అయ్యప్ప సొసైటీ – పర్వతనగర్ చౌరస్తాలో ట్రాఫిక్ నరకం
హైదరాబాద్‌లోని అయ్యప్ప సొసైటీ నుంచి బోరబండకు, పర్వతనగర్‌కు, వెళ్లే నాలుగు రోడ్ల కూడలి-గోదావరి కట్స్ వద్ద రోజూ ట్రాఫిక్ నరకం కనిపిస్తున్నది

- ట్రాఫిక్ అవసరాలకు అనుగుణంగా చౌరస్తా విస్తరణ ఏది?
- దృష్టిసారించని అధికారులు
విధాత: హైదరాబాద్‌లోని అయ్యప్ప సొసైటీ నుంచి బోరబండకు, పర్వతనగర్‌కు, మాధాపూర్‌లకు వెళ్లే నాలుగు రోడ్ల కూడలి-గోదావరి కట్స్ వద్ద రోజూ ట్రాఫిక్ నరకం కనిపిస్తున్నది. సాయంత్రం వేళల్లో ఆ చౌరస్తా దాటడానికి కనీసం అరగంట పడుతున్నది. మూసాపేటవైపు ఫ్లై ఓవర్ పూర్తికావడం, బోరబండకు కొత్తగా రోడ్డు వేయడంతో ట్రాఫిక్ మొత్తం ఈ చౌరస్తాకు మళ్లింది. మాధాపూర్ రోడ్డులో కంటే అయ్యప్ప సొసైటీ రోడ్డు రద్దీగా తయారయింది.
కాగా.. పెరిగిన ట్రాఫిక్ అవసరాలకు అనుగుణంగా చౌరస్తా విస్తరణ జరుగలేదు. ఫ్రీ లెఫ్ట్‌లకు అవకాశమే లేదు. మొత్తం వాహనాలు సిగ్నల్ కోసం ఎదురు చూడవలసి రావడంతో అర కిలోమీటర్ పొడవున వాహనాలు నిలిచిపోవలసి వస్తున్నది. ట్రాఫిక్ పోలీసులు ఉన్నా ఏమీ చేయలేని పరిస్థితి. ఈ చౌరస్తాలకు అన్ని వైపులా ఖాళీ స్థలాలే ఉన్నా రోడ్ల విస్తరణపై అధికారులు దృష్టి పెట్టడం లేదు. ఈ ప్రాంతంలో సెకెండ్ హాండ్ కార్ల షెడ్‌లు పెద్ద ఎత్తున వెలిశాయి.