విధాత: తెలంగాణలో హంగ్ అసెంబ్లీ వస్తుందని… కాంగ్రెస్‌తో బీఆర్ఎస్ పొత్తు పెట్టుకోవచ్చు అంటూ కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి మండిపడ్డారు. నల్లగొండలో ఆయన మీడియాతో మాట్లాడుతూ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఎప్పుడు ఏం మాట్లాడుతాడో ఆయనకే తెలియదని ఎద్దేవా చేశారు.
కోమటిరెడ్డి వ్యాఖ్యలను పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు. హంగ్ వస్తుందని కోమటిరెడ్డి అబద్ధపు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. మంచి మెజారిటీతో తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో బిఆర్ఎస్ అధికారంలోకి రావడం ఖాయమని, ఇందులో ఎలాంటి సందేహం లేదని ధీమా వ్యక్తం చేశారు.
టికెట్ల కేటాయింపులు సర్వేల ప్రకారమే కేసీఅర్ నిర్ణయం ఉండొచ్చన్నారు. షెడ్యుల్ ప్రకారమే తెలంగాణలో ఎన్నికలు ఉంటాయని, ముందస్తు ఎన్నికలు రావన్నారు. వామపక్షాలతో పొత్తు ఉంటుందని భావిస్తున్నానని, పార్టీ నిర్ణయం ప్రకారమే తన కుమారుడు అమిత్ రెడ్డి రాజకీయ అడుగులు కొనసాగుతాయని తెలిపారు.
తెలంగాణ బడ్జెట్ సమావేశాలు సజావుగా సాగాయని, దేశంలో, రాష్ట్రాలలో నెలకొన్న తాజా పరిస్థితులన్ని సీఎం కేసీఆర్ ప్రసంగంలో ప్రస్ఫుటించాయన్నారు. సామాన్య ప్రజలకు, రైతులకు అర్థమయ్యే విధంగా సీఎం శాసనసభ ద్వారా దేశ పరిస్థితులను వివరించారన్నారు.
ద్రవ్య వినమయ బిల్లుపై సీఎం కేసీఆర్, మంత్రులు కేటీఆర్, హరీష్ రావు స్పష్టంగా మాట్లాడారన్నారు. ఆర్థిక పరిస్థితులు బాగుపడాలంటే వ్యవసాయ రంగం పునరుజ్జీవం పొందాలంటే కేసిఆర్ మార్గంలో నడవాలని దేశ ప్రజలు భావిస్తున్నారన్నారు.
తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న పథకాలు దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నాయన్నారు. సెస్సుల పేరుతో రాష్ట్రం నుండి 20 లక్షల కోట్ల రూపాయలు వసూలు చేసిన కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు నిధుల మంజూరులో సవతి ప్రేమ చూపిస్తుందని ఆరోపించారు.
కేంద్రం పారిశ్రామిక వేత్తలకు అనుకూలంగా పనిచేస్తుందే తప్పా, సామాన్య ప్రజలకు ఒరిగబెట్టిందేమి లేదని ఆరోపించారు. బిజెపి ఎన్ని కుట్రలు, కుతంత్రాలు చేసినా ప్రజలు వాస్తవ పరిస్థితిని తెలుసు కుంటున్నారన్నారు. తెలంగాణ భవిష్యత్ మొత్తం కేసీఆర్ చేతిలో మాత్రమే సురక్షితంగా ఉంటుందని, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ దండుపాళ్యం బ్యాచ్ వ్యాఖ్యలు ఆ పార్టీ నాయకులకే వర్తిస్తాయని గుత్తా విమర్శించారు.
ప్రతిపక్షాలను, మీడియాను అణచి వేయడానికి బీజేపీ కుట్ర చేస్తుందని, అందుకు బీబీసీ సంస్థపై నిర్వహించిన ఐటీ దాడులే నిదర్శనం అన్నారు. ప్రధాని మోడీ ప్రభుత్వ నిరంకుశ విధానాలకు వచ్చే ఎన్నికల్లో బీజేపీ మూల్యం చెల్లించక తప్పదు అన్నారు. జాతీయ రాజకీయాల్లో సీఎం కేసీఆర్ నాయకత్వంలో బీఆర్ఎస్ కీలక భూమిక పోషిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.