Haryana Violence | హర్యానా హింసాకాండ.. ఐదుగురు మృతి
Haryana Violence | తొమ్మిది మంది పోలీసు అధికారులకు గాయాలు నుహ్ జిల్లాలో కర్ఫ్యూ.. గురుగ్రామ్‌లో 144 సెక్షన్ కోచింగ్ సెంటర్‌లతో సహా అన్ని విద్యాసంస్థలు బంద్ హింసకు ఆధ్యుడు భజరంగ్ దళ్ నేత మోను మనేసర్ ఇద్దరి హత్య కేసులో ఆరు నెలలుగా పరారీలో మోను విధాత: హర్యానాలో విశ్వ హిందూ పరిషత్ (వీహెచ్‌పీ) చేపట్టిన యాత్ర కారణంగా తలెత్తిన హింసాకాండ మరింత తీవ్ర రూపం దాల్చింది. ఇప్పటిరకు ముగ్గురు హోంగార్డులుసహా ఐదుగురు మృత్యువాత పడ్డారు. […]

Haryana Violence |
- తొమ్మిది మంది పోలీసు అధికారులకు గాయాలు
- నుహ్ జిల్లాలో కర్ఫ్యూ.. గురుగ్రామ్‌లో 144 సెక్షన్
- కోచింగ్ సెంటర్‌లతో సహా అన్ని విద్యాసంస్థలు బంద్
- హింసకు ఆధ్యుడు భజరంగ్ దళ్ నేత మోను మనేసర్
- ఇద్దరి హత్య కేసులో ఆరు నెలలుగా పరారీలో మోను
విధాత: హర్యానాలో విశ్వ హిందూ పరిషత్ (వీహెచ్‌పీ) చేపట్టిన యాత్ర కారణంగా తలెత్తిన హింసాకాండ మరింత తీవ్ర రూపం దాల్చింది. ఇప్పటిరకు ముగ్గురు హోంగార్డులుసహా ఐదుగురు మృత్యువాత పడ్డారు. డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్, ముగ్గురు ఇన్‌స్పెక్టర్లు సహా మొత్తం తొమ్మిది మంది గాయపడ్డారు.
విస్తృతమైన హింసాకాండ నేపథ్యంలో, గురుగ్రామ్, ఫరీదాబాద్ జిల్లాల్లోని పాఠశాలలు, కళాశాలలు, కోచింగ్ సెంటర్‌లతో సహా అన్ని విద్యాసంస్థలు మంగళవారం బంద్ అయ్యాయి. సోమవారం విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో చేపట్టిన బ్రిజ్ మండల్ జలాభిషేక్ యాత్ర విధ్వంసానికి దారితీసిన సంగతి తెలిసిందే.
పోలీసు బృందం వాహనానికి నిప్పు
నుహ్ నుంచి ప్రారంభమై ఆందోళన గురుగ్రామ్, సోహ్నాతో సహా అనేక పొరుగు జిల్లాలకు వ్యాపించింది. శాంతిభద్రతలను అదుపులోకి తెచ్చేందుకు గురుగ్రామ్ నుంచి నుహ్‌కు వెళ్తున్న పోలీసు బృందం వాహనానికి ఆందోళనకారులు నిప్పు పెట్టారు. ప్రభుత్వ, ప్రయివేటు ఆస్తులపై రాళ్లతో దాడి చేసి విధ్వంసం సృష్టించారు. కాల్పులు కూడా చోటు చేసుకున్నాయి. ఈ హింసలో ముగ్గురు హోంగార్డులు చనిపోయారు.
ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే..
హర్యానాలో ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉన్నదని పోలీసులు అధికారులు వెల్లడించారు. మంగళవారం నుహ్, గురుగ్రామ్‌లలో ఇంటర్నెట్ సేవలను బంద్‌చేశారు. నుహ్, గురుగ్రామ్‌లలో 144 సెక్షన్ విధించారు. నుహ్, సోహ్నా, పరిసర జిల్లాల్లో పరిస్థితి అదుపులో ఉన్నది.
13 పారామిలిటరీ బలగాల కంపెనీలు అక్కడ మోహరించారు. మరో 6 కంపెనీలు త్వరలో చేరుకోనున్నా యి. ఫరీదాబాద్, పల్వాల్, గురుగ్రామ్‌లలో కర్ఫ్యూ విధించలేదు. ఈ జిల్లాలలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా 144 సెక్షన్ విధించారు. సోహ్నాలో త్వరలో శాంతి కమిటీ సమావేశం ప్రారంభమవుతుందని అధికారులు వెల్లడించారు.
ఆందోళనకు కేంద్ర బింధువు.. మోను మనేసర్ ఎవరంటే..
మోహిత్ యాదవ్ అలియాస్ మోను మనేసర్. రాజస్థాన్‌లోని భివానీలో ఫిబ్రవరిలో ఇద్దరు ముస్లింలను హత్య చేసిన కేసులో ప్రధాన నిందితుల్లో ఒకరు మోను మనేసర్. గత ఆరు నెలలుగా పరారీలో ఉన్నాడు. హర్యానాలోని భజరంగ్ దళ్‌కు చెందిన గోరక్షా దళ్ – గోరక్షక విభాగం అధిపతి మనేసర్. పశువుల అక్రమ రవాణాకు పేరుగాంచిన మేవాత్ ప్రాంతంలో ఇతడు అత్యంత చురుకైన కార్యకర్త.
ఒక వర్గాన్నితీవ్రంగా ప్రభావితం చేయగలిగిన వ్యక్తి. మనేసర్ గురుగ్రామ్‌లోని బజరంగ్ దళ్ జిల్లా కన్వీనర్ కూడా. మానేసర్ పోలీసు అధికారులు, కలెక్టర్లు, ఇతర ఉన్నతాధికారులు దిగిన ఫొటోలు గతంలో వెలుగులోకి వచ్చాయి. మనేసర్‌కు యూట్యూబ్ ఛానెల్ గోరక్షక బృందం వ్యవహారాలను చూపించేందుకు యూట్యూబ్ ఛానెల్ కూడా అతనికి ఉన్నది. దానికి లక్ష మంది సబ్‌స్కైబర్స్ ఉన్నారు.
ఆ ఛానెల్ ఇప్పుడు సోషల్ మీడియాలో కనిపించడం లేదు. పాలిటెక్నిక్ డిప్లొమా చదివిన మనేసర్.. కళాశాలలో రెండవ సంవత్సరంలో ఉండగా భజరంగ్ దళ్‌లో చేరాడు. ఆదివారం వీహెచ్‌పీ ‘శోభా యాత్ర సందర్భంగా మనేసర్ సోషల్ మీడియాలో పెట్టిన అభ్యంతరకరమైన వీడియో కారణంగానే ఈ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయని తెలుస్తున్నది.