అయోధ్య‌కు హైద‌రాబాదీ పాద‌యాత్ర‌

హైద‌రాబాద్‌కు చెందిన శ్రీ‌రాముడి భ‌క్తుడైన చల్లా శ్రీనివాస్ శాస్త్రి అయోధ్యకు పాద‌యాత్ర చేప‌ట్టారు.

  • Publish Date - January 10, 2024 / 09:11 AM IST
  • శ్రీ‌రాముడి కోసం బంగారు పాదుక‌ల‌తో
  • 7,200 కిలోమీటర్ల యాత్రకు శ్రీ‌కారం
  • రాముడి భ‌క్తుడైన శ్రీ‌నివాస‌శాస్త్రి
  • 64 ఏండ్ల వ‌య‌స్సులో సాహ‌స‌ యాత్ర
  • 15నాటికి అయోధ్యకు చేరుతా: శాస్త్రి

విధాత‌: హైద‌రాబాద్‌కు చెందిన శ్రీ‌రాముడి భ‌క్తుడైన చల్లా శ్రీనివాస్ శాస్త్రి అయోధ్యకు పాద‌యాత్ర చేప‌ట్టారు. 64 ఏండ్ల వ‌య‌స్సులో భాగ్య‌న‌గ‌రం నుంచి అయోధ్య‌కు 7,200 కిలోమీట‌ర్ల సాహ‌స యాత్ర‌కు శ్రీ‌కారం చుట్టారు. రామ మందిర ‘ప్రాణ్‌ప్రతిష్ఠ’ వేడుకకు హాజ‌రై స్వామివారికి బంగారు పాదుక‌లు స‌మ‌ర్పించేందుకు జూలై 20న చేప‌ట్టిన శాస్త్రి పాద‌యాత్ర‌ ఈ నెల 15న అయోధ్య‌కు చేర‌నున్న‌ది.


మ‌రో ఐదు రోజుల్లో అయోధ్య‌కు చేర‌నున్న శ్రీ‌నివాసశాస్త్రి బుధ‌వారం మీడియాతో మాట్లాడారు. శ్రీరాముని ‘వనవాస’ (అజ్ఞాతవాసం) ప్రయాణానికి అద్దం పడుతూ అయోధ్య-రామేశ్వరం మార్గాన్ని తిరిగి ప్రారంభిస్తున్నానని, జనవరి 15న అయోధ్యకు చేరుకుంటానని చెప్పారు.


“నేను 8 కిలోల వెండితో ఈ ‘చరణ్ పాదుక’ను తయారు చేయించాను. దానికి బంగారు పూత పూయించాను. రాముడు అయోధ్య నుంచి రామేశ్వరానికి వెళ్ళిన మార్గంలో నేను నడుస్తున్నాను. జనవరి 15న అయోధ్యకు చేరుకోవడమే నా లక్ష్యం’’ అని శ్రీ‌నివాస‌శాస్త్రి తెలిపారు. 16న ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌కు ఈ ‘చరణ్ పాదుక’ను అందజేస్తానని పేర్కొన్నారు.


జనవరి 22వ తేదీన రామ మందిరం ‘ప్రాన్ ప్రతిష్ఠ’ వేడుకకు ముందు అయోధ్యను సందర్శించడానికి రావ‌డం దైవ కృప‌గా భావిస్తున్నాన‌ని పేర్కొన్నారు. త‌న పాద‌యాత్ర సంద‌ర్భంగా మార్గ‌మ‌ధ్యంలో రాముడు స్థాపించిన శివలింగాల‌ను ద‌ర్శిస్తూ ముందుకు సాగుతున్న‌ట్టు తెలిపారు.


అయోధ్య రామ‌మందిరంలో ‘ప్రాణ్ ప్రతిష్ఠ’ వేడుక జనవరి 16న ప్రారంభమై ఏడు రోజులపాటు జరగనున్న‌ది. చివరి రోజైన జనవరి 22న ఉదయం పూజ అనంతరం మధ్యాహ్నం ‘మృగశిర నక్షత్రం’లో రామ్‌ల‌ల్లా విగ్ర‌హాన్ని ప్రతిష్ఠించనున్నారు. రాముడి జన్మస్థలం, అయోధ్య, ప్రజలకు గొప్ప ఆధ్యాత్మిక, చారిత్రక,సాంస్కృతిక ప్రాముఖ్యతను కలిగి ఉన్న‌ది. శ్రీరామజన్మభూమి తీర్ధ క్షేత్ర ట్రస్ట్ ఈ వేడుకలకు 4,000 మంది సాధువులను ఆహ్వానించింది.