానేసర్‌లో ఒక బ్యాక్‌ప్యాక్‌, ఒక ట్రాలీబ్యాగ్‌తో కనిపించాడు. కాసేపటికి ఖాళీ సంచితో కనిపించాడు. ఇంటి దగ్గర సీసీటీవీ ఫుటేజీలు పరిశీలిస్తే.. ఎక్కడా సోనియా ఇంటి నుంచి బయటకు వచ్చినట్టు లేదు. దీంతో జితేందర్‌పై అనుమానం వచ్చిన పోలీసులు అతడిని ఏప్రిల్ 26న అరెస్టు చేసి విచారించగా.. తన నేరాన్ని ఒప్పుకొన్నాడు.

తనకు ఉన్న అక్రమ సంబంధం విషయంలో తమ మధ్య ఇటీవల గొడవలు జరుగుతున్నాయని జితేందర్‌శర్మ పోలీసులకు చెప్పాడు. సోనియాను చంపాలని రెండు వారాల క్రితమే ప్లాన్‌ చేసుకున్నట్టు వెల్లడించాడు. కనీసం హత్య చేశాన్న పాపభీతి కూడా అతడిలో కనిపించలేదని పోలీసులు తెలిపారు.

హత్య జరిగిన అనంతరం మొడేన్ని ఖాళీగా ఉన్నట్టు తాను గుర్తించిన ఒక గదిలోకి తీసుకెళ్లి.. రెండు డియోడరెంట్‌ బాటిళ్లను మృతదేహంపై పోసి.. తగులబెట్టాడు. ఇతర శరీర భాగాలు పడి ఉన్న ప్రాంతాలను పోలీసు జాగిలాలు గుర్తించాయి. నిందితుడిపై కేసులు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.