Karimnagar | విధాత బ్యూరో, కరీంనగర్: బీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలకు నిరసనగా బిజెపి ఈరోజు కలెక్టర్ కార్యాలయాల ముందు చేపట్టనున్న నిరసన ప్రదర్శనలు దృష్టిలో ఉంచుకొని కరీంనగర్ కలెక్టర్ కార్యాలయం ముందు పోలీసులు పెద్ద ఎత్తున మొహరించారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా కలెక్టర్ ప్రధాన ద్వారం ముందు ముళ్ళకంచెలు ఏర్పాటు చేశారు.
కలెక్టర్ కార్యాలయం లోపల, బయట పెద్ద ఎత్తున పోలీసుల పహారా ఏర్పాటు చేశారు. హామీల అమలు, ప్రజా సమస్యల పరిష్కారంలో విఫలం, ప్రభుత్వ వైఫల్యాలను నిరసిస్తూ బిజెపి ఈనెల 23న అధికార పార్టీ శాసనసభ్యుల ఇళ్ళ ముందు నిరసనలు, 24న మంత్రుల ఇళ్ల ముందు ఆందోళనలు చేపట్టిన విషయం తెలిసిందే. రాష్ట్రంలోని అనేకచోట్ల మంత్రుల ఇళ్ల ముట్టడి ఉద్రిక్తతలకు దారి తీసిన నేపథ్యంలో పోలీసులు కలెక్టరేట్ కార్యాలయాల ముందు ఆందోళనకు ముందస్తుగానే భారీగా భద్రత ఏర్పాటు చేశారు.